Home » Movie Reviews » టక్ జగదీష్



Facebook Twitter Google


సినిమా పేరు: ట‌క్ జ‌గ‌దీష్‌
తారాగ‌ణం: నాని, రీతూవ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్‌, రావు ర‌మేశ్‌, రోహిణి, న‌రేశ్‌, దేవ‌ద‌ర్శిని, మాల‌పార్వ‌తి, ర‌ఘుబాబు, ప్ర‌వీణ్‌, న‌రేన్‌, సీవీఎల్ న‌ర‌సింహారావు, రామ‌రాజు, జ‌య‌ప్ర‌కాశ్‌
మ్యూజిక్‌: త‌మ‌న్‌, గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేశ్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌
విడుద‌ల తేదీ: 10 సెప్టెంబ‌ర్ 2021
ప్లాట్‌ఫామ్‌: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఓటీటీ)

నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'నిన్నుకో'రి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ట‌వ‌డంతో, వారి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో సినిమాగా 'ట‌క్ జ‌గ‌దీష్' ఆడియెన్స్‌లో అంచ‌నాలు పెంచింది. పైగా శివ నిర్వాణ మునుప‌టి మూవీ 'మ‌జిలీ' బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డంతో అత‌ని డైరెక్ష‌న్‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు జ‌నం. థియేట‌ర్లు ఓపెన్ అయి, వ‌రుస‌గా సినిమాలు రిలీజ‌వుతున్న కాలంలో నిర్మాత‌లు ఓటీటీలోనే డైరెక్టుగా ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి డిసైడ్ అవ‌డం, వివాదాన్ని రేకెత్తించ‌డంతో పాటు, ఆశ్చ‌ర్యాన్నీ క‌లిగించింది. వాళ్లెందుకు థియేట‌ర్ల‌కు బ‌దులు ఓటీటీని ఆశ్ర‌యించార‌నే దానికి సినిమా చూస్తే స‌మాధానం ల‌భిస్తుంది. మ‌రి సినిమా ఎలా ఉందంటే...

క‌థ‌

"ఆడ‌పిల్ల‌ని ఏడిపించ‌డం, మ‌గాడు ఏడ‌వ‌డం.. అది ఇంటికీ, ఊరికీ మంచిది కాదు.." అనే కాన్సెప్టుపై న‌డిచే క‌థ ఇది. ఈ మాట‌ల‌ను ట‌క్ జగ‌దీశ్ (నాని)కు వాళ్ల నాన్న ఆదిశేషునాయుడు (నాజ‌ర్) చెప్తాడు. ఇద్ద‌రు కొడుకులు, ఇద్ద‌రు కూతుళ్ల‌తో ఆనందంగా ఉండే కుటుంబం ఆయ‌న‌ది. ఆయ‌న చ‌నిపోయాక పెద్ద‌కొడుకు బోసుబాబు (జ‌గ‌ప‌తిబాబు) అక్క‌చెల్లెళ్ల‌ను వాటాలు ఇవ్వ‌కుండా త‌ల్లితో స‌హా ఇంట్లోంచి వెళ్ల‌గొట్టేస్తాడు. మేన‌మామ జగ‌దీశ్‌ను పెళ్లాడాల‌నుకుంటుంది చంద్ర (ఐశ్వ‌ర్య రాజేశ్‌). కానీ ఆమె అంటే త‌న‌కు ప్రాణ‌మ‌నీ, కానీ భార్య‌లా చూడ‌లేన‌నీ చెప్తాడు జ‌గ‌దీశ్‌. ఆదిశేషునాయుడు చ‌నిపోయాక వైరివ‌ర్గానికి చెందిన వీరేంద్ర (డానియెల్ బాలాజీ)తో చేతులు క‌లిపిన బోసుబాబు, అత‌డి త‌మ్ముడు తిరుమ‌ల‌నాయుడు (తిరువీర్‌)కు చంద్ర‌ను ఇచ్చి పెళ్లి జ‌రిపిస్తాడు. ఆ టైమ్‌లో వేరే ఊళ్లో ఉన్న జ‌గ‌దీశ్‌కు ఈ విష‌యం తెలియ‌నివ్వ‌డు. మూడుముళ్లు ప‌డే స‌మ‌యానికి జ‌గ‌దీశ్‌కు ఈ విష‌యం తెలుస్తుంది. ఆ త‌ర్వాత స‌వ‌తి త‌ల్లితో స‌హా అక్క‌చెల్లెళ్ల‌ను కూడా ఇంట్లోంచి వెళ్ల‌గొట్టేస్తాడు బోసు. అదేమ‌ని అడిగిన జ‌గ‌దీశ్‌కు కూడా వాటా ఇవ్వ‌నంటాడు. చంద్ర‌ను భ‌ర్త చిత్ర‌హింస‌లు పెడుతుంటాడు. వీఆర్వో అయిన వ‌ర‌ల‌క్ష్మి (రీతువ‌ర్మ‌)తో ప్రేమ‌లో ప‌డిన జ‌గ‌దీశ్, అంద‌ర్నీ షాక్‌కు గురిచేస్తూ, భూదేవిపురంకు ఎమ్మార్వోగా వ‌స్తాడు. ఆ త‌ర్వాత అత‌ను ఏం చేశాడు?  అన్న బోసుబాబులో మార్పు తెచ్చాడా? కుటుంబాన్ని మ‌ళ్లీ ఒక్క‌టి చేయ‌గ‌లిగాడా? చంద్ర జీవితం ఏమైంది? అనే విష‌యాల‌న్నింటికీ క్లైమాక్స్‌లో స‌మాధానాలు ల‌భిస్తాయి.



