Home » Movie Reviews » శ్యామ్ సింగ రాయ్



Facebook Twitter Google


సినిమా పేరు: శ్యామ్ సింగ రాయ్‌
తారాగ‌ణం: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా శామ్సన్, శుభ‌లేఖ సుధాక‌ర్‌, మనీష్ వధ్వా, భూపాల్ రాజు
కథ: సత్యదేవ్ జంగా
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: రవి వర్మ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
దర్శకత్వం: రాహుల్ సాంకృత్యాన్
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుద‌ల తేదీ: 24 డిసెంబ‌ర్ 2021

నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి కాంబినేష‌న్‌లో 'శ్యామ్ సింగ రాయ్' అనే బెంగాలీ పేరును టైటిల్‌గా పెట్టి 'టాక్సీవాలా' డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ ఒక సినిమా చేస్తున్నాడ‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచే ఈ మూవీపై సినీగోయ‌ర్స్‌లో కుతూహ‌లం ఏర్ప‌డింది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన చివ‌రి పాట ఈ సినిమాలోదే అనే ప్ర‌చారం, ఉద్విగ్న‌భ‌రితంగా ఉన్న‌ ట్రైల‌ర్.. 'శ్యామ్ సింగ రాయ్' కోసం ఎదురుచూసేలా చేశాయి. 

క‌థ‌:- వాసుదేవ్ (నాని) అనే వెనుకా ముందూ ఎవ‌రూ లేని ఓ యువ‌కుడు సినీ డైరెక్ట‌ర్ కావాల‌ని త‌పిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ తీసి, త‌నేమిటో చూపించాల‌నుకుంటాడు. అందులో హీరోయిన్ రోల్ కోసం త‌న ఫ్రెండ్ కాఫీ హోట‌ల్‌లోనే అమ్మాయిల‌కు ఆడిష‌న్స్ చేస్తాడు. అక్కడే కాఫీ తాగ‌డానికి వ‌చ్చిన కీర్తి (కృతి శెట్టి)ని చూసి త‌న హీరోయిన్ ఆమేన‌ని ఫిక్స‌వుతాడు. మొద‌ట త‌న‌కు యాక్టింగ్ ఇష్టంలేద‌ని చెప్పిన కీర్తి.. చివ‌ర‌కు అత‌డి క‌ష్టాలు విని, స‌రేనంటూ అత‌ని షార్ట్ ఫిల్మ్‌లో న‌టిస్తుంది. అది చూసి వాసుకు ఓ నిర్మాత సినిమా తీసే ఛాన్సిస్తాడు. 'ఉనికి' అనే పేరుతో సినిమా తీస్తాడు వాసు. అది సూప‌ర్ హిట్ట‌వుతుంది. దాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి ముంబై నిర్మాత‌లు ఆఫ‌ర్ ఇస్తారు. ముంబైలో దానికి సంబంధించిన ప్రెస్‌మీట్ జ‌రుగుతుండ‌గా, అత‌ను 'అస్తిత్వ' అనే ఒక బెంగాలీ న‌వ‌ల‌ను య‌థాత‌థంగా కాపీకొట్టి 'ఉనికి'ని తీశాడ‌నే అభియోగం మోపి కాపీరైట్‌ను ఉల్లంఘించిన నేరానికి పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. దానికంటే ముందు వాసుకు కీర్తి మాన‌సికంగా ద‌గ్గ‌ర‌వుతుంది. ఇద్ద‌రూ శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యే సంద‌ర్భంలో వాసు చేసిన ప‌నివ‌ల్ల అత‌డిని తిట్టి వెళ్లిపోతుంది కీర్తి. అయితే వాసును పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసి, లాయ‌ర్ అయిన త‌న క‌జిన్ ప‌ద్మావ‌తి (మ‌డోన్నా సెబాస్టియ‌న్‌)ని వాసు త‌ర‌పున వాదించ‌మ‌ని అడుగుతుంది. అప్పుడు 'అస్తిత్వ' న‌వ‌లా ర‌చ‌యిత శ్యామ్ సింగ రాయ్ క‌థ వ‌స్తుంది. అచ్చుగుద్దిన‌ట్లు వాసులాగే ఉండే ఆ శ్యామ్ సింగ రాయ్ ఎవ‌రు? గ‌త కాలానికి చెందిన అత‌నికీ, నేటి కాలానికి చెందిన వాసుదేవ్‌కూ సంబంధ‌మేంటి? అనేది సెకండాఫ్‌లో మ‌నం చూస్తాం.



