Home  »  News  »  'ల‌వ్ స్టోరి' మూవీ రివ్యూ

Updated : Sep 24, 2021

 

సినిమా పేరు: ల‌వ్ స్టోరి
తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి, రాజీవ్ క‌న‌కాల‌, ఈశ్వ‌రీరావు, దేవ‌యాని, ఉత్తేజ్‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, గంగ‌వ్వ‌
మ్యూజిక్‌: ప‌వ‌న్ సిహెచ్‌.
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి. కుమార్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేశ్‌
నిర్మాత‌లు: నారాయ‌ణ్‌దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ క‌మ్ముల‌
బ్యాన‌ర్స్‌: శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేష‌న్స్‌
విడుద‌ల తేదీ: 24 సెప్టెంబ‌ర్ 2021

గ‌త ఏడాది నుంచి ప‌లుమార్లు వాయిదాప‌డుతూ వ‌చ్చి, ఎట్ట‌కేల‌కు మ‌న‌ముందుకు వ‌చ్చింది శేఖ‌ర్ క‌మ్ముల చెప్పిన 'ల‌వ్ స్టోరి'. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ బాగా పాపుల‌ర్ అవ‌డంతో సినిమాపై అంచ‌నాలు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి. ముఖ్యంగా "సారంగ ద‌రియా" సాంగ్ సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. ట్రైల‌ర్ వ‌చ్చాక ఒక పెయిన్‌ఫుల్ ఇష్యూను ఈ సినిమా ద్వారా శేఖ‌ర్ చెప్ప‌బోతున్నాడ‌ని అర్థ‌మైంది. కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత మ‌ల్టీప్లెక్స్‌ల ద‌గ్గ‌ర బాగా జ‌నం క‌నిపించిన సినిమా 'ల‌వ్ స్టోరి'. చైతూ-సాయి ల‌వ్ స్టోరి ఎలా ఉందో చూద్దాం ప‌దండి...

క‌థ‌
రేవంత్ (నాగ‌చైత‌న్య‌) అనే ద‌ళిత క్రిస్టియ‌న్ యువ‌కుడు హైద‌రాబాద్‌లో త‌న పేరిట ఒక జుంబా డాన్స్ స్కూల్ పెట్టి, సొంత కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని క‌ల‌లు కంటూ, త‌ను అద్దెకుంటున్న పెంట్‌హౌస్ ద‌గ్గ‌ర కొంత‌మందికి డాన్స్ నేర్పిస్తుంటాడు. అత‌ని ప‌క్క ఇంట్లో ఉండే త‌న స్నేహితురాలి ద‌గ్గ‌ర‌కు మౌనిక (సాయిప‌ల్ల‌వి) అనే ఒక పెద్దింటి అమ్మాయి వ‌స్తుంది. ఉద్యోగంలో చేరి, సొంత అస్తిత్వం నిలుపుకోవాల‌నేది ఆమె తాప‌త్ర‌యం. ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వు. డాన్స్ బాగా తెలిసిన ఆమె రేవంత్ డాన్స్ స్కూల్లో టీచ‌ర్ అవుతుంది. వ‌చ్చే జ‌నం పెరుగుతారు. మాట‌ల మ‌ధ్య‌లో ఇద్ద‌రిదీ ఒకే ఊరు ఆర్మూర్ అనే విష‌యం తెలుస్తుంది. మౌనిక‌ను అక్క‌డ్నుంచి త‌మ ఊరికి తీసుకుపోవాల‌ని ఆమె బాబాయ్ న‌ర‌సింహం (రాజీవ్ క‌న‌కాల‌) గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తుంటాడు. అత‌డ్ని చూస్తే చాలు భ‌యంతో వ‌ణికిపోతుంటుంది మౌనిక‌. ఒక‌సారి డాన్స్ చేస్తూ మౌనిక‌ను ట‌చ్ చేస్తాడు రేవంత్‌. ఫైర్ అయిపోతుంది మౌనిక‌. అత‌డికేమీ అర్థంకాక సారీ చెబుతాడు. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం పెరిగి పార్ట‌న‌ర్స్‌గా వేరే చోట పెద్ద స్కూల్ తెరుస్తారు. తాము ఒక‌ర్నొక‌రు ప్రేమించుకుంటున్న సంగ‌తి గ్ర‌హిస్తారు. అయితే సామాజిక అంత‌రాలు త‌మ పెళ్లికి అడ్డు నిలుస్తాయ‌నే విష‌యం కూడా వాళ్ల‌కు అవ‌గ‌త‌మ‌వుతుంది. వాళ్ల ల‌వ్ స్టోరి ఏ తీరానికి చేరింది? బాబాయ్ అంటే మౌనిక‌కు ఎందుకంత భ‌యం? ఆమె గతంలోని భ‌యాన‌క అనుభ‌వం ఏమిటి? అనేది మిగతా క‌థ‌లో మ‌న‌కు తెలుస్తుంది.

