ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నాడని తెలుస్తోంది.
వెంకటేష్ తో అనిల్ కి మంచి బాండింగ్ ఉంది. అనిల్ డైరెక్ట్ చేసిన 'F2', 'F3' సినిమాలలో వెంకీ మామ నటించాడు. ఆ అనుబంధంతోనే ఇప్పుడు బాలయ్య సినిమాలో వెంకటేష్ ని నటింపజేయాలని అనిల్ చూస్తున్నాడట. ఇందులో బాలయ్యకి గ్లాస్ మేట్ గా ఓ గెస్ట్ రోల్ ఉందట. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సినిమాకి కీలకమట. పైగా ఈ సీన్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందట. అందుకే ఈ గెస్ట్ రోల్ కి వెంకీ అయితే బాగుటుందని.. బాలయ్య-వెంకీ కలిస్తే ఈ ట్రాక్ సినిమాకే హైలైట్ అవుతుందని అనిల్ భావిస్తున్నాడట. మల్టీస్టారర్ సినిమాలు, గెస్ట్ రోల్స్ అంటే ఏ మాత్రం వెనకాడని వెంకీ మామ.. అనిల్ అడిగితే ఖచ్చితంగా ఈ సినిమా చేసే అవకాశముంది.
మరోవైపు ఈ మూవీలో విలన్ గా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ న్యూస్ నిజమై బాలయ్య సినిమాలో నిజంగానే రాజశేఖర్, వెంకటేష్ నటిస్తే.. ఈ ముగ్గురు స్టార్స్ ని ఒకే స్క్రీన్ లో చూడటం ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు.