తారాగణం: అఖిల్ రాజ్, తేజస్వి రావు, చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనితా చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు
డీఓపీ: వాజిద్ బేగ్
ఎడిటర్: నరేష్ అడుపా
సంగీతం: సురేష్ బొబ్బిలి
రచన, దర్శకత్వం: సాయిలు కంపాటి
నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
బ్యానర్స్: ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్
విడుదల తేదీ: నవంబర్ 21, 2025
'లిటిల్ హార్ట్స్' తర్వాత ఈటీవీ విన్ ఒరిజినల్స్ నుండి వచ్చిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'. విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాతో నిర్మాతగా మారడం విశేషం. నూతన దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన 'రాజు వెడ్స్ రాంబాయి'.. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. రా లవ్ స్టోరీగా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం, ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
ఇది రాష్ట్ర విభజనకు ముందు.. 2010 ప్రాంతంలో తెలంగాణలోని ఇల్లందు సమీప గ్రామంలో జరిగే కథ. రాజు(అఖిల్ రాజ్) తన స్నేహితులతో కలిసి బ్యాండ్ కొడుతుంటాడు. ఆ చుట్టుపక్కల పెళ్ళయినా, చావైనా రాజు డప్పు మోగాల్సిందే. అయితే రాజు డప్పు కొట్టడం అతని తండ్రి(శివాజీరాజా)కి ఇష్టముండదు. వేరే పని చూసుకోమని లేదా సిటీకి వెళ్ళమని పోరుపెడుతుంటాడు. రాజుకి అదే ఊరిలో ఉండే రాంబాయి(తేజస్విరావు) అంటే పిచ్చి ప్రేమ. రాజు బ్యాండ్ కొట్టే స్టైల్ ని ఇష్టపడే రాంబాయి.. తనపై రాజు చూపించే ప్రేమకు కరిగిపోయి, తను కూడా క్రమంగా పీకల్లోతు ప్రేమలో పడుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న(చైతు జొన్నలగడ్డ) మొండివాడు, మూర్ఖుడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేసే వెంకన్న.. తనకు కాబోయే అల్లుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండాలనే పట్టుదలతో ఉంటాడు. అలాంటి వెంకన్న తన కూతురు బ్యాండ్ కొట్టేవాడిని ప్రేమించిందని తెలిసి ఏం చేశాడు? తమ ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించడం కోసం రాజు, రాంబాయి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? వీరి ప్రేమకథ విజయతీరాలకు చేరిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
ప్రచార చిత్రాలతోనే ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక రా లవ్ స్టోరీ అనే క్లారిటీ వచ్చేసింది. అందుకు తగ్గట్టుగానే.. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో.. ఒక ప్రేమ జంట, కొందరు మనుషుల మధ్య కెమెరా పెడితే ఎలా ఉంటుందో.. అంత సహజంగా ఉంది ఈ సినిమా.
ఫ్రెండ్ పెళ్ళిలో రాజు చేసే హడావుడితో, రాంబాయిపై రాజుకి ఉన్న ఇష్టాన్ని తెలిపే సన్నివేశాలతో.. సినిమా ప్రారంభమైంది. రాజు, రాంబాయి మధ్య ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఒకవైపు వీరి ప్రేమ కథను చూపిస్తూనే.. మరోవైపు రాజు స్నేహితులతో వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది.
నిజానికి సన్నివేశాలు పూర్తిగా కొత్తవి కాదు. ఈ తరహా సీన్స్ అంతకముందు చూసినవే. కానీ సహజత్వం.. ఆ సన్నివేశాలకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది.
ఫస్ట్ హాఫ్ లవ్, కామెడీ సీన్స్ తో బోర్ కొట్టకుండా బాగానే నడిచింది. ముఖ్యంగా 90s కిడ్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. ఇక ఒక మంచి ఎమోషనల్ ఎపిసోడ్ తో ఫస్ట్ హాఫ్ ని ముగించడం బాగుంది.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త తడబాటు కనిపించింది. సెకండాఫ్ స్టార్టింగ్ లో హీరో సిటీకి వెళ్ళిన సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా లేవు. రాజు ఊరికి తిరిగొచ్చాక, రాంబాయి వచ్చి కలిసే ఎపిసోడ్ మాత్రం బాగుంది.
సెకండాఫ్ లో ప్రధానంగా ఎమోషన్స్ మీదనే దృష్టి పెట్టాడు దర్శకుడు. ఈ క్రమంలో అప్ అండ్ డౌన్స్ కనిపించాయి. పతాక సన్నివేశాలు మాత్రం సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కడా చూడని క్లైమాక్స్ ఇది. వాస్తవ సంఘటన అని చెప్పినప్పటికీ.. అసలు నిజంగా ఇలా చేస్తారా?! అనుకునేలా ఆ క్లైమాక్స్ ఉంది.
అయితే క్లైమాక్స్ అంత సర్ ప్రైజింగ్ గా ఉన్నప్పటికీ.. దానికి ముందు, వెనుక డ్రామాను ఇంకా ప్రభావవంతంగా రాసుకోవాల్సింది. ముఖ్యంగా ఆ ఊహించని ఘటన తర్వాత.. రాంబాయి దగ్గరకు రాజు వెళ్లే సీన్ ని ఇంకా బాగా తీసి ఉండాల్సింది. కథకి ఆయువు పట్టయిన ఆ సీన్ లో.. రైటింగ్, విజువల్స్, మ్యూజిక్ పరంగా ఇంకా రెట్టింపు ఎఫర్ట్ చూపించాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నూతన నటీనటులు అయినప్పటికీ రాజు, రాంబాయి పాత్రలలో అఖిల్ రాజ్, తేజస్వి రావు చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా తేజస్వి తన సహజ నటనతో కట్టిపడేసింది. అఖిల్ కూడా బాగానే చేసినప్పటికీ.. ఈ ప్రేమ కథకు ప్రాణమైన బ్యాండ్ కొట్టే సన్నివేశాల్లో మాత్రం ఎందుకనో తేలిపోయినట్టు అనిపించింది. బలుపు, మూర్ఖత్వానికి కేరాఫ్ లాంటి వెంకన్న పాత్రలో చైతు జొన్నలగడ్డ ఆకట్టుకున్నాడు. సరైన పాత్రలు పడితే నటుడిగా నిలదొక్కుకుంటాడు. హీరో తండ్రి పాత్రలో శివాజీ రాజా తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. హీరో ఫ్రెండ్ డాంబర్ రోల్ చేసిన ఆర్టిస్ట్ బాగానే నవ్వించాడు. అనితా చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడిలో విషయం ఉంది. ప్రయత్నంలో నిజాయితీ ఉంది. రచన విషయంలో మరింత కేర్ తీసుకుంటే.. అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. ఇలాంటి సినిమాలకు సంగీతం కీలకం. సురేష్ బొబ్బిలి తనదైన సంగీతంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రేమ సన్నివేశాల్లోనూ, వెంకన్న సన్నివేశాల్లోనూ వైవిధ్యం చూపిస్తూ.. బాగానే మ్యాజిక్ చేశాడు. వాజిద్ బేగ్ కెమెరా పనితనం సహజత్వం ఉట్టిపడేలా ఉంది. నరేష్ అడుపా ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ప్రయత్నం బాగుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంది. కానీ, పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. రా లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశముంది.
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.