సూర్యాకాంతం మంచి మనసు గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పేవారు. సినిమాల్లో తాను పోషించిన గయ్యాళి అత్త పాత్రల వల్ల ఆమెను సినిమాల్లో చూసిన అప్పటి స్త్రీ లోకమంతా నానాతిట్లూ తిట్టి ఆడిపోసుకునేవారట. కానీ నిజానికి సూర్యాకాంతం గారి మనసు వెన్నపూసనీ, ఎవరికి ఏ మాత్రం కష్టమొచ్చినా అది తనకే వచ్చినంతగా బాధపడేవారనీ, వారికి తనవంతు సాయం ఏ మాత్రం చేయగలిగినా తప్పకుండా చేయటానికి ప్రయత్నించేవారనీ ఎవరికీ తెలియదు.
అంతే కాకుండా ఆమె షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు తన సహనటీనటులందరికీ తన ఇంటివద్ద తాను స్వయంగా వండిన పిండివంటలను, భోజనాన్ని స్వయంగా వడ్డించి తినిపించేవారనీ ఎంతమందికి తెలుసు. తుఫాను బాధితుల సహాయార్థం కీర్తిశేషులు యన్ టి ఆర్ తో కలసి సూర్యాకాంతం గారు కూడా జోలెపట్టి చందాలు వసూలు చేసిన సందర్భాలు అనేకమున్నాయి. వెండి తెర మీద గయ్యాళి పాత్రల్లో నటించినా, నిజ జీవితంలో మాత్రం సూర్యాకాంతమ్మ ఆ సూర్యుని కాంతమ్మే....!