ఎనాలసిస్ :

ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ ఒక వైవిధ్య‌మైన క‌థ‌తో మ‌న ముందుకు వ‌చ్చాడు. ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, ఉత్తేజ‌భ‌రిత‌మైన‌, ఉద్విగ్న‌భ‌రిత‌మైన స‌న్నివేశాలెన్నింటినో అత‌ను 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో చూపించాడు. ఇందులో ఫ‌స్టాఫ్ వాసుదేవ్‌దీ, సెకండాఫ్ శ్యామ్ సింగ రాయ్‌దీ. ఈ సినిమాకు సంబంధించిన ఒక ప‌ర‌స్ప‌ర వైరుధ్య‌మైన అంశ‌మేమంటే.. ఒక‌వైపు ప్రోగ్రెసివ్ థాట్స్‌ను చూపిస్తూనే, మ‌రోవైపు పున‌ర్జ‌న్మ‌ను స‌మ‌ర్ధించ‌డం! శ్యామ్ సింగ రాయ్ ఒక పురోగామివాదిగా, నాస్తికునిగా సినిమాలో మ‌న‌కు క‌నిపిస్తాడు. దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌ను రూపుమాప‌డానికి కృషి చేసే తిరుగుబాటుదారునిగా ద‌ర్శ‌న‌మిస్తాడు. దాని కోసం ప్రాణాల‌కు తెగించి వ్య‌వ‌స్థ‌పై తెగ‌బ‌డే యోధునిగా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. 

Also read: భారీగా ప‌డిపోయిన 'పుష్ప' వ‌సూళ్లు! ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భోరుమంటున్న‌ బ‌య్య‌ర్లు!

తెర‌పై శ్యామ్ సింగ రాయ్ క‌థ క‌నిపిస్తున్నంత‌సేపూ మ‌న‌లో ర‌క్తం వ‌డివ‌డిగా ప్ర‌వ‌హిస్తుంటుంది. అంత‌టి ఉద్విగ్న‌భ‌రితంగా శ్యామ్ స్టోరీని ప్రెజెంట్ చేశాడు డైరెక్ట‌ర్ రాహుల్‌. ప‌శ్చిమ బెంగాల్‌లోని కాళికాపూర్ అనే గ్రామంలో 1969 నుంచి 1977 దాకా సాగే శ్యామ్ క‌థ‌ను అత‌ను చూపించాడు. అత‌నొక నాస్తికుడు. మ‌నుషులంతా ఒక‌టే జాతి అని న‌మ్మే అభ్యుద‌య‌వాది. ఒక నిమ్న కుల‌స్తుడికి బావి ద‌గ్గ‌ర నీళ్లు తోడుకోవ‌డానికి ఊరిపెద్ద‌లు ఒప్పుకోక‌పోతే, అత‌డిని ఆ బావిలో నెట్టేసి, ఆ బావి అప‌విత్ర‌మ‌య్యింది క‌దా ఇప్పుడేం చేస్తారు? అని ప్ర‌శ్నిస్తాడు. బావిలో ప‌డిన ఆ అస్పృశ్యుడు లోప‌ల ఆర్తిగా నీళ్లు తాగుతుంటే మ‌న గుండె క‌లుక్కుమంటుంది. ఈ సీన్‌ను రాహుల్ తీసిన విధానం సూప‌ర్బ్‌. దేవ‌దాసి అయిన మైత్రేయి (సాయిప‌ల్ల‌వి)తో శ్యామ్ ప‌రిచ‌యం, ఆ ఇద్ద‌రూ స‌న్నిహిత‌మ‌య్యే సీన్లు ఆక‌ట్టుకుంటాయి. ఆమె కోసం ఎవ‌రూ ఎద‌రించ‌డానికి సాహ‌సించ‌ని మ‌హంత్ (మ‌నీష్ వ‌ధ్వా)తో శ్యామ్ త‌ల‌ప‌డే సీన్‌ను చాలా ఉద్విగ్న‌భ‌రితంగా తీశాడు ద‌ర్శ‌కుడు. న‌వ‌లా ర‌చ‌యిత‌గా శ్యామ్ పాపుల‌ర్ అయ్యాక‌, అత‌డి న‌వ‌ల‌ల‌ను ప్ర‌శంసిస్తూ శ్రీ శ్రీ ఉత్త‌రం రాసిన‌ట్లు చూపించ‌డం భేషుగ్గా ఉంది. కాక‌పోతే క్లైమాక్స్ కొంత‌మందికి మింగుడుప‌డ‌క‌పోవ‌చ్చు.