విశ్లేష‌ణ‌
శేఖ‌ర్ క‌మ్ముల అంటే ఫీల్‌గుడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనే అభిప్రాయం అంద‌రిలో ఉంది. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌, ఫిదా సినిమాలు ఆ ఫీలింగ్‌ను మ‌న‌కు క‌లుగ‌జేశాయి. ఒక సామాజిక స‌మ‌స్య‌తో రూపొందిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'క‌హాని'ని 'అనామిక' పేరుతో రీమేక్ చేసిన‌ప్ప‌టికీ, అది అత‌డి బ్రైన్ చైల్డ్ కాదు. ఫ‌స్ట్ టైమ్ రెండు సామాజిక స‌మ‌స్య‌ల‌ను స్పృశిస్తూ మూవీ తీశాడు శేఖ‌ర్‌. భిన్న సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ఇద్ద‌రు యువ‌తీ యువ‌కులు ప్రేమ‌లో ప‌డితే, కుల‌ప‌ర‌మైన అంత‌రాలు వారిని ఎలా హింస‌పెడ‌తాయ‌నేది ఒక విష‌య‌మైతే, చైల్డ్ అబ్యూజ్ రెండోది. మొద‌టి అంశం ప్ర‌ధానంగా ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా సినిమాలు వ‌స్తుండ‌టం మ‌నం చూస్తున్నాం. అయిన‌ప్ప‌టికీ త‌న‌దైన దృష్టికోణంతో, త‌న‌దైన శైలి స‌న్నివేశాల క‌ల్ప‌న‌తో 'ల‌వ్ స్టోరి'ని తీర్చిదిద్దాడు శేఖ‌ర్‌. బ‌య‌ట ఎక్క‌డో కాదు, చైల్డ్ అబ్యూజ్ అనేది మ‌న ఇళ్ల‌ల్లో, మ‌న స‌మీప బంధువ‌ల కార‌ణంగా జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా బ‌లంగా, ప్ర‌భావ‌వంతంగా ఆయ‌న చెప్పాడు.

అగ్ర‌వర్ణ‌ హిందువుల అమ్మాయి, ద‌ళిత క్రిస్టియ‌న్ అబ్బాయి ప్రేమ‌లో ప‌డి, ఆ ప్రేమ‌ను స‌ఫ‌లం చేసుకోవ‌డానికి ఎలాంటి క‌ష్టాలు ప‌డాలో అన్ని క‌ష్టాలూ ఈ సినిమాలో మౌనిక‌, రేవంత్ ప‌డ్డారు. మౌనిక ఇంట్లోవాళ్ల‌కు తెలీకుండా చాలా దూరం పారిపోవ‌డానికి ప్లాన్స్ కూడా వేశారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌క్కువ మెలోడ్రామాతో, రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో క‌థ‌కుడు కూడా అయిన ద‌ర్శ‌కుడు 'ల‌వ్ స్టోరి' తీశాడు. ఇందులో రేవంత్ ఏమీ హీరోయిగ్గా క‌నిపించ‌డు. స‌మాజం గురించీ, సామాజిక అంత‌రాల గురించీ అవ‌గాహ‌న ఉన్న మెచ్యూర్డ్ ప‌ర్స‌న్‌గా ద‌ర్శ‌న‌మిస్తాడు. త‌ను 'కొండ‌చిలువ‌'గా పిలుచుకొనే బాబాయ్ నుంచి, అత‌డి క‌బంధ‌హ‌స్తాల నుంచి బ‌య‌ట‌ప‌డి, త‌న బ‌తుకేదో త‌ను బ‌త‌కాల‌ని త‌ప‌న ప‌డే ఒక భ‌య‌విహ్వ‌ల అయిన అమ్మాయిగా మౌనిక క‌నిపిస్తుంది. శేఖ‌ర్ మ‌స్తిష్కం నుంచి పుట్టిన‌ ఆ రెండు పాత్ర‌ల‌ను నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి సూప‌ర్బ్‌గా తెర‌పై ఆవిష్క‌రించారు. 

