సినిమా పేరు: బైసన్
తారాగణం: ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, అమీర్, లాల్, కే పాండియన్, మదన్ కుమార్ దక్షిణామూర్తి తదితరులు
మ్యూజిక్: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: శక్తి తిరు
రచన, దర్శకత్వం: మారి సెల్వరాజ్
సినిమాటోగ్రాఫర్: ఎజిల్ అరసు కే
బ్యానర్స్ : అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలమ్ స్టూడియోస్
నిర్మాతలు: సమీర్ నాయర్, పా రంజిత్, అదితి ఆనంద్
విడుదల తేదీ: అక్టోబర్ 24 2025
తన తండ్రి చియాన్ విక్రమ్(Chiyan Vikram)లాగే సిల్వర్ స్క్రీన్ పై విభిన్న క్యారెక్టర్స్ ని పోషిస్తు వస్తున్నాడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram). ఈ కోవలోనే 'బైసన్'(Bison)తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారి సెల్వరాజ్(Mari Selvaraj)దర్శకుడు కావడంతో పాటు, ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న బైసన్ కి ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
కిట్టు(ధృవ్ విక్రమ్) కబడ్డీ ఆటలో మంచి ప్రావీణ్యాన్ని ప్రదర్శించే యువకుడితో పాటు కబడ్డీ ని తన ప్రాణంగా భావిస్తాడు. కాకపోతే సామాజికంగా,ఆర్ధికంగా పెద్దగా పలుకుబడి లేని కుటుంబం. దీంతో తండ్రి వేలుస్వామి(పశుపతి) కబడ్డీని ప్రోత్సహించడు. కిట్టు వర్గానికే చెందిన పాండిరాజన్ (అమీర్) అనే వ్యక్తి సదరు వర్గానికి నాయకుడు. కిట్టు ఊరి వాళ్ళందరు దేవుడిలా కొలుస్తారు. పక్క ఊరుకి చెందిన కందస్వామి (లాల్) ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి. పాండిరాజన్, కందస్వామికి మధ్య ఒకరికొకరు చంపుకునేంత పగ. రెండు వైపులా ఎంతో ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కందస్వామి కి కబడ్డీ అంటే ప్రాణం. కిట్టు కబడ్డీ ఆడే విధానం నచ్చడంతో, కిట్టు ఎవరో తెలిసి కూడా తన జట్టు తరుపున ఆడిస్తాడు. అత్యున్నత స్థాయిలో ఉంటావని కూడా ఆశీర్వదిస్తాడు.
ఈ క్రమంలో కందస్వామిపై పాండిరాజన్ మనుషులు హత్యాప్రయత్నం చేస్తారు. దీంతో కిట్టుని జట్టు నుంచి పంపిచేస్తారు. మరి కిట్టు కబడ్డీ లక్ష్యం ఏమైంది? పాండిరాజన్, కందస్వామి ల గొడవలు కిట్టు కబడ్డీ ఆటపై ప్రభావం చూపించాయా? ఒక వేళ ప్రభావం చూపిస్తే వాటి తీరు తెన్నులు ఎలా ఉన్నాయి? వాటిని కిట్టు ఎలా ఫేస్ చేసాడు? తండ్రి కిట్టు ని కబడ్డీ ఆటని వద్దని అనడానికి, ఇప్పుడు జరుగుతున్న గొడవలకి ఏమైనా సంబంధం ఉంది? అసలు పాండిరాజన్, కంద స్వామి గొడవల్లో ఎవరు అంతమయ్యారు? ఈ కథలో అనుపమా పరమేశ్వరన్ పోషించిన రాణి క్యారక్టర్ ఏంటి? బైసన్ అంటే ఏంటి? కబడ్డీ లో కిట్టు తాను అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా? ఆ లక్ష్యం యొక్క స్థాయి ఎలాంటిది అనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్ :