ఎనాలసిస్ :

క‌థ చ‌దివితేనే ఇదెంత పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థో అర్థ‌మైపోతోంది. 'నిన్నుకోరి', 'మ‌జిలీ' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు రూపొందించిన శివ నిర్వాణ నుంచి ఈ త‌ర‌హా రెగ్యుల‌ర్ స్టోరీని మ‌నం ఊహించ‌లేం. పోనీ నెరేష‌న్ అయినా ప‌రుగులు పెట్టిందా.. అంటే అదీ లేదు. స్లో నెరేష‌న్‌తో, స‌న్నివేశాలు అన్నీ మ‌నం ఊహించిన‌ట్లే వ‌స్తూ, ఆస‌క్తిని త‌గ్గించేస్తుంటాయి. ఒక ఊరిలో రెండు కుటుంబాల మ‌ధ్య శ‌త్రుత్వం ఉండ‌టం, వాటిలో ఒక‌టి మంచిదై, రెండోది చెడ్డ‌దై ఉంట‌డం.. ఆ చెడ్డ కుటుంబం ఎంత‌టి దారుణాల‌కైనా తెగించ‌డం ఎన్ని సినిమాల్లో మ‌నం చూడ‌లేదు! ఇక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిని కావాల‌నే చెడ్డ కుటుంబానికి చెందిన అబ్బాయి పెళ్లిచేసుకొని, ఆమెను చిత్ర‌హింస‌లు పెట్ట‌డం బీసీ కాలం నుంచి ఇంకెన్ని సినిమాల్లో మ‌నం చూస్తూ రావ‌డం లేదు! కాక‌పోతే హీరో అక్కో, చెల్లో ఇలాంటి హింస ప‌డ‌టం మ‌నం సాధార‌ణంగా చూశాం. ఈ సినిమాలో హీరో మేన‌కోడ‌లు ఆ హింస ప‌డుతుంది. అంతే తేడా!

సినిమాలో ఏమైనా ఆస‌క్తిక‌రంగా క‌నిపించే అంశ‌మేదైనా ఉందంటే అది ట‌క్ జ‌గ‌దీశ్ క్యారెక్ట‌ర్‌ను మ‌ల‌చిన విధాన‌మే. ఆ ఒక్క క్యారెక్ట‌ర్ మీద బాగా ఇష్టం చూపి, దాన్ని డిజైన్ చేసిన ద‌ర్శ‌కుడు మిగ‌తా క్యారెక్ట‌ర్ల‌ను అన్నింటినీ మూస ధోర‌ణిలో మ‌లిచాడు. టైటిల్‌కు త‌గ్గ‌ట్లు సినిమా మొత్తం ట‌క్ చేసుకొనే క‌నిపిస్తాడు జ‌గ‌దీశ్‌. ఫ‌స్టాఫ్ అంతా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ప‌ర్వాలేద‌న్న‌ట్లు న‌డిచింది. భూదేవిపురానికి జ‌గ‌దీశ్ ఎమ్మార్వోగా రావ‌డ‌మ‌నే ట్విస్ట్ నాని అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అయితే ప్రి క్లైమాక్స్‌లో జ‌గ‌దీశ్ ఫ్యామిలీకి సంబంధించి వ‌చ్చే మ‌రో ట్విస్ట్ క‌థ‌కు కీల‌కం. కానీ ఆ ట్విస్ట్‌ను ఎమోష‌న‌ల్‌గా మ‌ల‌చడంలో డైరెక్ట‌ర్ ఫెయిల్ అయ్యాడు. జ‌గ‌దీశ్ ఎమ్మార్వో అయ్యాక వ‌చ్చే సీన్లు బోర్ కొట్టించాయి. ఇక్క‌డ స్క్రీన్‌ప్లేలో ఏమాత్రం బిగువు క‌నిపించ‌లేదు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ యాంగిల్ కూడా సాధార‌ణ స్థాయిలో ఉండి నిరాశ క‌లిగించింది. 

