Home

»

Latest News

మోహ‌న్‌లాల్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌.. మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు!

Aug 28, 2026 2:14PM

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో 'దృశ్యం' ఒకటి. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ సిరీస్ అన్ని భాషల్లోనూ రీమేక్ అయి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఈ ఫ్రాంచైజీకి సంబంధించి నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ 'దృశ్యం 4' కూడా రాబోతోందని ప్రకటించడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం పరిపాటే. కానీ 'దృశ్యం 3'తోనే కథకు ఒక ముగింపు దొరుకుతుందని భావించిన సినీ ప్రియులకు 'దృశ్యం 4' అనౌన్స్‌మెంట్ కాస్త ఆశ్చర్యానికి, మరికొంత నవ్వులకు గురిచేసింది. "ఇంకెన్ని సంవత్సరాలు ఈ పోలీసులను జార్జ్‌కుట్టి ఆడిస్తాడు సామీ?", "జార్జ్‌కుట్టికి ముసలితనం వచ్చి వినికిడి శక్తి తగ్గాక కూడా సీక్వెల్స్ తీస్తూనే ఉంటారేమో!" అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఒక అవార్డు వేడుకలో నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ మాట్లాడూతూ 'దృశ్యం 4' ఖచ్చితంగా ఉంటుందని గుండె మీద చెయ్యి వేసుకుని ప్రకటించారు. అయితే ఈ అప్‌డేట్‌పై చాలామంది సినీ ప్రేమికులు స్పందిస్తూ.. "ఒక ఐకానిక్ సినిమా ఫ్రాంచైజీని సాగదీసి దాని క్రేజ్‌ను తగ్గించవద్దు" అని అభిప్రాయపడుతున్నారు. సీక్వెల్స్ పేరిట కథను మరీ ఎక్కువగా సాగదీస్తే అసలు కథలోని మజా పోతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

2013లో విడుదలైన 'దృశ్యం' మొదటి భాగం భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక సంచలనం. కేవలం కేబుల్ టీవీ నడిపే సాధారణ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోలీసు వ్యవస్థనే ఎలా బురిడీ కొట్టించాడనే కథాంశం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత వచ్చిన 'దృశ్యం 2' కూడా ఊహించని ట్విస్టులతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆపై వచ్చిన మూడో భాగం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది.

మరోవైపు, దర్శకుడు జీతు జోసెఫ్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడూతూ.. కథలో సరైన దమ్ము, బలమైన పాయింట్ ఉంటేనే సీక్వెల్స్ చేస్తానని, కేవలం బాక్సాఫీస్ కలెక్షన్ల కోసం తొందరపడి సీక్వెల్స్ ప్రకటించనని స్పష్టం చేశారు. అయితే నిర్మాత మాత్రం 'దృశ్యం 4'ని ధృవీకరించడంతో, జీతు జోసెఫ్ మైండ్‌లో ఎలాంటి సరికొత్త ట్విస్ట్ ఉందోనని మరికొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో 'దృశ్యం 4' హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. జార్జ్‌కుట్టి కేబుల్ ఆపరేటర్ నుండి థియేటర్ ఓనర్ అయ్యాడు, రాబోయే భాగాల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పెట్టి సొంతంగా క్రైమ్ థ్రిల్లర్స్ తీస్తాడేమో అంటూ కొందరు నెటిజన్లు వేసే పంచ్‌లు తెగ నవ్విస్తున్నాయి.

ఏది ఏమైనా 'దృశ్యం 4' ప్రకటనతో ఇటు మీమ్స్, అటు ట్రోల్స్ నడుస్తున్నప్పటికీ.. మోహన్‌లాల్, జీతు జోసెఫ్ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్తే మాత్రం థియేటర్ల వద్ద హడావుడి మామూలుగా ఉండదు. ఈ సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, స్క్రిప్ట్ వర్క్ పై దర్శకుడి నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

 

[Drishyam 4 Announcement, Mohanlal Drishyam 4, Director Jeethu Joseph, Drishyam 4 Trolls, Antony Perumbavoor]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com