తారాగణం: రోషన్, శ్రీలీల, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పోసాని, 'వెన్నెల' కిషోర్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి, ప్రగతి, ఝాన్సీ, రాజీవ్ కనకాల, అన్నపూర్ణ
రైటర్: శ్రీధర్ సీపాన
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామ
కూర్పు: తమ్మిరాజు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: గౌరీ రోణంకి
శ్రీకాంత్ కథానాయకుడిగా దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమా 'పెళ్లి సందడి'. అప్పట్లో మాంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తర్వాత క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా స్ఫూర్తితో, కొన్ని మార్పులతో తీసిన తాజా సినిమా 'పెళ్లి సందD'. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించడం విశేషం. దీనికి దర్శకేంద్రులు రాగేవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. మరి, సినిమా ఎలా ఉంది?
కథ:
ఓ అమ్మాయి (శివానీ రాజశేఖర్) తీస్తే వశిష్ఠ ( రాఘవేంద్ర రావు) బయోపిక్ తీస్తానని భీష్మించుకుని ఉంటుంది. తండ్రి (రాజేంద్ర ప్రసాద్) సహకారంతో వశిష్ఠను కలుస్తుంది. అప్పుడు వశిష్ఠ తన కథను చెప్పడం మొదలు పెడతారు. ఫ్లాష్ బ్యాక్ కి వెళితే... వశిష్ఠ (రోషన్) బాస్కెట్ బాల్ ప్లేయర్. అతను ఓ పెళ్లికి వెళ్తాడు. అక్కడ చూసిన సహస్ర (శ్రీ లీల)తో ప్రేమలో పడతాడు. వీరి ప్రేమకథలో సమస్య ఏమిటి? మధ్యలో సహస్ర వశిష్ఠకు కూడా కనిపించకుండా ఎక్కడికి వెళ్లింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.
ఎనాలసిస్ :
పాత సినిమాలను రీమేక్ లేదా రీక్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు... అప్పట్లో సినిమా విజయానికి కారణమైన అంశాలు ఏంటనేది విశ్లేషించుకోవడంతో పాటు ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవడం అవసరం. 'పెళ్లి సందడి' విజయంలో పాటలు ముఖ్య భూమిక పోషించాయి. సినిమా సక్సెస్ క్రెడిట్లో కామెడీ సన్నివేశాలది మేజర్ షేర్ కూడా! అప్పటికి, ఇప్పటికి పాటలు-కామెడీ సీన్ల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారింది. 'కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా?' అంటే నవ్వే రోజులు పోయాయి. కథాపరంగానూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్పులు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఏజ్ ఓల్డ్ స్టోరీతో సినిమా తీస్తే జనాలు చూడడం కష్టమేమో! ఆ విషయంలో చెక్ చేసుకోకుండా 'పెళ్లి సందD' టీమ్ ఫ్లాప్‌లో కాలు వేసింది.
కథ పరంగా పాత 'పెళ్లి సందడి', కొత్త 'పెళ్లి సందD' మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అయితే, కొత్త 'పెళ్లి సందD'లో కథేమంత బలంగా లేదు. పైగా, అవుట్ డేటెడ్ కామెడీ ఒకటి. కథతో పాటు కాకుండా కామెడీ కోసమని సన్నివేశాలను ఇరికించినట్టు తెలుస్తుంది. 'ఈ బొప్పాయి మామూలు బొప్పాయి కాదు అల్లుడు', 'కాఫీరా...' వంటి డైలాగులు నవ్వించలేదు. దర్శకురాలిగా గౌరీ రోణంకి తన ముద్ర వేసిన సన్నివేశాలు తక్కువ. ఎక్కువ రాఘవేంద్రరావు స్టయిల్ మీద ఆధారపడ్డారు. స్టోరీ, డైరెక్షన్ వీక్ అనుకుంటే... అంతకంటే వీక్ స్క్రీన్ ప్లే విసిగించింది. సినిమా చూస్తున్నంతసేపు ఇదీ పాతికేళ్ల క్రితం రావాల్సిన సినిమా అనిపిస్తుంటుంది. పాటల పరంగా కీరవాణి నోస్టాల్జియా ట్యూన్స్ ఇచ్చారు. వాటి పిక్చరైజేషన్ రాఘవేంద్రరావు స్టయిల్ లో ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
రోషన్ అందంగా ఉన్నాడు. అమ్మాయిలను అతడు ఆకట్టుకోవడం ఖాయం. నటుడిగానూ పర్వాలేదు. పాత్రకు తగ్గట్టు ప్రేక్షకులను మెప్పించేలా చేశాడు. రాఘవేంద్రరావు శైలిలో పాటలను చిత్రీకరించడం వలన హీరోయిన్ శ్రీలీల గ్లామరస్‌గా కనిపించింది. ఆమె అభినయం కూడా బావుంది. తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు రావచ్చు. హీరో ఓల్డ్ పాత్రలో రాఘవేంద్ర రావు కనిపించడం సినిమా ప్రత్యేకత. ఈమధ్య టీవీ షోలు, వేదికల్లో ఆయన ఎలా కనిపిస్తున్నారో... పాత్రలో కూడా అదే విధంగా ఉన్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ మొదలుకుని షకలక శంకర్ వరకు ఎవరి పాత్రలలోనూ కొత్తదనం లేదు. అందరూ పాత్రలకు తగ్గట్టు నటించారు. తమ అనుభవంతో సినిమాను కొంత నిలబెట్టే ప్రయత్నం చేశారు.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
'పెళ్లి సందD' థియేటర్లలో సందడి చేయడం కష్టమే. కొత్త సీసాలో పాత నీరు కింద... కొత్త నటీనటులతో కాలం చెల్లిన కథ పట్టుకుని సినిమా తీయడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టడం ఖాయం. దీనికి తోడు నిదానంగా సాగిన కథనం విసుగు తెప్పిస్తుంది. ఒకటి అరా ఎమోషనల్ సీన్లు పర్వాలేదంతే! మిగతా సినిమా అంతా అనవసరమైన కామెడీ సీన్లు విసిగించాయి. సినిమాకు సాంగ్స్ పిక్చరైజేషన్ ప్లస్ పాయింట్. ఎందుకంటే... ఇప్పట్లో ఆ విధంగా ఎవరూ తీయడం లేదు కనుక. పాటల కోసం ఎవరైనా సినిమాకు వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చు.
- వనమాలి