ప్రశాంత్ వర్మ సినిమాలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు!
on Oct 28, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన తదుపరి సినిమాని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశముంది. దీంతో అప్పటివరకు తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ పై చూసుకోలేమనే నిరాశ మహేష్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే వారి నిరాశను పోగొట్టే సర్ ప్రైజింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. (Mahesh Babu As Lord krishna)
మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva). లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అర్జున్ జంధ్యాల దర్శకుడు. నవంబర్ 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాకి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని నిమిషాల పాటు శ్రీ కృష్ణుడి పాత్ర కనిపిస్తుందట. ఆ పాత్రలో మహేష్ కనువిందు చేయనున్నాడని సమాచారం. మేనల్లుడు కోసం మహేష్ ఈ రోల్ చేయడానికి అంగీకరించినట్లు వినికిడి.
మహేష్ ఇప్పటిదాకా పౌరాణిక పాత్రలు పోషించలేదు. కానీ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో మహేష్ బాగుంటాడనే అభిప్రాయం అందరిలో ఉంది. ఇటీవల వచ్చిన 'కల్కి'లో సైతం కృష్ణుడి పాత్రలో మహేష్ నటించి ఉంటే, బాగుండేదనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు 'దేవకీ నందన వాసుదేవ' రూపంలో మహేష్ అభిమానుల కోరిక నెరవేరనుందని న్యూస్ వినిపిస్తోంది.