నిర్మాణ విలువ‌లు మాత్రం మంచి క్వాలిటీతో క‌నిపించాయి. సినిమాలో మెచ్చుకోద‌గ్గ వాటిలో ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ ఒక‌టి. భూదేవిపురం అనే ఊరితో పాటు, సీన్లు రిచ్‌గా క‌నిపించాయంటే కెమెరా ప‌నిత‌న‌మే కార‌ణం. కానీ కెమెరా వ‌ర్క్‌కు త‌గిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప‌డ‌లేదు. ఈ విష‌యంలో గోపీసుంద‌ర్ నిరాశ‌ప‌రిచాడు. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు బాగానే ఉన్నాయి. సెకండాఫ్‌లో అన‌వ‌స‌ర‌మ‌నిపించే సీన్లు చాలా క‌నిపించాయంటే, ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ఆశించిన రీతిలో లేన‌ట్లేగా! ప‌లు చోట్ల డైలాగ్స్‌లో చ‌మ‌క్కులు క‌నిపించాయి. మునుప‌టి రెండు సినిమాల‌తో ఎమోష‌న‌ల్ సీన్స్‌ను పండించ‌డంలో నేర్ప‌రి అనే పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ 'ట‌క్ జ‌గ‌దీశ్‌'లో డిజ‌ప్పాయింట్ చేశాడు.

న‌టీన‌టుల అభిన‌యం

టైటిల్ రోల్‌లో నాని చెల‌రేగిపోయాడు. ఎక్క‌డా ఓవ‌రాక్టింగ్ చేయ‌కుండా స‌న్నివేశానికి త‌గ్గ‌ట్లు ప‌ర్ఫార్మెన్స్ చూపించాడు. ఐశ్వ‌ర్యా రాజేశ్‌తో వ‌చ్చే సీన్ల‌లో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో మాట్లాడే సీన్ల‌లో మెచ్యూర్డ్‌గా న‌టించాడు. ఫైట్స్‌కు త‌గ్గ బాడీ లాంగ్వేజ్ ప్ర‌ద‌ర్శించి, త‌న‌లో మాస్ హీరో కూడా ఉన్నాడ‌ని అనిపించుకున్నాడు. గుమ్మ‌డి వ‌ర‌ల‌క్ష్మిగా రీతూవ‌ర్మ‌కు వంక పెట్టాల్సింది లేదు. ఆ పాత్ర‌కు స‌రిపోయింది. చంద్ర పాత్ర‌లో ఐశ్వ‌ర్య సూప‌ర్బ్‌గా రాణించింది. ప‌ర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌కు త‌నెంత‌గా సూట‌వుతుందో మ‌రోసారి నిరూపించింది.

బోసుబాబుగా జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌కు వంక పెట్టాల్సింది ఏముంటుంది! కానీ ఆయ‌న గెట‌ప్ బాగాలేదు. మేక‌ప్ స‌రిగాలేదు. జ‌గ‌దీశ్ బావ స‌త్తిబాబు పాత్ర‌లో న‌రేశ్ ఒదిగిపోయాడు. మ‌రోబావ దేవుడుబాబు పాత్ర‌లో రావు ర‌మేశ్‌కు ఎక్కువ‌గా న‌టించ‌డానికి అవ‌కాశం ల‌భించ‌లేదు. జ‌గ‌దీశ్ అక్క‌లుగా రోహిణి, దేవ‌ద‌ర్శిని త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. విల‌న్ వీరేంద్ర‌గా డానియ‌ల్ బాలాజీ సినిమాకు కాస్తయినా ఫ్రెష్ లుక్ తెచ్చాడు. అత‌ని త‌మ్ముడు తిరుమ‌ల‌నాయుడుగా తిరువీర్ స‌రిగ్గా స‌రిపోయాడు. రీతు తండ్రిగా ర‌ఘుబాబు క‌నిపించాడంతే! 

అత్యంత కీల‌క‌మైన త‌ల్లి పాత్ర అర్జున‌మ్మ‌గా మల‌యాళం న‌టి మాల పార్వ‌తి చ‌క్క‌ని అభిన‌యం చూపిన‌ప్ప‌టికీ, తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె బాగా కొత్త కావ‌డంతో, ఆ క్యారెక్ట‌ర్‌ను ఎవ‌రైనా తెలిసిన యాక్ట‌ర్ చేసుంటే, జ‌నం ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట‌యి ఉండేవార‌నిపించింది. మంచి న‌టుడైన జ‌య‌ప్ర‌కాశ్ ఒకే ఒక సీన్ ఉన్న జ‌గ‌దీశ్ మేన‌మామ క్యారెక్ట‌ర్‌ను ఎందుకు చేశారో అర్థం కాలేదు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

కొత్త సీసాలో పాత సారా త‌ర‌హాలో అని చెప్ప‌డానికి కూడా అవ‌కాశం లేనంత మూస క‌థ‌, ముత‌క క‌థ‌నంతో సాగే 'ట‌క్ జ‌గ‌దీశ్‌'ను కేవ‌లం త‌న భుజ‌స్కంధాల‌పై మోశాడు నాని. అత‌ని న‌ట‌న కోస‌మైతే ఈ సినిమాని ఓసారి చూడొచ్చు. సినిమా మొత్తంగా చూస్తే, మిగిలేది అసంతృప్తే!

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.