టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న రవితేజ కుమార్తె.. హీరో ఎవరో తెలుసా?
on Apr 12, 2025
చిత్ర పరిశ్రమలోని కొందరు నటీనటులు, టెక్నీషియన్స్ వారి వారసుల్ని కూడా ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో పరిచయం చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు హీరో రవితేజ కూడా తన వారసుల్ని ఇండస్ట్రీలో ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు మహాధన్ ‘రాజా ది గ్రేట్’ చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. అయితే అతను నటుడిగా కాకుండా దర్శకత్వ శాఖవైపు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగా వంటి దర్శకుల వద్ద మెళకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం.
తాజాగా రవితేజ కుమార్తె మోక్షద కూడా చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మోక్షద సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించే సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేయబోతోందట. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించే ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండతోనే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిత్రాన్ని వినోద్ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని మించే స్థాయిలో కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం వల్ల మోక్షదకు మంచి అనుభవం వస్తుందని రవితేజ భావిస్తున్నారు. రవితేజ ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆర్‌టి మీడియా వర్క్స్ పేరుతో స్థాపించిన ఈ సంస్థ ద్వారా ఇప్పటికే కొన్ని సినిమాలు నిర్మించారు. ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మోక్షదను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మేకింగ్‌కి సంబంధించిన అన్ని విషయాల్లో తర్ఫీదు పొందితే భవిష్యత్తులో ఆర్‌టి మీడియా వర్క్స్‌ను పూర్తిగా మోక్షదకు అప్పగించే అవకాశం ఉంది. మోక్షద చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోందనే వార్తను రవితేజ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రం తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