ఫ‌స్టాఫ్‌లో సిటీలో ఉపాధి కోసం తండ్లాడే పాత్ర‌లుగా క‌నిపించే రేవంత్‌, మౌనిక‌.. సెకండాఫ్‌లో త‌మ ల‌వ్ స్టోరిని స‌క్సెస్ చేసుకోవ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డే పాత్ర‌లుగా క‌నిపిస్తారు. ఇటీవ‌లి కాలంలో సినిమా నిడివి గురించిన చ‌ర్చ‌లు న‌డుస్తుండ‌టం మ‌నం చూస్తున్నాం. రెండు గంట‌ల 15 నిమిషాలో, లేదా, రెండున్న‌ర గంట‌లో ఉంటే చాలు.. అంత‌కంటే నిడివి ఎక్కువైతే ఆడియెన్స్ భ‌రించ‌లేక‌పోతున్నార‌ని అనుకుంటున్నాం. ఆ లెక్క‌న చూస్తే.. 'ల‌వ్ స్టోరి' నిడివి ఎక్కువే. రెండు గంట‌ల 40 నిమిషాల నిడివి ఉంది సినిమా. అయినా 'లవ్ స్టోరి' చూస్తుంటే, మ‌న‌కు ఇంకా సినిమా అయిపోలేదా? అనే ఫీలింగ్ ఎక్క‌డా క‌ల‌గ‌లేదు. అలాగ‌ని టైట్ స్క్రీన్‌ప్లే కూడా ఇందులో ఏమీ లేదు. చాలా స‌ర‌ళంగా క‌థ‌ను చెప్పుకుంటూ పోయాడు డైరెక్ట‌ర్‌. సెకండాఫ్ అంతా ఒక ఎమోష‌న్ డ్రైవ్ చేస్తూ, క‌థ‌లో మ‌న‌ల్ని లీనం చేస్తుంది. రేవంత్‌-మౌనిక ప్రేమ‌క‌థ సుఖాంతం కావాల‌ని ప్ర‌తి ప్రేక్ష‌కుడూ/  ప్రేక్ష‌కురాలూ భావిస్తారు. రేవంత్‌, మౌనిక పాత్ర‌ల‌తో వారు స‌హానుభూతి చెందుతారు. 

శేఖ‌ర్ 'ల‌వ్ స్టోరి'కి టెక్నీషియ‌న్స్ ఇతోధికంగా స‌హ‌కారం అందించారు. ప‌వ‌న్ సిహెచ్‌. మ్యూజిక్, విజ‌య్ సి. కుమార్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద బ‌ల‌మ‌య్యాయి. సారంగ ద‌రియా, యే పిల్లా, నీ చిత్రంచూసి, ఏవో ఏవో క‌ల‌లే.. పాట‌లు క‌థ‌లో ఇమిడిపోయాయి. వాటి సంగీతం అల‌రించింది. స‌న్నివేశాల్లోని ఎమోష‌న్‌ను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ క్యారీ చేసింది. స‌న్నివేశాల‌కు త‌గిన ఎట్మాస్పియ‌ర్‌, లైటింగ్‌తో విజ‌య్ కుమార్ కెమెరా మ‌న ముందు ఒక వాస్త‌విక ప్రేమ‌గాథ‌ను సాక్షాత్క‌రింప‌జేసింది. మార్తాండ్ కె. వెంక‌టేశ్ ఎడిటింగ్‌కు వంక పెట్టాల్సిన ప‌నిలేదు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పింగ‌ళి చైత‌న్య ఉండ‌టం 'లవ్ స్టోరి'కి అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చింద‌ని చెప్పాలి.

