సినిమా పేరు: రివాల్వర్ రీటా
తారాగణం: కీర్తి సురేష్, రాధికా, సునీల్, రెడీన్ కింగ్ స్లే, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్, అజయ్ ఘోష్ తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ కె ఎల్
మ్యూజిక్: సీన్ రొల్డన్
రచన, దర్శకత్వం: జె కె చంద్రు
సినిమాటోగ్రాఫర్: దినేష్ బి. కృష్ణన్
బ్యానర్: ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్
నిర్మాతలు: సుదాన్ సుందరం, జగదీష్ పళని స్వామి
విడుదల తేదీ: నవంబర్ 28 ,2025
కీర్తి సురేష్(Keerthy Suresh)టైటిల్ రోల్ పోషించిన క్రైమ్ కామెడీ ఫిలిం 'రివాల్వర్ రీటా'(Rivolver Rita)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతో పాటు కీర్తి సురేష్ మూవీ గురించి చెప్పిన పలు విషయాలతో 'రివాల్వర్ రీటా' పై అందరిలో మంచి ఆసక్తి నెలకొంది. సీనియర్ నటీమణి రాధికా(Radhika Sarathkumar),సునీల్(Sunil)వంటి వారు సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దీంతో మూవీ లవర్స్ రీటా రివాల్వర్ వైపు ఒక కన్నేసి ఉంచారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రీటా(కీర్తి సురేష్) పిజ్జా రెస్టారెంట్ లో సేల్స్ మేనేజర్ గా పని చేసే పెళ్లి కానీ ఒక మధ్య తరగతి యువతి. అద్దె ఇంట్లో తల్లి చెల్లమ్మ(రాధికా) పెళ్లి అయ్యి సంవత్సరం వయసు గల పాప ఉన్న అక్క, నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న చెల్లితో ఉంటుంటుంది. తండ్రి, కొడుకులైన డ్రాకులా పాండియన్ (సూపర్ సుబ్బరాయన్), డ్రాకులా బాబీ(సునీల్) పేరు మోసిన అసాంఘిక శక్తులు. ఆ ఇద్దరి పేరు చెబితే భయపడని వారంటు ఉండరు. అంత నరరూప రాక్షసులు. జయబాల్ రెడ్డి (అజయ్ ఘోష్) హైదరాబాద్ కి చెందిన మరో రౌడీ. రెడ్డి ఖాతాలో ఎన్నో హత్యలు ఉన్నాయి.పోలీస్ ఇన్ స్పెక్టర్ కామరాజ్(జాన్ విజయ్) ఒక శాడిస్టు. డబ్బు కోసం ఎంత పని అయినా చేస్తాడు. మార్టిన్, దాస్ డబ్బు కోసం హత్యలు చేసే మరో ఇద్దరు అసాంఘిక శక్తులు. ఈ అందరి నుంచి రీటా ఫ్యామిలీ ఒక ఆపదలో చిక్కుకుంటుంది. రీటా ఫ్యామిలీకి వచ్చిన ఆపద ఏంటి? ఎన్నో కుటుంబాలు ఈ భూమ్మీద ఉండంగా వాళ్లకే అసాంఘిక శక్తుల వలన ప్రాబ్లెమ్ ఎందుకు వచ్చింది? మరి ఆ అందరిని రీటా అండ్ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది? కృష్ణ భగవానుడు భగవద్గీత లో చెప్పినట్టుగా కర్మ సిద్ధాంతానికి రీటా రివాల్వర్ కథకి ఏమైనా సంబంధం ఉందా అనేదే చిత్ర కథ.
ఎనాలసిస్ :
సింపుల్ లైన్ కి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా పకడ్బందీ స్క్రీన్ ప్లే తో క్యారెక్టర్స్ ని ఉపయోగించిన తీరుకి దర్శక రచయిత చంద్రు కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. కథ ట్రావెల్ అయ్యే కొద్దీ మూవీలో క్యూరియాసిటీ ఏ మాత్రం తగ్గకుండా ఉంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్స్ తీరు తెన్నులు, వేష ధారణ, వాయిస్ కూడా వినూత్నంగా ఉండటంతో ఎక్కడ బోర్ కొట్టకుండా సాగింది. సస్పెన్సు ని క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయినా అందరికి తెలిసిన కథ కావడం, ఇలాంటి కథ, కథనాలకి మనం ఎప్పుడో అలవాటు పడి ఉండటం అనేదే కొంచం మైనస్. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే సినిమా ప్రారంభమే ఇంట్రెస్ట్ పాయింట్ తో ప్రారంభమైంది. దీంతో మూవీలో లీనమైపోతాం. రీటా, అచ్చమ్మ కి మధ్య వచ్చిన సన్నివేశాలు బాగున్నాయి. మెయిన్ పాయింట్ లోకి వెంటనే వెళ్లడంతో, ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ అన్ని మంచి ఆసక్తిని కలగచేసాయి.
