Home » Movie Reviews » గల్లీ రౌడీ



Facebook Twitter Google


సినిమా పేరు: గల్లీ రౌడీ
తారాగణం: సందీప్ కిషన్, నేహా శెట్టి, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, వైవా హర్ష, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, మైమ్ గోపి తదితరులు 
కూర్పు: ఛోటా కె. ప్రసాద్
ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్ 
సంగీతం: 'చౌరస్తా' రామ్ మిరియాల, సాయి కార్తీక్
స్క్రీన్ ప్లే, సమర్పణ: కోన వెంకట్  
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి 
విడుదల తేదీ: 17 సెప్టెంబర్ 2021

కథారచయితగా కమర్షియల్ సినిమాలకు కామెడీ మిక్స్ చేసి స్టార్ హీరోలతో కోన వెంకట్ భారీ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు సమర్పకుడిగా సందీప్ కిషన్ హీరోగా 'గల్లీ రౌడీ' తీశారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు. 'అల్లరి' నరేష్, విష్ణు మంచులకు 'సీమ శాస్త్రి', 'సీమ టపాకాయ్', 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ హిట్స్ అందించిన జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన వెంకట్, జి. నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'గల్లీ రౌడీ' ఎలా ఉంది? సందీప్ కిషన్ ఖాతాలో మరో విజయం చేరుతుందా?

కథ:-

వాసు(సందీప్ కిషన్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనుకుంటాడు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో, బలవంతంగా వంశపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తిలోకి రావాల్సి వస్తుంది. కానీ, గొడవల జోలికి వెళ్లడు. అతని తండ్రి, తాతయ్య రౌడీలు అయినప్పటికీ... వాసు మాములుగా ఉంటాడు. ఒకానొక సందర్భంలో సాహిత్య (నేహా శెట్టి)ని చూస్తాడు. తొలిచూపులో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి పట్టపగలు వెంకట్రావ్ (రాజేంద్ర ప్రసాద్) హెడ్ కానిస్టేబుల్. అతడికి రూ.200 కోట్లు విలువ చేసే భూమి ఉంటుంది. దానికి బైరాగి (మైమ్ గోపి) కబ్జా చేస్తాడు. బైరాగికి బుద్ధి చెప్పాలని, అతడిని కిడ్నాప్ చేయాలని వాసును సాహిత్య సాయం కోరుతుంది. వీళ్ళు కిడ్నాప్ చేసేలోపు ఎవరో బైరాగిని హత్య చేస్తారు. అసలు, హత్య చేసిందెవరు? మధ్య ఎంకౌంటర్ స్పెషలిస్ట్ రవి (బాబీ సింహా) పాత్ర ఏమిటి?  అనూహ్య ఘటనల నుండి తప్పించుకుని ప్రేమించిన అమ్మాయి కుటుంబాన్ని వాసు ఎలా కాపాడాడు? ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా సినిమా. 



ఎనాలసిస్ :

కమర్షియల్ ఫార్మటులో తీసిన కామెడీ ఎంటర్టైనర్ 'గల్లీ రౌడీ'. కథలో కక్షల కంటే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదే సినిమాకు ప్లస్సు, మైనస్సు. ప్రేక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా తీయడంతో వినోదాత్మక సన్నివేశాలను బాగా రాసుకున్నారు. అవన్నీ నవ్విస్తాయి. అయితే, కామెడీ మీద పెట్టినంత కథ మీద అంత దృష్టి పెట్టలేదు. కామెడీ సీన్స్ కాకుండా వచ్చే మిగతా డ్రామా సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ కామెడీకి చక్కటి కథ తోడైతే, డ్రామా పండితే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేది. కోన వెంకట్ రచయితగా చేసిన కొన్ని సినిమాల్లో ఒక కామెడీ స్టయిల్ ఉంటుంది. హీరో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మారుపేర్లతో హీరోయిన్ ఇంటికి వెళ్లడం, కన్‌ఫ్యూజన్ కామెడీ చేయడం వంటి ట్రాక్ కోన సినిమాల్లో చూశాం. అటువంటి ట్రాక్ 'గల్లీ రౌడీ'లోనూ ఒకటి ఉంది. హీరో రివెంజ్ ను హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం కొంత బావుంది.  పాటల్లో 'పుట్టనే ప్రేమ' బావుంది. పక్కా కమర్షియల్ సినిమా తరహాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్టు ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎడిటింగ్ క్రిస్పీగా, సన్నివేశాలు మరింత గ్రిప్పింగ్ గా ఉంటే ప్రేక్షకులకు సినిమా సాగదీసిన ఫీలింగ్ ఉండేది కాదు.

నటీనటుల పనితీరు:-

సందీప్ కిషన్ ఎప్పటిలా హుషారుగా నటించాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ నేహా శెట్టి పర్వాలేదు. ఆమె తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ కు కీలక పాత్ర దక్కింది.  ఆయన కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. కొన్ని సన్నివేశాల్లో అతి చేశారని అనిపించినా... మాస్ ప్రేక్షకులకు అది నచ్చవచ్చు. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, వైవా హర్ష పాత్రల పరిధి మేరకు నవ్వించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా బాబీ సింహా పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేశారు. కానీ, తర్వాత అతడ్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. ప్రతినాయకుడిగా మైమ్ గోపి బాగా నటించారు.  



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

కామెడీ తప్ప కథ, కథనం అవసరం లేదని... కాసేపు నవ్వుకోడం కోసం థియేటర్లకు వెళతామనే ప్రేక్షకులు 'గల్లీ రౌడీ'కి హ్యాపీగా వెళ్ళవచ్చు. కామెడీతో కాస్త కథ, ఇంట్రెస్టింగ్ & గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కోరుకునేవాళ్లు కొంచెం ఆలోచించాలి. కమర్షియల్ ఎంటర్టైనర్స్ కోరుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.