న‌టీన‌టుల ప‌నితీరు
నిస్సందేహంగా చైతూ, సాయిప‌ల్ల‌వి కెరీర్‌ల‌లో బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్‌ను ఈ సినిమాలో మ‌నం చూస్తాం. ఒక‌రు ఎక్కువా, ఒక‌రు త‌క్కువా కాకుండా ఇద్ద‌రికి ఇద్ద‌రే త‌మ పాత్ర‌ల్లో ట్రెమండ‌స్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. జీవితం మీద ఎన్నో క‌ల‌ల‌తో సిటీకి వ‌చ్చి, ఉపాధి కోసం క‌ష్ట‌ప‌డే ఒక ద‌ళిత కుర్రాడి పాత్ర‌లో చైతూ న‌ట‌న‌ను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. అత‌ని హావ‌భావ ప్ర‌ద‌ర్శ‌న రేవంత్ పాత్ర‌ను మ‌నం ప్రేమించేలా చేస్తుంది. చిన్న‌త‌నం నుంచీ ఒక పెయిన్‌ను మ‌న‌సులో మోస్తూ, సొంత జీవితం కోసం అల్లాడే ఒక పెద్దింటి అమ్మాయి మౌనిక‌గా ప‌ల్ల‌వి అభిన‌యం మ‌న‌ల్ని కొద్దిరోజుల పాటైనా వెంటాడుతుంది. 

ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రి న‌ట‌న గురించి కూడా బాగా చెప్పుకోవాలి. రేవంత్ త‌ల్లి అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌గా ఈశ్వ‌రీరావు గొప్ప‌గా రాణించారు. బాపు 'రాంబంటు' హీరోయిన్‌కు చాలా కాలం త‌ర్వాత న‌టించ‌డానికి ఆస్కార‌మున్న చ‌క్క‌ని పాత్ర ల‌భించింది. ఇక మౌనిక బాబాయ్ న‌ర‌సింహంగా రాజీవ్ క‌న‌కాల నెగ‌టివ్ క్యారెక్ట‌ర్‌కు పూర్తి న్యాయం చేకూర్చారు. అండ‌ర్‌రేటెడ్ యాక్ట‌ర్ అయిన ఆయ‌న త‌న‌కు బ‌ల‌మైన పాత్ర ల‌భిస్తే, ఏం చేస్తాడో చూపించారు. మౌనిక త‌ల్లిగా దేవ‌యానిని ఎందుకు తీసుకున్నారో అని మొద‌ట్లో అనుకుంటాం. కానీ చివ‌ర‌కు ఆమె స్థాయికి త‌గ్గ స‌న్నివేశం ఒక‌టి ప‌డి, త‌న ఉనికిని నిరూపించుకున్నారు. రేవంత్‌, మౌనిక‌ల శ్రేయోభిలాషి అయిన య‌స్సైగా ఉత్తేజ్ కూడా చాలా రోజుల త‌ర్వాత క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించి, మెప్పించారు. రెండు స‌న్నివేశాల్లో గంగ‌వ్వ ప్రెజెన్స్ క‌నిపిస్తుంది. మిగ‌తా పాత్ర‌ధారులు కూడా త‌మ వంతు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించారు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
ఇప్ప‌టిదాకా శేఖ‌ర్ క‌మ్ముల తీసిన సినిమాల్లో ది బెస్ట్.. 'ల‌వ్ స్టోరి' అని చెప్ప‌డానికి సందేహించాల్సిన పనిలేదు. ప్రేక్ష‌కుల్లో చాలామంది త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్ర‌ల‌తో సాగే ఎమోష‌న‌ల్ ల‌వ్ అండ్ లైఫ్ జ‌ర్నీ ఇది. ఒక మంచి సినిమా కోసం, సాయిప‌ల్ల‌వి-చైత‌న్య న‌ట‌న కోసం 'ల‌వ్ స్టోరి'ని త‌ప్ప‌కుండా చూడాలి.

రేటింగ్‌: 3.5/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.