Home » Movie Reviews » పుష్ప



Facebook Twitter Google


సినిమా పేరు: పుష్ప‌
తారాగ‌ణం: అల్లు అర్జున్‌, ర‌ష్మికా మంద‌న్న‌, సునీల్‌, ఫ‌హ‌ద్ ఫాజిల్‌, అజ‌య్ ఘోష్‌, ధ‌నుంజ‌య్‌, అన‌సూయ‌, శ‌త్రు, అజ‌య్‌, రావు ర‌మేశ్‌, మైమ్ గోపి, స‌మంత (స్పెష‌ల్ అప్పీరెన్స్‌)
క‌థ‌, స్క్రీన్‌ప్లే: సుకుమార్‌
మాట‌లు: శ్రీ‌కాంత్ విస్సా
పాట‌లు: చంద్ర‌బోస్‌
సంగీతం: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: మిలొస్లావ్ క్యూబా బ్రోజెక్‌
ఎడిటింగ్: కార్తీక శ్రీ‌నివాస్‌
ఆర్ట్: రామ‌కృష్ణ - మోనిక‌
సౌండ్ డిజైన్: ర‌సూల్ పోకుట్టి
ఫైట్స్: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, పీట‌ర్ హెయిన్‌
నిర్మాత‌లు: న‌వీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్‌
ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌
బ్యాన‌ర్స్: మైత్రి మూవీ మేక‌ర్స్‌, ముత్తంశెట్టి మీడియా
విడుద‌ల తేదీ: 17 డిసెంబ‌ర్ 2021

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ సినిమా అంటే ఉంటే క్రేజ్ వేరే. 'ఆర్య‌', 'ఆర్య‌-2' సినిమాల త‌ర్వాత వాళ్లు క‌లిసి 'పుష్ప' అనే సినిమా చేస్తున్నార‌నేస‌రికి వెల్లువెత్తిన అంచ‌నాలు అసాధార‌ణం. పైగా బ‌న్నీ 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' మూవీతో, సుకుమార్ 'రంగ‌స్థ‌లం'తో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన ఊపులో ఉన్నారు. అలాంటి నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా కావ‌డంతో 'పుష్ప' చుట్టూ విప‌రీత‌మైన హైప్ క్రియేట్ అయ్యింది. అనూహ్య‌మైన‌ ఖ‌ర్చు కావ‌డంతో రెండు భాగాలుగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేసిన‌ 'పుష్ప' మొద‌టి భాగం 'పుష్ప: ది రైజ్' ఇప్పుడు మ‌న‌ముందుంది.

క‌థ‌:- శేషాచ‌లం అడ‌వులను అడ్డాగా చేసుకున్న ఒక‌ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ గ్యాంగ్‌లో కూలివాడిగా ప‌నిలో చేరి, అంచెలంచెలుగా ఎదుగుగుతూ తానే స్వ‌యంగా స్మ‌గ్ల‌ర్‌గా మారిన పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్‌) క‌థ ఇది. క‌థ ప్ర‌కారం ముల్లేటి వెంక‌ట‌ర‌మ‌ణ అనే వ్య‌క్తి ఉంచుకున్నామె కొడుకు పుష్ప‌. దీంతో చిన్న‌ప్ప‌ట్నుంచే ఇంటిపేరు లేకుండా ఉత్త పుష్ప‌రాజ్‌గా ఎదుగుతాడు. కొండారెడ్డి (అజ‌య్ ఘోష్‌) బ్ర‌ద‌ర్స్ ద‌గ్గ‌ర మొద‌ట కూలోడిగా ప‌నిలో చేరిన పుష్ప‌, అక్క‌డ ప‌నిచేసే మునిర‌త్నం కుమార్తె శ్రీ‌వ‌ల్లి (ర‌ష్మిక మంద‌న్న‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. మొద‌ట‌ త‌న తెగింపు ధోర‌ణితో పోలీసుల నుంచి ఎర్ర‌చంద‌నాన్ని కాపాడుతూ కొండారెడ్డికి ఆధార‌ప‌డ‌ద‌గ్గ మ‌నిషిగా మారి, ఆ త‌ర్వాత 4 శాతం వాటాతో అత‌నికే పార్ట‌న‌ర్ అవుతాడు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ సిండికేట్‌కు బాస్‌గా వ్య‌వ‌హ‌రించే మంగ‌ళం శీను (సునీల్‌)నే ఢీకొట్టి స‌వాల్ విసురుతాడు. శ్రీ‌వ‌ల్లిపై క‌న్నేసి ఆమెను అనుభ‌వించాల‌నుకున్న కొండారెడ్డి చిన్నత‌మ్ముడు జాలిరెడ్డి (ధ‌నుంజ‌య‌)ని చిత‌క్కొడ‌తాడు. దీంతో ఇటు కొండారెడ్డి, అటు మంగ‌ళం శ్రీ‌ను ఇద్ద‌రికీ టార్గెట్ అవుతాడు పుష్ప‌. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అనుక్ష‌ణం ప్ర‌మాదంతో స‌హ‌జీవ‌నం చేస్తూ వ‌చ్చే పుష్ప‌నే ఢీకొట్టిన పోలీసాఫీస‌ర్ ఎవ‌రు?  పుష్ప‌, శ్రీ‌వ‌ల్లి ఒక్క‌ట‌య్యారా? అనేది మిగ‌తా క‌థ‌.



