ప్రభాస్ బాటలో చైతన్య.. బాహుబలి నిర్మాతల స్కెచ్..!
on Jan 7, 2025
ఒకప్పుడు హారర్ కామెడీ జానర్ సినిమాలు టాలీవుడ్ లో ఒక ఊపు ఊపాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంటోంది. మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' అనే హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నాడు. అలాగే వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా కూడా హారర్ కామెడీ జానరే. ఇక ఇప్పుడు అదే బాటలో అక్కినేని హీరో నాగ చైతన్య పయనిస్తున్నట్లు తెలుస్తోంది. (Naga Chaitanya)
ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' సినిమా చేస్తున్నాడు చైతన్య. ఈ చిత్రాన్ని చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దీని తర్వాత 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా ప్రకటించాడు చైతన్య. వీటితో పాటు తాజాగా మరో ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు సమాచారం. 'బాహుబలి'ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుందట. హారర్ కామెడీ జానర్ లో ఒక నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ హారర్ కామెడీ ఫిల్మ్ తో చైతన్య హిట్ అందుకుంటాడేమో చూడాలి.