ఇది నిజం.. ఇండియాలో మొదటి కౌబాయ్ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ కాదు!
on Feb 28, 2025
సూపర్‌స్టార్ కృష్ణ సాహసానికి మారు పేరు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీరోగా తన కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి తెలుగు సినిమాను ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు. టెక్నాలజీ పరంగా తెలుగు సినిమా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డారు. మొదటి సాంఘిక కలర్ చిత్రం, మొదటి సినిమా స్కోప్ చిత్రం, మొదటి 70 ఎంఎం సినిమా, మొదటి జేమ్స్‌బాండ్ మూవీ.. ఇలా చెప్పుకుంటే చాలా కొత్త తరహా సినిమాలు కృష్ణతోనే మొదలయ్యాయి. ఆ వరసలోనే ఇండియాలో మొదటి కౌబాయ్ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ అని చెబుతారు. 1971లో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి గత 50 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటివరకు అదే మొదటి కౌబాయ్ సినిమా అనేది జనంలో నానుతూ వచ్చింది. నిజానికి ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఫస్ట్ కౌబాయ్ మూవీ కాదు అనేది వాస్తవం. ఈ సినిమా కంటే ముందే శోభన్‌బాబు హీరోగా ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ అనే సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా కౌబాయ్ సినిమాయే. ‘మోసగాళ్ళకు మోసగాడు’ 1971 ఆగస్ట్ 27న రిలీజ్ అయితే.. అదే సంవత్సరం మే 20న ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ రిలీజ్ అయింది. అంటే మూడు నెలల ముందే కౌబాయ్ సినిమా తెలుగులో వచ్చేసింది.
సూపర్‌స్టార్ కృష్ణ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా ‘అగ్ని పరీక్ష’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. అప్పటికే ‘గూఢచారి 116’, ‘నేనేంటే నేనే’ వంటి క్రైమ్ సినిమాలు చేసి ఉన్నారు కృష్ణ. ఆ సినిమాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణ తన సొంత బేనర్‌లో ఆ తరహా సినిమా చెయ్యాలనుకున్నారు. అప్పటికే ‘ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ’, ‘మెకన్నాస్ గోల్డ్’ వంటి హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. అలాంటి కౌబాయ్ సినిమా చేస్తే వెరైటీగా ఉంటుందని భావించిన కృష్ణ.. రచయిత ఆరుద్రను ఆ సినిమాలు చూసి తెలుగు నేటివిటీకి తగిన కథను రెడీ చెయ్యమని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఒక మంచి కథను సిద్ధం చేశారు ఆరుద్ర. అప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల కంటే బిగ్ రేంజ్‌లో ఈ కౌబాయ్ సినిమా చెయ్యాలనుకున్నారు. అప్పటి వరకు బాలీవుడ్‌లో కూడా ఎవరూ కౌబాయ్ సినిమాను నిర్మించే సాహసం చెయ్యలేదు. 1970లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా కోసం కృష్ణ ఎంతో కష్టపడ్డారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి వి.ఎస్.ఆర్.స్వామి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. రూ.7 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 1971 ఆగస్ట్ 27న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తొలుత ఎన్.టి.రామారావుకు చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు కృష్ణ. సినిమా చూసిన ఎన్టీఆర్ ‘ఈ సినిమాకి మహిళా ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదు. మొదటి రన్‌లో కంటే రిపీట్ రన్‌లో బాగా కలెక్ట్ చేస్తుంది. తప్పకుండా మంచి సినిమా అవుతుంది’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే యూత్ ఆడియన్స్ తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి రాలేదు. అయినా సినిమా ఘనవిజయం సాధించి రిపీట్ రన్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఒక మైల్‌స్టోన్ అయింది.
ఇదిలా ఉంటే.. ‘మోసగాళ్ళకు మోసగాడు’ ప్రారంభం కావడానికి ముందే ‘దేవదాసు’ నిర్మాత డి.ఎల్.నారాయణ ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ పేరుతో ఓ కౌబాయ్ చిత్రాన్ని ప్రారంభించారు. శోభన్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు పురాణం సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. 1967లో ఇంగ్లీష్, ఇటాలియన్ భాషల్లో రూపొందిన ‘డెత్ రైడ్స్ ఎ హార్స్’ చిత్రం ఆధారంగా ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో నిర్మించారు. అప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాలకు భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమాను కూడా యూత్ మాత్రమే ఆదరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడలేదు. అయినా నిర్మాత డి.ఎల్.నారాయణకు పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన 100 రోజుల తర్వాత ‘మోసగాళ్ళకు మోసగాడు’ విడుదలైంది. మొదట రిలీజ్ అయిన ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ బ్లాక్ అండ్ వైట్ సినిమా కావడం, నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బికనీర్, సిమ్లా, పాండిచ్చేరి వంటి ప్రదేశాల్లో, థార్ ఎడారిలో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ లొకేషన్స్ ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ నిచ్చాయి. ఏ విధంగా చూసినా ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ కంటే ‘మోసగాళ్ళకు మోసగాడు’ బిగ్ రేంజ్ సినిమా. అంతేకాకుండా ఘన విజయం సాధించిన సినిమా కావడంతో అప్పటి నుంచి ఇండియాలో మొదటి కౌబాయ్ సినిమా అనగానే ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్నే ప్రస్తావిస్తారు. రిలీజ్ పరంగా చూస్తే ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’ మొదటి కౌబాయ్ సినిమాగా చెప్పుకోవాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
