రాజబాబు ఒక హిందీ సినిమా చేశారు.. ఎంత తీసుకున్నారో తెలుసా?
on Nov 12, 2025
పాత తరం హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు రాజబాబు. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని డిఫరెంట్‌గా డైలాగులు చెప్పడంతోనేకాదు, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ చేసేవారు. 1960లో వచ్చిన సమాజం చిత్రంలో తొలిసారి చిన్న పాత్రలో నటించారు రాజబాబు. ఆ తర్వాత తండ్రులు కొడుకులు, కులగోత్రాలు చిత్రాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ క్రమంలోనే స్వర్ణగౌరి చిత్రంలో నటించారు. ఈ సినిమాకి తొలిసారి అందుకున్న పారితోషికం 350 రూపాయలు.
అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న రాజబాబు కెరీర్ అంతస్తులు చిత్రంతో ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఈ సినిమాకి 1300 రూపాయల పారితోషికం ఇచ్చారు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్. ఈ సినిమా తర్వాత రాజబాబును వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. దాంతో బిజీ కమెడియన్ అయిపోయారు. ఒక దశలో రాజబాబు ఉంటేనే సినిమాను రిలీజ్ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలను అడిగే స్థాయికి చేరుకున్నారు.
కమెడియన్‌గా అంతటి క్రేజ్ సంపాదించుకున్న తరుణంలోనే రాజబాబుకి ఒక హిందీ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. 1975లో విడుదలైన ‘రాణీ ఔర్ లాల్‌పరి’ అనే సినిమాలోని ఒక పాట కోసం రాజబాబుని బొంబాయి పిలిపించారు. పిల్లలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఎంతో మంది బాలీవుడ్ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఆ క్రమంలోనే తెలుగు నుంచి రాజబాబు వెళ్లారు. ఈ సినిమాలోని ఒక పాటలో లిల్లీపుట్‌గా నటించారు.
షూటింగ్ పూర్తయిన తర్వాత రెమ్యునరేషన్ ఎంత ఇవ్వమంటారు అని రాజబాబుని అడిగారు నిర్మాత. ఆ ఒక్క పాట కోసం రెమ్యునరేషన్ ఆశించలేదు రాజబాబు. ఆయన అడిగినందుకు ‘మీ ఇష్టం’ అన్నారు. చేసింది ఒక పాటే కాబట్టి ఐదు వేలు ఇస్తే అదే ఎక్కువ అనుకున్నారు. కానీ, ఆ నిర్మాత 40 వేల రూపాయలు చేతిలో పెట్టారు. అంత ఎమౌంట్ ఇచ్చేసరికి షాక్ అయ్యారు రాజబాబు. ఆ డబ్బు తీసుకున్నారు. తను అనుకున్న 5 వేలు ఉంచుకొని మిగతా 35 వేలను ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్న టెక్నీషియన్స్ అందరికీ పంచి పెట్టేశారు. రాజబాబు మంచితనాన్ని ప్రతిబింబించే సంఘటనలలో ఇదొకటి. రాజబాబుకి సేవా గుణం ఎక్కువ. తన జీవితంలో ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