ఎనాలసిస్ :

రెండు భాగాల క‌థ అనేస‌రికి మొద‌టి భాగాన్ని ఆస‌క్తిక‌రంగా ముగించ‌డం క‌త్తిమీద సాము వ్య‌వ‌హారం. సినిమా విడుద‌ల‌కు ముందుగానే ఒక కీల‌క‌మైన విష‌యాన్ని డైరెక్ట‌ర్ సుకుమార్ బ‌య‌ట‌పెట్టేశాడు. మొద‌టి భాగానికి మెయిన్ విల‌న్ సునీల్ అనీ, ఈ మూవీ చివ‌ర‌లో ఫ‌హ‌ద్ ఫాజిల్ వ‌స్తాడ‌నీ, సెకండ్ పార్ట్‌కు అత‌ను విల‌న్ అనీ చెప్పేశాడు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే 'పుష్ప: ది రైజ్' ప్రి క్లైమాక్స్‌లో ఎస్పీ భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ క్యారెక్ట‌ర్‌తో ఎంట్రీ ఇచ్చాడు ఫ‌హ‌ద్‌. ఆ సంగ‌తి అలా ఉంచుదాం.. మొద‌టి భాగం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా కొన‌సాగితేనే, రెండో భాగం కోసం ప్రేక్ష‌కులు మ‌రింత ఈగ‌ర్‌గా ఎదురుచూస్తారు. మ‌రి 'పుష్ప: ది రైజ్' అంత ఇంట్రెస్టింగ్‌గా ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. ఎన్నో అంచ‌నాల‌తో థియేట‌ర్‌కు వెళ్లిన ప్రేక్ష‌కులను పుష్ప పాక్షికంగానే సంతృప్తి ప‌ర్చాడు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. పుష్ప చుట్టు అల్లిన క‌థ‌, వ‌ర్క‌ర్ నుంచి స్మ‌గ్ల‌ర్ దాకా పుష్ప ఎదగ‌డాన్ని చూపించిన తీరు!

పుష్ప క్యారెక్ట‌ర్‌కు ఓ పెయిన్ ఉంది. అది.. ఐడెంటిటీ క్రైసిస్‌! పుష్ప‌కు ఇంటిపేరు ఎందుక‌ని లేదు? అత‌ను గౌర‌వ‌ప్ర‌దంగా ఒక ఇల్లాలికి కాకుండా, ఒక వ్య‌క్తి ఉంచుకున్నామెకు పుట్ట‌డం వ‌ల్ల‌. అందుక‌ని ఐదేళ్ల వ‌య‌సులో స్కూల్లో మాస్టారుకు త‌న ఇంటిపేరు 'ముల్లేటి' అని పుష్ప‌రాజు చెప్తే, అత‌ని మారుటి అన్న (అజ‌య్‌) వ‌చ్చి, 'నీకు ఇంటిపేరు లేదు, నువ్వు మానాన్న ఉంచుకున్న‌దానికి పుట్టావ్' అని చెప్పి, ఇంటిపేరు లేకుండా 'పుష్ప‌రాజు' అని పేరు రాయిస్తాడు. అప్ప‌ట్నుంచీ అత‌డికి ఇంటిపేరు ఉండ‌దు. ఈ నొప్పి పుష్ప‌తో పాటే పెరుగుతూ వ‌స్తుంది. అనుకున్నాడంటే ఏం చేయడానికైనా, ఎంత రిస్క్ చేయ‌డానికైనా వెనుకాడ‌ని తెగింపు వున్నవాడిగా పుష్ప‌ను ఆ నొప్పి మారుస్తుంది. ఇదీ పుష్ప క్యారెక్ట‌రైజేష‌న్. అత‌డిలోని ఆ తెగింపును మ‌నం ఇష్ట‌ప‌డ‌తాం. మ‌నం చేయ‌లేని సాహ‌సాల్ని పుష్ప ఈజీగా చేస్తుంటే చూసి, ఆనంద‌ప‌డ‌తాం. పుష్ప 'త‌గ్గేదే లే' అంటుంటే ముచ్చ‌ట‌ప‌డ‌తాం. అంత‌వ‌ర‌కే!.. ఎమోష‌న‌ల్‌గా అత‌డితో మ‌నం క‌నెక్ట‌వ‌డం క‌ష్ట‌మే. అత‌డితో మ‌నం సంపూర్ణంగా స‌హానుభూతి చెంద‌డమూ క‌ష్ట‌మే. దీనికి కార‌ణం.. పుష్ప చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాల వ‌ల్ల‌ అత‌డి నొప్పి మ‌న నొప్పి కాకుండా పోయింది. అయితే ఏ స‌న్నివేశానికి ఆ స‌న్నివేశాన్ని విడివిడిగా చూసిన‌ప్పుడు అంతా బాగానే ఉంద‌నిపిస్తుంది.