Also read: 'సెకండ్ హ్యాండ్ ఐట‌మ్' అంటూ నీచ‌మైన పోస్ట్ పెట్టిన నెటిజ‌న్‌.. ఇదీ స‌మంత రెస్పాన్స్‌!

సినిమాలో ద‌ర్శ‌కుడు మ‌న‌కు రెండు ప్ర‌పంచాలు చూపించాడు. ఫ‌స్టాఫ్‌లో హైద‌రాబాద్‌లో సినిమా డైరెక్ట‌ర్ కావాల‌ని క‌లలు క‌నే వాసుదేవ్ క‌థ ఆహ్లాద‌క‌రంగా సాగి మ‌న‌ల్ని ఈ ప్ర‌పంచంలో ఉంచితే, సెకండాఫ్‌లో శ్యామ్‌, మైత్రేయి ప్ర‌ణ‌య గాథ మ‌న‌ల్ని మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకుపోతుంది. ఎక్క‌డా బోర్ కొట్టించ‌కుండా సినిమాని తీయ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస‌య్యాడు. అయితే రెండు భిన్న ఐడియాల‌జీల‌ను ఒకే ఒర‌లో ఇమ‌డ్చ‌డమే ఇబ్బందిక‌రం. ఎక్క‌డో ఒక పున‌ర్జ‌న్మ కేసు (ఒక‌ప్ప‌టి శాంతాదేవి కేసు) కోర్టులో నిజ‌మ‌ని నిరూప‌ణ అయ్యింద‌నే దానిపై ఆధార‌ప‌డి దానికి స‌మ‌ర్థ‌న‌గా రాసిన క‌థ‌లో, దానికి పూర్తి భిన్న‌మైన మూఢ‌న‌మ్మ‌కాలను ఖండించడం ఒక వైరుధ్యం.

మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం ఈ సినిమాకు ఒక ఎస్సెట్‌. పాట‌ల‌కు ఎప్ప‌ట్లా మ‌ధుర‌బాణీలు అందించిన అత‌ను బ్యాగ్రౌండ్ స్కోర్‌తో స‌న్నివేశాల‌కు మ‌రింత ఎలివేష‌న్ ఇచ్చాడు. సాను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్ర‌ఫీ కూడా రెండు కాలాల‌కు సంబంధించిన క‌థ‌ను చూడ‌ చ‌క్క‌గా మ‌న‌ముందు ప్రెజెంట్ చేసింది. శ్యామ్ సింగ‌రాయ్‌గా నాని, మైత్రేయి/ రోజీగా సాయిప‌ల్ల‌వి క్లోజ‌ప్ షాట్స్‌, కీర్తిగా కృతి శెట్టి అందాల‌ను ఆయ‌న కెమెరా బాగా కేప్చ‌ర్ చేసింది. అవినాష్ కొల్లా ఆర్ట్ వ‌ర్క్ ప‌ర్ఫెక్ట్‌. న‌వీన్ నూలి ఎడిటింగ్‌, ర‌వివ‌ర్మ ఫైట్స్ కంపోజింగ్‌ల‌ను త‌క్కువ చెయ్య‌లేం.

