తారాగణం: అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, జీవన్ కుమార్, అనీష్ కురువిల్లా, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు
డీఓపీ: కుశేందర్ రమేష్ రెడ్డి
ఎడిటర్: నాని కాసరగడ్డ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
రచన: అనిల్ విశ్వనాథ్
దర్శకత్వం: నాని కాసరగడ్డ
నిర్మాతల: శ్రీనివాసా చిట్టూరి
బ్యానర్స్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: నవంబర్ 21, 2025
కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్.. కొంతకాలంగా రూట్ మర్చి, విభిన్న జానర్స్ లో సినిమాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో పరాజయాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఇప్పుడు '12A రైల్వే కాలనీ' అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ రూపొందించిన ఈ చిత్రానికి 'పొలిమేర' దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? నరేష్ ఎదురుచూస్తున్న విజయాన్ని అందించిందా? (12A Railway Colony Review)
కథ:
కార్తీక్(అల్లరి నరేష్) వరంగల్ లోని రైల్వే కాలనీకి చెందినవాడు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, ఎమ్మెల్యే అవ్వాలన్న తన కలను నెరవేర్చుకోవాలనే కసితో ఉన్న రాజకీయ నాయకుడు టిల్లు(జీవన్ కుమార్)కి కార్తీక్ అనుచరుడు. ఫ్రెండ్స్ తో కలిసి బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండే కార్తీక్.. అదే కాలనీలో ఉండే ఆరాధన(కామాక్షి భాస్కర్ల)పై మనసు పారేసుకుంటాడు. ఆరాధన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆటే ప్రాణంగా బ్రతికే ఆమెకు విదేశాల్లో టోర్నమెంట్ ఆడాలంటే.. మూడు లక్షలు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసం ఇల్లీగల్ పని చేయడానికి సిద్ధపడిన కార్తీక్.. విజయవాడ వెళ్తాడు. అయితే తిరిగొచ్చేసరికి ఆరాధన కనిపించదు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అసలు ఆరాధనకు ఏమైంది? ఆమె కనిపించకుండా పోవడానికి టిల్లుకి ఏమైనా సంబంధం ఉందా? ఆరాధనను వెతుక్కుంటూ ముంబై నుండి వచ్చిన షిండే(అనీష్ కురువిల్లా) ఎవరు? పోలీసులకు సవాలుగా మారిన జంట హత్యల కేసు ఏంటి? ఆ హత్యలు చేసింది ఎవరు? ఈ కేసుని సాల్వ్ చేయడానికి కార్తీక్ ఎందుకు రంగంలోకి దిగాడు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ దాదాపు ఒకే టెంప్లేట్ లో నడుస్తాయి. ఒక హత్య జరుగుతుంది. దాని చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ తో ఊహించని మలుపులతో కథనం సాగుతుంది. హంతకుడు ఎవరనే ట్విస్ట్ ను రివీల్ చేస్తూ సినిమాని ముగిస్తారు. 12A రైల్వే కాలనీ పేరుకే క్రైమ్ థ్రిల్లర్. కానీ, కలగూరగంపలా ఉంటుంది. అసలు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో.. ఎటెటు తిరిగి, ఎక్కడ ఆగిందో.. అక్షరాల్లో వర్ణించడం కష్టం.
థ్రిల్లర్ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో.. ప్రేక్షకులను మొదటి నుండి కథలో ఇన్వాల్వ్ చేసేలా ప్రారంభమవ్వాలి. కానీ, ఈ సినిమా చాలా నీరసంగా మొదలైంది. అల్లరి నరేష్ తన ఫ్రెండ్స్ తో ఆత్మలు, దెయ్యాలు గురించి మాట్లాడుతుంటాడు. ఆ సీన్ లో మాటలు తప్ప, మేటర్ ఉండదు. ఆ తర్వాత మంచు కొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్నట్టు కల. ఇలా ఒక గ్రామర్ అంటూ లేకుండా సీన్స్ వస్తూ ఉంటాయి.
