తారాగణం: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులు
సంగీతం: ఆర్ ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ ఎస్.జె.
ఎడిటింగ్: పీకే
ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్
దర్శకత్వం: విజయేందర్
బ్యానర్స్: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: బన్నీ వాస్ (బివి వర్క్స్ బ్యానర్)
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల
విడుదల తేదీ: అక్టోబర్ 16, 2025
తెలుగులో బడ్డీ కామెడీ సినిమాలకు మంచి ఆదరణే ఉంటుంది. 'జాతిరత్నాలు', 'మ్యాడ్' వంటి సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడదే బాటలో 'మిత్ర మండలి' వచ్చింది. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు విజయేందర్ రూపొందిన ఈ మూవీ.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. నిర్మాతలు కూడా సినిమా మీద నమ్మకంతో ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ వేశారు. మరి 'మిత్ర మండలి' ఎలా ఉంది? నిర్మాతల నమ్మకం నిజమైందా లేదా? అనేది రివ్యూలో చూద్దాం. (Mithra Mandali Review)
కథ:
జంగ్లీపట్నంలో కులం కోసం ప్రాణం తీయడానికి కూడా వెనకాడని నారాయణ(వీటీవీ గణేష్) ఉంటాడు. తన తుట్టె కులానికి చెందిన వాళ్ళు కులాంతర వివాహం చేసుకోవడం కాదు కదా.. కనీసం వేరే కులం వాళ్ళ రక్తం ఎక్కించుకున్నా ఒప్పుకోడు. అంత కులపిచ్చి. తన కుల బలంతో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు నారాయణ. ఓ ప్రముఖ పార్టీ అతనికి టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. అలాంటి సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక) ఇంటి నుండి పారిపోతుంది. పారిపోయిందని బయట తెలిస్తే పరువు పోతుందని, కిడ్నాప్ అయిందంటూ.. ఎస్ఐ సాగర్(వెన్నెల కిషోర్) సాయంతో కూతుర్ని వెతికే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో స్వేచ్ఛ పారిపోవడానికి.. అదే ప్రాంతానికి చెందిన పనిపాట లేకుండా తిరిగే నలుగురు స్నేహితులు చైతన్య(ప్రియదర్శి), సాత్విక్(విష్ణు), అభయ్(రాగ్ మయూర్), రాజీవ్(ప్రసాద్) లకు సంబంధం ఉందని తెలుస్తుంది. స్వేచ్ఛను తొలిచూపులోనే చూసి సాత్విక్, అభయ్ ప్రేమలో పడతారు. ఆమె ప్రేమని పొందడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు. మరి స్వేచ్ఛ ఎవరిని ప్రేమించింది? ఎవరి కోసం ఇంటి నుండి పారిపోయి వచ్చింది? స్వేచ్ఛ వల్ల నలుగురు ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆ నలుగురిని నారాయణ ఏం చేశాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
కామెడీ సినిమాల్లో కథాకథనాలతో అద్భుతాలు చేయాల్సిన అవసరంలేదు. సరైన సీన్స్, డైలాగ్స్ రాసుకొని.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలగాలి. అలా చేస్తే, విజయం సాధించినట్టే. కానీ, 'మిత్ర మండలి' విషయంలో అలాంటి మ్యాజిక్ జరగలేదు.
కథ చిన్నది, కొత్తదనం కూడా లేదు. అయితే సినిమా స్టార్టింగ్ లోనే 'కథలేని కథ' అని సరదాగా వాయిస్ ఓవర్ లో చెప్పించారు. కాబట్టి, మెజారిటీ కామెడీ సినిమాల్లాగే కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక కామెడీ విషయానికొస్తే, అసలు అదే వర్కౌట్ కాలేదు. కుల బలాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే అవుదామనుకునే వ్యక్తి కూతురైన హీరోయిన్ మిస్ అవ్వడం, ఆమె మిస్ అవ్వడానికి హీరో గ్యాంగ్ తో సంబంధం ఉండటం. ఆడియన్స్ ని నవ్వించడానికి ఈ సెటప్ సరిపోతుంది. దర్శకుడు కామెడీ సినిమాకి కావాల్సిన స్టోరీ సెటప్ బాగానే చేసుకున్నాడు కానీ.. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు తేలిపోయాయి. కామెడీ పంచెస్ కూడా పేలలేదు. దాదాపు సీన్స్ అన్నీ రొటీన్ గానే ఉన్నాయి. డైలాగ్స్ కూడా పంచెస్ లాగా కాకుండా, అందరూ అరిచి చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఆ డైలాగ్స్ ని డామినేట్ చేసేలా గ్యాప్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. దీంతో కామెడీలో న్యాచురాలిటీ పూర్తిగా మిస్ అయ్యి, ఫోర్స్డ్ కామెడీలా అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ నారాయణ కులపిచ్చి, మిత్ర మండలి గ్యాంగ్ పరిచయం, హీరోయిన్ మిస్సింగ్ వంటి సన్నివేశాలతో నడిచింది. హీరోయిన్ ఎవరిని లవ్ చేస్తుంది? అనేది జనరల్ ఆడియన్స్ కూడా గెస్ చేయగలరు. కాబట్టి, ఆ ట్విస్ట్ పెద్దగా కిక్ ఇవ్వదు. ఫస్ట్ హాఫ్ లో నవ్వుకునే సందర్భాలు చాలా తక్కువే. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్. ఛేజింగ్, లవ్ మ్యారేజ్ వంటి ఎపిసోడ్స్ లో ఒకట్రెండు చోట్ల నవ్వుకోవచ్చు. మొత్తానికి నవ్వించడమే లక్ష్యంగా తీసిన ఈ సినిమా, పెద్దగా నవ్వించలేకపోయిందని చెప్పాలి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ప్రియదర్శికి ఈ తరహా సినిమాలు, పాత్రలు కొత్త కాదు. జాతిరత్నాలు, బ్రోచేవారెవరురా వంటి పలు సినిమాలు చేశాడు. అయితే వాటిలో తన సహజ నటన, కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచిన ప్రియదర్శి.. ఇందులో మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక నటించిన మొదటి తెలుగు సినిమా ఇదే. అయితే ఆమె కామెడీ టైమింగ్ ని కూడా సరిగా వాడుకోలేదు. విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, సత్య తమ యాక్టింగ్ తో కొన్ని సీన్స్ ని నిలబెట్టడానికి ప్రయత్నించారు కానీ, రైటింగ్ తేలిపోవడంలో నవ్వులు పెద్దగా పండలేదు. ఇలా తెర నిండా నవ్వించగల మంచి ఆర్టిస్ట్ లు ఉన్నా.. సరైన సీన్స్, డైలాగ్స్ పడకపోవడంతో వారి నటన వృధా అయింది.
దర్శకుడు విజయేందర్ లో కామెడీ సెన్స్ ఉంది. కానీ అది ఓవర్ డోస్ అవ్వకుండా.. కరెక్ట్ మీటర్ లో సీన్స్, డైలాగ్స్ రాసుకోవాలి. అప్పుడే ఆ కామెడీ నేచురల్ గా అనిపించి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కామెడీ సినిమాలకు నేపథ్య సంగీతం కీలకం. పంచ్ కి తగ్గట్టుగా సరైన మ్యూజిక్ పడితే అది ఇంకా ఎలివేట్ అవుతుంది. మరి పంచ్ లు లేవనుకున్నాడో ఏంటో కానీ, ఆర్ఆర్ ధృవన్ గ్యాప్ లేకుండా మ్యూజిక్ ఇస్తూనే పోయాడు. చాలా సీన్స్ లో ఆ మ్యూజిక్ లౌడ్ గా అనిపిస్తుంది. పాటలు కూడా పెద్దగా మెప్పించలేదు. సిద్ధార్థ్ ఎస్.జె కెమెరా పనితనం బాగానే ఉంది. సినిమా టోన్ కి తగ్గట్టుగా ఫ్రేమ్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
తెర నిండా కమెడియన్స్ ఉన్నా.. నవ్వులు మాత్రం కొన్నే ఉన్నాయి.
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.