![]() |
![]() |
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో, ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా సీక్వెల్ ‘కల్కి 2’ పైనే ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది, అసలు అప్‌డేట్ ఏంటా అని టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొనడంతో, అందరూ ‘కల్కి 2’ గురించి అప్‌డేట్ వస్తుందని ఆశించారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ స్వయంగా నిర్మిస్తున్న ‘సింగ్ గీతం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఈవెంట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు కల్కి పార్ట్ 2 గురించి ప్రశ్నించగా, నాగి తనదైన శైలిలో నవ్వుతూ ఆ టాపిక్‌ను దాటవేశారు.
అక్కడ జనం ఎక్కువగా ఉన్నారని, నాయిస్ వల్ల ప్రశ్న సరిగ్గా వినిపించడం లేదంటూ నాగ్ అశ్విన్ చాలా చాకచక్యంగా విషయాన్ని డైవర్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ‘కల్కి 2’ కు సంబంధించిన లీకులు లేదా అప్‌డేట్లను ఇప్పుడప్పుడే బయటకు వదలకుడదని చిత్ర యూనిట్ గట్టిగా ఫిక్స్ అయినట్లు టాలీవుడ్‌లో సరికొత్త ప్రచారం మొదలైంది. ఒక సినిమా వేడుకలో మరో సినిమా గురించి మాట్లాడితే బాగుండదనే ఉద్దేశంతోనే నాగి సైలెంట్‌గా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో డైరీ ఫుల్ చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్రంతో పాటు, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్‌లతో డార్లింగ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ రెండు భారీ చిత్రాల షెడ్యూల్స్ ముగిసిన తర్వాతే ప్రభాస్ మళ్లీ కల్కి ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం.
నిజానికి కల్కి లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రీ-ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వర్క్ చాలా కీలకం. పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో లాక్ అయినప్పటికీ, గ్రాఫిక్స్ పనులకు చాలా సమయం పడుతుంది. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా, పక్కా ప్రణాళికతో అంతా సిద్ధమయ్యాకే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట.
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నా, సరైన సమయం చూసి అభిమానులకు ఒకేసారి గూస్‌బంప్స్ వచ్చేలాంటి భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసేవరకు ప్రభాస్ అభిమానులు మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే!
![]() |
![]() |