రీటా అండ్ ఫ్యామిలీ తో డ్రాకులా పాండియన్ తో వచ్చిన సీన్స్ అయితే సూపర్. మనకి తెలియకుండానే మన పక్కింటి వాళ్ళ కథ చూస్తున్నాం అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. అంతలా మెస్మరైస్ చేసాయి. పోలీస్ ఇన్ స్పెక్టర్ కామరాజ్ తో వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి. బాగుండటమే కాదు నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. గ్యాంగ్ స్టార్స్ ఎలా ఉంటారో, నమ్మకం కోల్పోయాక వాళ్ళల్లో వాళ్లే ఒకరికొకరు ఎలా చంపుకుంటారో చెప్పిన సీన్స్ బాగున్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించేదే అయినా అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఊహించని విధంగా క్యారక్టర్ ల తీరుతెన్నులు సాగి ఎంతో ఉత్కంఠతని కలిగిస్తాయి. పోలీస్ స్టేషన్ సీన్స్ తో పాటు రీటా ఫ్యామిలీ అశాంఘిక శక్తుల నుంచి ఎలా తప్పించుకుంటారనే ఆసక్తి తగ్గకుండా కథనాలు రన్ అయ్యాయి. రెడ్డి ఫోన్ సన్నివేశాలు బాగున్నాయ్. కాకపోతే రీటా అండ్ ఫ్యామిలీకి గతంలో జరిగిన నష్టాన్ని వారెవరికీ తెలియకుండానే పగ తీర్చుకున్నారని చెప్పుంటే కొత్తగా ఉండేదేమో. కామెడీ కింగ్ రెడీన్ కింగ్ స్లే కామెడి సీన్స్ మరో హైలెట్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అయితే ఊహకి అందని విధంగా సాగి మూవీ విజయంలో ప్రధాన బలంగా నిలిచాయి.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
రీటాగా కీర్తి సురేష్ క్యారక్టర్ లో భిన్నమైన షేడ్స్ లేకపోయినా ఓవర్ డోస్ లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్సు ని ప్రదర్శించింది. సదరు క్యారక్టర్ లో ఆమెని తప్ప మరొకర్ని ఉహించుకోలేం. అంతలా తన నటనతో మెస్మరైజ్ చేయడమే కాకుండా మూవీకి ప్లస్ గా నిలిచింది. తల్లిగా చేసిన రాధిక అయితే తనని ఎవర్ గ్రీన్ నటి అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించింది. ఆమె వల్ల సినిమాకి నిండు తనం వచ్చింది. కీర్తి సురేష్ సోదరీమణులుగా చేసిన వారు కూడా ఎక్స్ లెంట్ గా నటించారు. బాబీ అనే దాదా క్యారక్టర్ లో సునీల్ మరోసారి కెరీర్ లోనే బెస్ట్ విలనిజాన్ని ప్రదర్శించాడు. అజయ్ ఘోష్, సూపర్ సుబ్బరాయన్, రెడీన్ కింగ్ స్లే, కళ్యాణ్ మాస్టర్ నటన కూడా సినిమా విజయానికి హెల్ప్ అయ్యింది. ఇక దర్శకుడిగా, రచయితగా చంద్రు(Jk Chandru)నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. ప్రతి సీన్ లోను తన పని తనం కనపడింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ ప్రాణంగా నిలిచాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కథ, కథనాలతో కూడిన సినిమాలు చాలానే వచ్చాయి. కానీ చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టదు.పెట్టిన టికెట్ డబ్బులకి వినోదం, సస్పెన్సు, ఉద్వేగం నూటికి నూరు శాతం గ్యారంటీ.