Home  »  News  »  డిజిటల్ స్క్రీన్స్‌పై ‘మైక్రో డ్రామా’ ట్రెండ్.. 2028 నాటికి రూ. 23 బిలియన్ల మార్కెట్‌!

Updated : May 29, 2026

భారతీయ వినోద రంగంలో ప్రస్తుతం సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. థియేటర్లు, వెబ్ సిరీస్‌ల కాలం దాటి ఇప్పుడు వీక్షకులు తక్కువ సమయంలోనే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే 'మైక్రో డ్రామా' అనే సరికొత్త ఫార్మాట్ ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో తుఫాన్‌లా దూసుకొస్తోంది. కేవలం ఒకటి నుండి మూడు నిమిషాల నిడివితో సాగే ఈ మినీ ఎపిసోడ్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లకు అలవాటు పడిపోయిన నేటి తరం ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు రంగంలోకి దిగావు. ప్రయాణాల్లో లేదా చిన్న చిన్న బ్రేక్స్ సమయంలో రీల్స్, షార్ట్స్ చూసేవారికి ఈ మినీ డ్రామాలు అద్భుతమైన ఆప్షన్‌గా మారాయి. జియోస్టార్ తమ జియోహాట్‌స్టార్ వేదికగా 'తడ్కా' పేరుతో వందకు పైగా ఇటువంటి మైక్రో డ్రామా టైటిళ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అలాగే అమెజాన్ సైతం ఎంఎక్స్ ప్లేయర్‌లో 'ఫటాఫట్' పేరుతో సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తోంది.

వీటితో పాటు కుకు టీవీ, స్టోరీ టీవీ వంటి ప్రత్యేక డిజిటల్ యాప్‌లు సైతం ఈ సరికొత్త ట్రెండ్‌లో దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతుండటమే ఈ క్రేజ్‌కు ముఖ్య కారణం. గతేడాది భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు స్థాయిలో సమయాన్ని గడిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. రాబోయే రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ యూజర్స్ సంఖ్య మరింత పెరగనుండటంతో, ఈ మైక్రో డ్రామాల మార్కెట్ కూడా ఊహించని రేంజ్‌కు చేరుకోనుంది.

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలకే ప్రాధాన్యత ఉండేది. కానీ కాలక్రమేణా ఓటీటీలు వచ్చి వెబ్ సిరీస్ ట్రెండ్ తెచ్చాయి. ఇప్పుడు ఈ మైక్రో డ్రామాలను ఓటీటీ సంస్థలు సరికొత్త కథలను, సరికొత్త పాత్రలను టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్‌లా వాడుకుంటున్నాయి. ఇక్కడ క్లిక్ అయిన కథలను భవిష్యత్తులో పూర్తి స్థాయి వెబ్ సిరీస్‌లుగా లేదా సినిమాలుగా మలిచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ మినీ సిరీస్‌లపై నెటిజన్లు ఆసక్తికరమైన చర్చలు జరుపుతున్నారు. తక్కువ సమయంలోనే ఆకట్టుకునే ట్విస్టులతో, విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వస్తున్న ఈ కంటెంట్‌కు యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కేవలం టైమ్‌పాస్ కోసమే కాకుండా, క్వాలిటీ కంటెంట్‌తో వస్తున్న ఈ డ్రామాలు త్వరలోనే బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఎదగడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంచ‌నా ప్ర‌కారం 2028 నాటికి మైక్రో డ్రామా మార్కెట్ రూ.23 బిలియ‌న్‌కి చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్ జోరుకు బ్రేక్ వేస్తూ.. ప్రేక్షకులను తమ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఉంచుకోవడానికి ఓటీటీలు వేసిన ఈ స్కెచ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.