Home » Movie Reviews » సీటీమార్



Facebook Twitter Google


సినిమా పేరు: సీటీమార్
తారాగణం: గోపీచంద్, తమన్నా, తరుణ్ రాజ్ అరోరా, భూమిక, రెహమాన్, దిగంగానా సూర్యవంశీ, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, ప్రీతి అస్రాని తదితరులు 
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్ 
సంగీతం: మణిశర్మ 
సమర్పణ: పవన్ కుమార్  
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి 
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: సంపత్ నంది 
విడుదల తేదీ: 10 సెప్టెంబర్ 2021

తెలుగులో క్రీడా నేపథ్యంలో వస్తున్న మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. 'తమ్ముడు', 'ఒక్కడు', 'సై', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' నుండి 'జెర్సీ' వరకూ ప్రేక్షకుల మనసులలో నిలిచాయి. 'గౌతమ్ నంద'తో ఆశించిన విజయం అందుకోలేకపోయిన హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కబడ్డీ నేపథ్యంలో కథతో 'సీటీమార్' అంటూ వినాయక చవితి రోజున ప్రేక్షకుల ముందుకొచ్చారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?      

కథ

కార్తీక్ (గోపీచంద్) బ్యాంక్ ఉద్యోగి. ఆఫీసు వేళలు పూర్తయిన తర్వాత ఊరిలో అమ్మాయిలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుంటాడు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు అతడు శిక్షణ ఇచ్చిన అమ్మాయిల్లో ఎనిమిదిమంది ఎంపిక అవుతారు. నేషనల్ కప్ కొట్టడం ద్వారా తమ ఊరి పాఠశాలను ప్రభుత్వం మూసివేయకుండా కాపాడుకోవాలనేది కార్తీక్ అండ్ స్టూడెంట్స్ లక్ష్యం. అయితే, ఫైనల్స్ చేరుకున్న అమ్మయిలను మ్యాచ్ మరో రెండు రోజుల్లో ఉందనగా... మకన్ సింగ్ (తరుణ్ రాజ్ అరోరా) కిడ్నాప్ చేయిస్తాడు. అమ్మాయిలను ఎందుకు కిడ్నాప్ చేశారు? కార్తీక్ అక్క భూమి (భూమిక) భర్త ప్రాణాలకు, అమ్మాయిల కిడ్నాప్ కు లింక్ ఏమిటి? కార్తీక్ బావ ఎవరు? అమ్మాయిలను కార్తీక్ ఎలా కాపాడాడు? అతడికి తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి (తమన్నా) ఏ విధంగా సహాయం చేసింది? అసలు, మకన్ సింగ్ ఎవరు? సమస్య ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   



ఎనాలసిస్ :

ఊరి కోసం, రెండు తరాల ప్రజలు చదువుకున్న పాఠశాలను కాపాడడం కోసం అమ్మాయిలు కబడ్డీ కప్ గెలవాలని అనుకోవడం బావుంది. దర్శకుడు సంపత్ నంది రాసుకున్న కథలో ఈ ఒక్క పాయింట్, ఆడపిల్లలు గురించి చెప్పే అంశాలు బావున్నాయి. అయితే... సినిమా అంతా కబడ్డీ లేదు. ఫస్టాఫ్ తర్వాత కబడ్డీ బ్యాక్ సీట్ తీసుకుని... ఫ్రంట్ సీట్ లోకి పక్కా కమర్షియల్ రివెంజ్ ఫార్ములా సన్నివేశాలు వస్తాయి. లాజిక్కులు వదిలేసి... కమర్షియల్ సినిమాను ఎంజాయ్ చేద్దామనుకున్నా కష్టమే. అటు కమర్షియల్ అంశాలకు, ఇటు కబడ్డీకి మధ్య కథ నలిగింది. 

ఎన్నో సినిమాల్లో చూసేసిన పాత చింతకాయ పచ్చడి లాంటి అంశాన్ని (ఓ ఊరిలో అరాచకాలు చేసే విలన్... అతడిని హీరో అంతం చేయడం - ఇంతకు మించి చెబితే బాగోదు) దర్శకుడు తీసుకున్నాడు. అయితే, రెండిటినీ జనరంజకంగా చెప్పడంలో తడబడ్డాడు. దాంతో సినిమా కూడా తడబడింది. ఆటను పక్కన పెట్టి హీరో సాగించే వేట సుదీర్ఘంగా సాగింది. ఫస్టాఫ్ పర్వాలేదు. కానీ, సెకండాఫ్ సహనానికి పరీక్ష పెడుతుంది. కమర్షియల్ సినిమాలు ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు నచ్చవచ్చు. సంపత్ నంది రాసిన మాటల్లో హీరోయిన్ నోటి నుండి 'ల...కు' వంటి పదాలు దొర్లాయి. మణిశర్మ మాస్ సాంగ్స్ ఇచ్చారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు పర్లేదు. బాగానే ఖర్చు పెట్టారు. 

నటీనటుల పనితీరు

గోపీచంద్ ఇటువంటి క్యారెక్టర్లు గతంలో చేశాడు. అందువల్ల, నటుడిగా అతడికి కొత్తదనం చూపించే అవకాశం దక్కలేదు. అయితే... సినిమాకు, పాత్రకు ఏం కావాలో అది చేశారు. మీసకట్టుతో లుక్ కొత్తగా ఉండేలా ప్రయత్నించారు. తమన్నా పాత్ర నిడివి తక్కువే. ఉన్నంతలో బాగా నటించారు. 'జ్వాలారెడ్డి...' పాటలో గ్లామర్ ఒలకబోశారు. ఊరిలో హీరో మీద మనసుపడే సిటీ ఛానల్ యాంకర్ అండ్ ప్రెసిడెంట్ కుమార్తెగా దిగంగనా సూర్యవంశీ కనిపించారు. భూమిక, రెహమాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. తరుణ్ రాజ్ అరోరాకు రెగ్యులర్ కమర్షియల్ విలన్ రోల్ దక్కింది.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

పక్కా కమర్షియల్ ఫార్మటులో తీసిన సినిమా 'సీటీమార్'. సీటీ (విజిల్) వేసే మూమెంట్స్ చాలా తక్కువ. అటు విలన్స్, ఇటు హీరో మారో మారో అంటూ చేసే హడావిడి ఎక్కువ. ఫైట్స్ తక్కువ అయినప్పటికీ ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. అన్నట్టు అమ్మాయిలు కూడా ఒక ఫైట్ చేశారు. అది బావుంది. మాస్, కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవాళ్లు చూసే ప్రయత్నం చెయ్యొచ్చు. అంతే!

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.