
విక్టరీ వెంకటేష్ (Venkatesh) వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైనర్లతో అలరిస్తున్న వెంకీ మామ, ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ అన్నింటినీ చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' చేస్తున్నారు. అలాగే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సంక్రాంతి టార్గెట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత వెంకటేష్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ వశిష్ట(Director Vassishta)తో చేయడానికి అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘బింబిసార’ వంటి టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ బ్లాక్‌బస్టర్‌తో టాలీవుడ్‌ను ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న వశిష్ట, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ గ్రాఫిక్స్‌తో సుమారు 150 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే వశిష్ట, విక్టరీ వెంకటేష్ తో చేతులు కలపబోతున్నట్లు వినికిడి.
వెంకటేష్ కోసం వశిష్ట ఒక విభిన్నమైన లైన్ సిద్ధం చేశారట. వెంకటేష్ కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని ఒక కొత్త జోనర్‌లో, మైథాలజీ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక వినూత్న కథను వశిష్ట వినిపించగా, దానికి వెంకీ ఇంప్రెస్ అయి వెంటనే సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం.
ఈ క్రేజీ కాంబినేషన్‌ను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు, ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి సంయుక్తంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వెంకటేష్ నటుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే నల్లమలపు బుజ్జి నిర్మాణంలో వెంకటేష్ నటించిన ‘లక్ష్మి’, ‘చింతకాయల రవి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి.
సుదీర్ఘ విరామం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, నల్లమలపు బుజ్జి కలిసి వెంకటేష్‌తో ఈ భారీ బడ్జెట్ సినిమాను బ్యాంక్రోల్ చేయనుండటం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ముగిసిన తర్వాత, వశిష్ట కూడా చిరంజీవి సినిమా బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యాక ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని తెలుస్తోంది.