90 వ దశకంలో జరిగే కథ కావడం, కథనం, క్యారక్టర్ ల తీరు తెన్నులు కూడా అదే విధంగా ఉండటం 'బైసన్' కి ప్లస్ గా నిలిచింది. కబడ్డీ తప్ప, కక్షలు, కార్పణ్యాలు తెలియని ఒక అట్టడగువర్గానికి చెందిన యువకుడు తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ఎన్ని అవరోధాలని ఎదుర్కుంటాడో చాలా చక్కగా చూపించారు. మరి ముఖ్యంగా ఒక మనిషి మంచితనానికి, చెడు స్వభావానికి జాతి, కులం, మతం, ప్రాంతం అనేవి ఉండవని, అన్ని వర్గాల్లోను ఆయా ప్రవర్తన గల మనుషులు ఉంటారని చెప్పడం కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ప్రారంభమే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ పోటీల్లో కిట్టు లాంటి జూనియర్ ప్లేయర్ ఆడకూడదని చెప్పడం, ఆ తర్వాత కిట్టు పాయింట్ ఆఫ్ లో స్టోరీ ప్రారంభం కావడం చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. 90 ల్లో ఊరు వాతావరణం ఎలా ఉంటుందో క్లియర్ గా చూపించడంతో పాటు రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి ఒకరికొకరు చంపుకుంటూ ఉండటంతో కిట్టు క్యారక్టర్ పై ఆసక్తి కలిగింది. కాకపోతే హింస ఎక్కువ పాళ్ళు. ఇలాంటి కథలకి కామెడీని సృష్టించవచ్చు. ఆ దిశగా చెయ్యలేదు. కిట్టు, రాణి మధ్య లవ్ ని కూడా పెద్దగా వర్క్ అవుట్ చెయ్యలేదు. ఎంత సేపు కథ మొత్తం అక్కడిక్కడే నడిచినట్లయింది. కాకపోతే గ్రామాల మధ్య వైరానికి సంబంధించిన సీన్స్ తో పాటు కబడ్డీ కి సంబంధించిన సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథనంలో వేగం పెరిగింది. కిట్టు, కందస్వామి మధ్య వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి. పాండిరాజన్ సీన్స్ కూడా హైలెట్. ప్రతి క్యారక్టర్ కి ఇచ్చిన ముగింపుతో నాయకులూ మంచి వాళ్లే అయ్యి ఉంటారు. చుట్టూ ఉన్న వ్యక్తులే ప్రమాదకరం అనే హింట్ ని ఇచ్చారు. ఒంటి చేత్తో కబడ్డీ ఆడటం కొంచం విడ్డూరంగా అనిపించినా, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. జపాన్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ని భారీగా తెరకెక్కించాల్సింది. అందరు ఊహించినట్టుగా ముగింపు ఉంది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
కిట్టు క్యారక్టర్ కి ధ్రువ్ విక్రమ్ నూటికి నూరుపాళ్లు న్యాయం చేసాడు. క్యారక్టర్ లో భిన్న పార్శ్యాలు లేకపోయినా తన కెరీర్ లో మరో మంచి చిత్రంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాణిగా అనుపమ పరమేశ్వరన్ క్యారక్టర్ లో పెద్దగా మెరుపులు లేవు. అసలు ఆ క్యారక్టర్ ని చూసిన తర్వాత ఆమె ఎలా ఒప్పుకుందో అనే డౌట్ వస్తుంది. పెద్దగా సీన్స్ కూడా లేవు. ఒక వేళ ఎడిటింగ్ లో సీన్స్ తొలగించారేమో తెలియదు. పశుపతి, లాల్, అమీర్ స్కూల్ టీచర్‌గా చేసిన మదన్ కుమార్ అయితే అధ్బుతమైన పెర్ ఫార్మెన్స్ తో బైసన్ కి ప్రాణంగా నిలిచారు. సాంగ్స్ బాగోక పోయినా నివాస్ కే ప్రసన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫొటోగ్రఫీ కూడా అత్యద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సో సో. ఇక మారి సెల్వరాజ్ మరో సారి తన దర్శకత్వ ప్రతిభ తో ఆకట్టుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ ని నిండుగా ఉండేలా చూసుకున్నాడు. షాట్స్ లో చేసిన కొత్త ప్రయోగం కూడా బాగుంది. కాకపోతే రచయితగా మాత్రం మెరుపులు చూపించలేకపోయాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఫైనల్ గా చెప్పాలంటే కథనాల్లో పెద్దగా పట్టు చూపించకపోయినా, నటీనటుల పెర్ ఫార్మెన్స్, ఫొటోగ్రఫీ బైసన్ కి ప్రాణంగా నిలిచాయి. సెకండ్ హాఫ్ మెప్పిస్తుంది.