చిన్నతనంలోనే ఎల్.వి.ప్రసాద్ చేసిన సాహసం.. అందుకున్న సాయం!
on Jan 16, 2026
(జనవరి 17 ఎల్.వి.ప్రసాద్ జయంతి సందర్భంగా..)
ఒక సాధారణ వ్యక్తి నుంచి చిత్ర పరిశ్రమలో ఒక మహాశక్తిగా ఎదిగిన అతి కొద్దిమందిలో ఎల్.వి.ప్రసాద్ ఒకరు. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదలతో ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న నిత్యకృషీవలుడు ఎల్.వి.ప్రసాద్. అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో చిన్నతనంలోనే ఒక సాహసం చేశారు. ఆ తర్వాత ఒక మామూలు వ్యక్తి సాయంతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు ప్రసాద్. ఆయన జీవితంలో విశేషాలు చెప్పుకోదగ్గ ఈ రెండు అంశాల గురించి తెలుసుకుందాం.
రైతు కుటుంబంలో జన్మించిన ప్రసాద్.. చిన్నతనం నుంచే చురుకుగా ఉండేవారు. ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా పరిశీలించేవారు. అయితే ఆయనకు చదువు మాత్రం అబ్బలేదు. ఆయన చూపు ఎప్పుడూ ఆ ఊరికి, ఆ చట్టుపక్క ఊళ్ళకు వచ్చే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపులపైనే ఉండేది. అలాగే గుడారాల్లో పాత రీళ్ళతో ప్రదర్శించే సినిమాలను చూసేవారు. అంతేకాదు, నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు. చదువును పక్కన పెట్టి తనకిష్టమైన వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని గడిపేవారు.
అప్పటికి ప్రసాద్ వయసు 17 సంవత్సరాలు. ఆరోజుల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. ప్రసాద్‌కి పెళ్లి చేస్తే జీవితంలో స్థిరపడతాడని తల్లిదండ్రులు భావించారు. అప్పటికే తన మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను ప్రేమించారు ప్రసాద్. ఈ విషయం పెద్ద వారితో చెబితే వాళ్లు ఒప్పుకోలేదు. అతను ఉన్న పరిస్థితి చూసి మేనమామ కూడా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యనన్నారు. దాంతో ఎవరికీ చెప్పకుండా తన మరదల్ని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నారు ప్రసాద్. అప్పుడున్న సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లను బట్టి ప్రసాద్ చేసింది సాహసమనే చెప్పాలి. అలా ఓ ఇంటివాడయ్యారు. పెళ్లయిన తర్వాత కూడా నాటకాలతోనే కాలక్షేపం చేసేవారు. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత తండ్రి ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఆయన అప్పుల బాధలు చూడలేక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 100 రూపాయలు తీసుకొని బొంబాయి వెళ్లిపోయారు ప్రసాద్.
అక్కడ అతనికి ఎవరూ తెలీదు. భాష రాదు. తనకిష్టమైన సినిమాలపైనే ఆయన దృష్టి మళ్లింది. ఒక స్టూడియో బయట నిలబడి వచ్చేపోయేవారిని గమనిస్తూ ఉండేవారు. అలా చాలా రోజులు గడిపారు. రోజూ స్టూడియో బయట కనిపిస్తున్న ప్రసాద్‌ను చూశారు ఒక కాస్ట్యూమర్. ఆ స్టూడియోలో నిర్మాణమయ్యే సినిమాలకు ఆయనే బట్టలు కుట్టేవారు. అక్కడికి దగ్గరలోనే ఆయనకు ఒక టైలరింగ్ షాప్ ఉంది. ఒకరోజు ప్రసాద్‌ని పలకరించి అన్ని విషయాలు తెలుసుకొని తన షాప్‌లో ఆశ్రయం ఇచ్చాడు.
వీనస్ ఫిలిం కంపెనీలో నెలకు 15 రూపాయల జీతానికి ప్రసాద్‌ని పనిలో పెట్టాడు ఆ కాస్ట్యూమర్. ప్రసాద్ ఒక మహోన్నత వ్యక్తిగా ఎదగడానికి మొదట చేయూతనిచ్చింది ఆ కాస్ట్యూమరే. ఆ సమయంలోనే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ చిత్రంలో చిన్న పాత్ర పోషించారు ప్రసాద్. ఆ తర్వాత 1931లో ఇంపీరియల్ ఫిలింస్ నిర్మించిన భారతదేశపు మొదటి టాకీ ఆలం ఆరా చిత్రంలో నాలుగు చిన్న చిన్న పాత్రల్లో నటించారు.
ఆ తర్వాత హెచ్.ఎం.రెడ్డితో ప్రసాద్‌కి పరిచయం ఏర్పడిరది. ఆయన తమిళ్‌లో నిర్మిస్తున్న మొదటి టాకీ కాళిదాసులో నటించే అవకాశం ప్రసాద్‌కి దక్కింది. ఆ తర్వాత ఆయనే తెలుగులో మొదటి టాకీ భక్త ప్రహ్లాద రూపొందించారు. అందులో కూడా ప్రసాద్ నటించారు. అలా భారతదేశంలో మూడు భాషల్లో నిర్మించిన తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత ఎల్.వి.ప్రసాద్‌కి దక్కింది. 1930లో బొంబాయి వెళ్లిన నాటినుంచి 15 సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు అనుభవించారు ప్రసాద్. ఆ 15 సంవత్సరాల్లో ఫిలిం రిప్రజెంటేటివ్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ కెమెరామెన్‌గా, థియేటర్ గేట్‌మెన్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా.. ఇలా అన్ని శాఖల్లో మంచి అనుభవం సంపాదించుకున్నారు. 1946లో విడుదలైన గృహప్రవేశం చిత్రంలో హీరోగా నటించడమే కాదు, దర్శకుడిగా కూడా పరిచయమయ్యారు. ఆ సినిమాలో భానుమతి హీరోయిన్‌గా నటించారు. గృహప్రవేశం విజయం సాధించడంతో దర్శకుడిగా ఎల్.వి.ప్రసాద్ ప్రయాణం మొదలైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