న‌టీన‌టుల ప‌నితీరు:- నాని, సాయిప‌ల్ల‌వి కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్' అని గ‌ట్టిగా చెప్పేయొచ్చు. బిహేవియ‌ర్ ప‌రంగా ఒక‌దానికొక‌టి ఏమాత్రం పొంత‌న‌లేని శ్యామ్ సింగ రాయ్‌, వాసుదేవ్ పాత్ర‌ల‌ను నాని స‌మ‌ర్థ‌వంత‌గా పోషించాడు. నేటి త‌రం కుర్రాడు వాసుదేవ్‌గా మెప్పించిన నాని, న‌ల‌భై-యాభై ఏళ్ల క్రితం నాటి శ‌క్తిమంత‌మైన‌ బెంగాలీ ర‌చ‌యిత శ్యామ్‌సింగ రాయ్‌గా మ‌రింత గొప్ప‌గా రాణించాడు. నిజానికి మ‌నం శ్యామ్‌తో ప్రేమ‌లో ప‌డకుండా ఉండ‌లేం. అత‌ను మీసం దువ్వే విధానం, అత‌ని బాడీ లాంగ్వేజ్‌, కాళికాదేవి విగ్ర‌హం ముందు మ‌హంత్‌ను మ‌ట్టిక‌రిపించే తీరు తెగ న‌చ్చేస్తాయి. అత‌నికి దీటుగా క‌నిపించింది సాయిప‌ల్ల‌వి. మైత్రేయి అలియాస్ రోజీగా ఆమె ప్ర‌ద‌ర్శించిన ప‌ర్ఫార్మెన్స్‌కు మెస్మ‌రైజ్ కానివాళ్లెవ్వ‌రు? ఆమె డాన్సులు, ఆమె మాట‌లు, ఆమె హావ‌భావాలు.. నో డౌట్‌.. ప‌ల్ల‌వి కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇదే. 

కీర్తిగా కృతి శెట్టి ఎంత అందంగా ఉందో! వాసు తీసే షార్ట్ ఫిల్మ్ సంద‌ర్భంగా ఆమె క‌నిపించే తీరుకు ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌నివాళ్లుంటారా! వాసు త‌ర‌పున వాదించే లాయ‌ర్ ప‌ద్మావ‌తి పాత్ర‌కు మ‌డోన్నా సెబాస్టియ‌న్ అతికిన‌ట్లు స‌రిపోయింది. శ్యామ్ సింగ‌రాయ్ అన్న‌లుగా జిషు సేన్‌గుప్తా, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, భూపాల్ రాజు, లాయ‌ర్ కృష్ణ‌మూర్తిగా ముర‌ళీశ‌ర్మ‌, వాసు ఫ్రెండ్‌గా అభిన‌వ్ గోమ‌టం, ప్రొఫెస‌ర్‌గా లీలా శాంస‌న్, మ‌హంత్‌గా మ‌నీష్ వ‌ధ్వా, జ‌డ్జిగా శుభ‌లేఖ సుధాక‌ర్‌ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు. 



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

అభిరుచి క‌లిగిన ప్రేక్ష‌కుల‌కు 'శ్యామ్ సింగ రాయ్' న‌చ్చుతాడు. నాని, సాయిప‌ల్ల‌వి సూప‌ర్బ్ ప‌ర్ఫార్మెన్స్‌ల కోసం, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ష‌న్ కోస‌మైనా ఈ సినిమాని చూసేయొచ్చు.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.