చిరంజీవి సినిమాలో వెంకటేష్ పాట, ఫైట్.. అనిల్ ప్లాన్ అదిరిందిగా!
on Apr 2, 2025
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో అనిల్ రావిపూడి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వెళతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే సినిమాను ఎంత స్పీడ్‌గా పూర్తి చేస్తాడో కూడా అందరికీ తెలుసు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సంక్రాంతి విజయాన్ని అందుకున్న అనిల్.. వెంటనే తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎనౌన్స్ చేయడమే కాదు, ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. అయితే రెగ్యులర్ షూటింగ్‌ని మాత్రం జూన్‌లో ప్రారంభిస్తారు. చిరంజీవిని ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. సినిమా కోసం భారీ హంగుల్ని సమకూరుస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్‌తో సినిమా అంటే ఆ మాత్రం ఆర్భాటం ఉండాలి కాబట్టి మరి కాస్త కొత్తగా ఆలోచిస్తున్నాడు.
1997లో వచ్చిన ‘మాస్టర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాడిన ‘తమ్ముడు అరే తమ్ముడు..’ పాట అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత 2001లో ‘మృగరాజు’ చిత్రం కోసం ‘ఛాయ్ ఛాయ్..’ అంటూ మరో పాట పాడారు. ఈ పాట కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా కోసం మరోసారి తన గొంతును సవరించుకోబోతున్నారు చిరు. ఆయన మొదటి పాటను ట్యూన్ చేసే అవకాశం దేవాకి రాగా, రెండో పాటను మణిశర్మ స్వరపరిచారు. ఇప్పుడు మూడో పాటకు రాగాలు కట్టే అవకాశం భీమ్స్ సిసిరోలియోకి దక్కింది. ఈ సినిమాకి సంబంధించి ఇదొక విశేషం కాగా, ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఎఫ్2 నుంచి వెంకటేష్‌తో కొనసాగుతున్న స్నేహం కొద్దీ మెగాస్టార్ సినిమాలో అతనికి ఒక గెస్ట్ రోల్ క్రియేట్ చేశారట. బయట వినిపిస్తున్న మరో మాట ఏమిటంటే.. అది అతిథి పాత్ర కాదని, వెంకీ క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అతని కోసం ఒక పాట, ఒక ఫైట్‌ని కూడా డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఆ పాటలో చిరు, వెంకీ కలిసి స్టెప్స్ వేస్తారట. టాలీవుడ్ స్టార్ హీరోలు, పైగా స్నేహితులు కలిసి డాన్స్ చేయబోతున్నారంటే ప్రేక్షకులకు, అభిమానులకు పండగే కదా.
అనిల్ రావిపూడి సినిమాలో బలమైన కథ ఉంటూనే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని ఇప్పటివరకు అతని సినిమాలు చూస్తే అర్థమవుతుంది. చిరంజీవి చేసే కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రేక్షకులకు తెలుసు. కామెడీని పండించడంలో చిరుది ఒక డిఫరెంట్ స్టైల్ అనే చెప్పాలి. ఆయన కామెడీ టైమింగ్‌ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించగల కెపాసిటీ ఉన్న దర్శకుడు అనిల్. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే కథను కూడా సిద్ధం చేసుకున్నాడు అనిల్. ఈ సినిమాలో చిరు ఓ సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపిస్తారట. హీరోయిన్‌కి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత చిరుకి అప్పగిస్తారు. ఆ క్రమంలో జరిగే సంఘటనల నేపథ్యంలో కథ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు మేకర్స్. పరిణితీ చోప్రా, అదితి రావు హైదరి, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని అనిల్ రావిపూడి స్వయంగా తెలిపారు. ఇందులో 5 పాటలు ఉండగా, వాటిలో 3 పాటల్ని ఆల్రెడీ రికార్డ్ చేశారని తెలుస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