డీఎస్పీ గోవింద‌ప్ప (శత్రు) త‌మ గోడౌన్‌ను క‌నిపెట్టేసి ప‌ట్టుకోడానికి వ‌స్తున్నాడ‌నే క‌బురంద‌డంతోటే, ఆ గోడౌన్‌లోని వెయ్యి ట‌న్నుల ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని ప‌క్క‌నే ఉన్న వాగులోకి పుష్ప ప‌డేసే సీన్లు హైలైట్ అనిపిస్తాయి. స‌మంత, బ‌న్నీపై తీసిన‌ ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా అనే పాట అదిరిపోయింద‌నిపిస్తుంది. పుష్ప‌, శ్రీ‌వ‌ల్లి పెళ్లిచూపుల సీన్ బాగానే ర‌క్తిక‌ట్టింది. మంగ‌ళం శీను ఇంటికెళ్లి మ‌రీ పుష్ప త‌నేమిటో శాంపిల్ చూపించిన ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ కూడా ఆక‌ట్టుకుంటుంది. జాలిరెడ్డి త‌న‌ను రాత్రికి సింగారించుకొని ప‌డుకోడానికి ర‌మ్మ‌న‌మ‌ని చెప్తే, సింగారించుకొని అత‌డి ద‌గ్గ‌ర‌కు కాకుండా పుష్ప ద‌గ్గ‌ర‌కు శ్రీ‌వ‌ల్లి వెళ్లే సీన్‌, ఆమెను తీసుకొని జాలిరెడ్డి ద‌గ్గ‌ర‌కెళ్లి, అత‌డ్ని పుష్ప చావ‌గొట్టే సీన్ బాగా వ‌చ్చాయి. జాలిరెడ్డిని కొట్టింది పుష్ప అని తెలిసి, అత‌డ్ని చంప‌డానికి కొండారెడ్డి వేసే స్కెచ్‌, ఆ సంద‌ర్భంలో త‌ల‌కు ముసుగుతోటే బ‌న్నీ చేసే ఫైట్ ఆక‌ట్టుకుంటుంది. చివ‌ర‌న భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌తో పుష్ప మీటింగ్ సీన్‌, అత‌డితోనే క్లైమాక్స్ సీన్ బాగానే ఉన్నాయి. అయినా ఓవ‌రాల్‌గా.. ఎమోష‌న‌ల్‌గా పుష్ప‌తో మ‌నం క‌నెక్ట్ కాలేక‌పోవ‌డ‌మే 'పుష్ప' క‌థ‌లోని లోపం. అంతా అయ్యాక మ‌న ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ‌ట్లు లేదే అని ఫీల‌వుతాం.

దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన ఫ‌స్ట్ సాంగ్ "దాక్కో దాక్కో మేక" నుంచి, "సామి సామి" సాంగ్ దాకా అన్నీ విన‌సొంపుగా ఉన్నాయి, వాటి చిత్రీక‌ర‌ణా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవ‌ల్లో ఉంది. సీన్ల‌న్నీ కంటికింపుగా, మ‌న‌ల్ని వేరే ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉండ‌టానికి మిరొస్లావ్ క్యూబా బ్రోజెక్ కెమెరా ప‌నిత‌న‌మే కార‌ణం. కార్తీక శ్రీ‌నివాస్ త‌న ఎడిటింగ్ క‌త్తెర‌కు బాగా ప‌దునుపెట్టి ఉండాల్సింది. దాదాపు మూడు గంట‌ల నిడివి ఉన్న ఈ సినిమాను ఒక అర‌గంట త‌గ్గించే ప‌ని చేస్తే బాగుండేది. 'త‌గ్గేదే లే' అంటే అన్నిచోట్లా కాద‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి. చిత్తూరు జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్ని తూర్పుగోదావ‌రి జిల్లాల్లోని మారేడుమిల్లి అడ‌వుల్లో సృష్టించ‌డం, ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని త‌యారుచెయ్య‌డం చిన్న విష‌యం కాదు.. ఇందుకు ఆర్ట్ డైరెక్ట‌ర్స్ రామ‌కృష్ణ‌-మోనికను అభినందిచాల్సిందే.

న‌టీన‌టుల ప‌నితీరు:- పుష్ప‌.. పుష్ప‌రాజుగా అల్లు అర్జున్ చెల‌రేగి న‌టించాడు. త‌గ్గేదే లే అనే ఊత‌ప‌దం, ఎడ‌మ‌భుజాన్ని పైకిలేపి న‌డ‌వ‌డమ‌నే మేన‌రిజం, పొడ‌వుగా పెంచిన ఉంగ‌రాల జుట్టు, గ‌డ్డంతో అత‌ను కొత్త‌గా, వైవిధ్యంగా క‌నిపించాడు. చిత్తూరు యాస‌లో డైలాగ్స్ బాగా చెప్పాడు. అనేక స‌న్నివేశాల్లో హావ‌భావాల‌ను చాలా బాగా ప‌లికించాడు. ఇక యాక్ష‌న్ సీన్స్‌లో అత‌డి ఎన‌ర్జీని, బాడీ లాంగ్వేజ్‌ని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే. ర‌ష్మిక‌తో రొమాంటిక్ సీన్స్‌లో ఎంత జోవియ‌ల్‌గా న‌టించాడో, త‌న ఐడెంటిటీ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్ప‌టి స‌న్నివేశాల్లోని పెయిన్‌ను అంత బాగా ప్ర‌ద‌ర్శించాడు. సినిమాలో ఏ ఒక్క‌రూ గ్లామ‌ర్‌గా క‌నిపించ‌క‌పోవ‌డం ఈ సినిమాలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించే అంశం. ర‌ష్మిక అయితే డీగ్లామ‌ర్ రోల్‌లోనూ గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డం వేరే విష‌యం. శ్రీ‌వ‌ల్లిగా త‌న పాత్ర‌ను సునాయాసంగా చేసుకుపోయింది. కాక‌పోతే కొన్ని సంద‌ర్భాల్లో ఆమె ప‌లికిన యాస అర్థం కాలేదు. ఆమెదే కాదు, ప‌లువురి మాట‌లు కొన్నేసిసార్లు స‌రిగా అర్థం కాలేదు.

విల‌న్ మంగ‌ళం శీను క్యారెక్ట‌ర్‌లో సునీల్ రాణించాడు. ఈ సినిమా త‌ర్వాత అత‌డికి విల‌న్ పాత్ర‌లు ఇవ్వ‌డానికి ద‌ర్శ‌కులు ముందుకు వ‌స్తారు. అత‌డి భార్య దాక్షాయ‌ణిగా అన‌సూయ కొత్త‌గా ఉంది. ఆమె కూడా ఓకేనే. కొండారెడ్డిగా అజ‌య్ ఘోష్ భిన్న ఆహార్యంతో, న‌ట‌న‌తో మెప్పించాడు. అత‌ని త‌మ్ముడు జాలిరెడ్డిగా క‌న్న‌డ‌న‌టుడు ధ‌నుంజ‌య స‌రిపోయాడు. డీఎస్పీ గోవింద‌ప్ప‌గా శ‌త్రు త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. చివ‌ర‌లో వ‌చ్చినా, రెండే సీన్లు ఉన్నా.. ఎస్పీ భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ రోల్‌లో త‌న ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చూపించాడు మ‌ల‌యాళం స్టార్ యాక్ట‌ర్ ఫ‌హ‌ద్ ఫాజిల్‌. ఎంపీగా రావు ర‌మేశ్‌కు త‌గ్గ క్యారెక్ట‌ర్ ప‌డ‌లేదు. మిగ‌తావాళ్లు కూడా ప‌రిధుల మేర‌కు న‌టించారు. "ఊ అంటావా మావా" పాట‌కు త‌న వంతు న్యాయం చేసింది స‌మంత‌.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

"త‌గ్గేదే లే" అంటూ అంబ‌రాన్ని చుంబించే అంచ‌నాలు రేపిన పుష్ప‌.. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ శాటిస్‌ఫ్యాక్ష‌న్‌ను ఇవ్వ‌లేక‌పోయింది. దాంతో కాస్త "త‌గ్గింది లే" అనే ఫీలింగ్ మ‌న‌కు క‌లుగుతుంది. ఫ‌స్ట్ పార్ట్‌తో ఇలాంటి ఫీల్ క‌లిగించిన సుక్కు మ‌రి సెకండ్ పార్ట్ 'పుష్ప: ద రూల్‌'ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.