సినిమాలో ప్రతి సీన్ కి ఒక పర్పస్ ఉండాలి. ఆ సీన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం? ఆ సీన్ వల్ల కథకు ఎంత ఉపయోగం? అనే లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలేవీ వేసుకోకుండా.. పొడిపొడి మాటలతో స్క్రిప్ట్ ని చుట్టేసినట్టు ఉంది. రైటింగ్ కి తగ్గట్టుగానే.. మేకింగ్ కూడా అలాగే ఉంది. కెమెరా పెట్టేసి, ఈ సీన్ లో ఆర్టిస్టులకు ఉన్న డైలాగులన్నీ టకాటకా చెప్పించేశాం.. ఇక అయిపోయింది అన్నట్టుగా సీన్స్ ఉన్నాయి. అసలు ఆ సీన్ లో ఉన్న ఎమోషన్ ఏంటి? ఆ ఎమోషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్తున్నామా? అనే ఆలోచనే లేనట్టుగా అనిపిస్తుంది. ఒక సీన్ లో నరేష్ తన ఫ్రెండ్ తో ఎప్పుడూ లేనిది ఎమోషనల్ అయిపోతున్నానని అంటాడు. కానీ, అతను ఎమోషనల్ అవుతున్నట్టు మనకు అసలు అనిపించదు. ఇది ఉదాహరణ మాత్రమే.
ఈ సినిమాకి ప్రధాన మైనస్ రైటింగ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏ పరంగానూ మెప్పించలేకపోయారు. పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమా రచయిత. పొలిమేర సర్ ప్రైజ్ హిట్. అప్పట్లో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ చేసింది. అలా అని కేవలం ట్విస్ట్ వల్లే.. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోవడం అవివేకం. ఆ ట్విస్ట్ ఆ రేంజ్ లో వర్కౌట్ అవ్వడానికి.. దానికి ముందు చేసుకున్న సెటప్ కారణం.
ట్విస్ట్ వల్లే పొలిమేర హిట్ అనే భ్రమల్లో ఉండి.. కేవలం ఒక క్లైమాక్స్ ట్విస్ట్ ని పట్టుకొని, దానికి ముందు ఏదోకటి రాసేస్తే.. ఆడియన్స్ చూస్తారనుకుంటే పొరపాటు. అలాంటి భ్రమల్లో ఉండి రాసిన కథ '12A రైల్వే కాలనీ' అనిపిస్తుంది. అలా అని క్లైమాక్స్ ట్విస్ట్ గొప్పగా ఉందా అంటే.. అదీ లేదు.
నిజానికి అసలు కథ ఇంటర్వెల్ కి ముందు కానీ ఓపెన్ అవదు. ఆ జంట హత్యల కేసు ముందు వరకు.. ఏవేవో సీన్స్ తో నింపేశారు. ఇంటర్వెల్ సీన్ తప్ప.. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ గానే నడిచింది. సెకండాఫ్ అంతో ఇంతో బెటర్ అయినప్పటికీ.. థ్రిల్లర్ సినిమాకి తగ్గట్టుగా కథనంలో పెద్దగా మెరుపుల్లేవు. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యాక.. దీనికోసమా ఇదంతా అనిపిస్తుంది.
పేరుకి సినిమా నిడివి రెండు గంటలే అయినప్పటికీ బోర్ కొడుతుంది. పైగా మధ్యలో పాటలు ఒకటి. ఇది థ్రిల్లర్ అనే విషయం మరిచిపోయి.. ఏదేదో చేసేశారు. పైగా ఈ సినిమాకి "13B రైల్వే కాలనీ" సీక్వెల్ అనౌన్స్ చేయడం విశేషం.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడటం తప్ప కార్తీక్ పాత్రలో నటుడిగా అల్లరి నరేష్ కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏంలేదు. కామాక్షి భాస్కర్ల తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ తో కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే నరేష్ కి తగ్గ జోడీ కాదు అనిపించింది. సాయి కుమార్, జీవన్ కుమార్, అనీష్ కురువిల్లా, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నినల్ గా కూడా సినిమా గొప్పగా లేదు. అసలు ఈ జానర్ కి పాటలే అవసరం లేదంటే.. ఆ పాటలు కూడా ఆకట్టుకునేలా లేవు. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా ప్రభావవంతంగా లేదు. శేందర్ రమేష్ రెడ్డి కెమెరా పనితనం పరవాలేదు. దర్శకుడిగానే కాదు, ఎడిటర్ గానూ నాని కాసరగడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
12A రైల్వే కాలనీ కాదిది.. రెండు గంటల బోరింగ్ మూవీ...