English | Telugu

2009లో ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్‌ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఈరం’. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వైశాలి’ పేరుతో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి థమన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అతనికి మంచి పేరు తెచ్చింది. అదే సంవత్సరంలో కిక్‌ చిత్రంతో థమన్‌ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ ఒక్క సంవత్సరంలోనే 7 సినిమాలకు సంగీతం అందించాడు థమన్‌. అయితే కంప్లీట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ‘వైశాలి’ మంచి పేరు తెచ్చింది. 14 ఏళ్ళ తర్వాత ఆది పినిశెట్టి, థమన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ‘శబ్ధం’ పేరుతో హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి సరసన లక్ష్మీ మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

 

ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ఈ సినిమాకి సంబంధించి ఆది పినిశెట్టి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ సినిమా మీద క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఈ సినిమాలో సీనియర్‌ నటి లైలా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని లైలాను పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇంకా సిమ్రాన్‌, రెడిన్‌ కింగ్స్‌లే ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వైశాలి చిత్రానికి వున్న క్రేజ్‌ దృష్ట్యా ‘శబ్ధం’ చిత్రాన్ని తమిళ్‌, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది.