నందమూరి తారకరత్న జీవితం చిన్న వయసులోనే ఎందుకు ముగిసింది?
on Feb 22, 2025
(ఫిబ్రవరి 22 నందమూరి తారకరత్న జయంతి సందర్భంగా..)
తారకరత్న.. నందమూరి కుటుంబంలో ఒక విశిష్టమైన వ్యక్తి. తన వ్యక్తిత్వంతో అందరి మనసుల్లోనూ మంచి స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన తారకరత్న అంటే నందమూరి అభిమానులు ఎంతో ఇష్టపడతారు. సినిమా ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనత ఆయన సొంతం. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ క్రాస్ చెయ్యలేకపోయారు. ఇకపై కూడా ఆ రికార్డు అలాగే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకేరోజు తారకరత్న హీరోగా నటిస్తున్న 9 సినిమాలు ప్రారంభమయ్యాయి. నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న సినీ, వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయాల్లో ఎలా రాణించారు అనే విషయాల గురించి ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1983 ఫిబ్రవరి 22న నందమూరి మోహనకృష్ణ, సీత దంపతులకు చెన్నైలో జన్మించారు తారకరత్న. అతని అసలు పేరు ఓబులేశు. ఆయన ప్రాథమిక విద్య చెన్నయ్‌లో జరిగింది. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ సమయంలోనే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. దానికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1, ఆది చిత్రాలతో స్టార్ హీరో అనిపించుకున్నారు. తన కుమారుడ్ని కూడా హీరోగా చూడాలనుకున్న మోహనకృష్ణ ఎన్.టి.ఆర్. అని వచ్చేలా నందమూరి తారకరత్నగా అతని పేరు మార్చారు. హీరోగా అతని కెరీర్ ఒకేసారి 9 సినిమాలతో ప్రారంభం కావడం అనేది ఏ హీరోకీ జరగలేదు. అది ఒక రికార్డుగా నిలిచింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒకటో నంబర్ కుర్రాడు తొలి సినిమాగా విడుదలైంది. ఈ సినిమా ఆడియోపరంగా ఘనవిజయం సాధించినా సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు వంటి సినిమాలు చేశారు. అవి కూడా అతన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. ఆ సమయంలోనే అమరావతి చిత్రంతో విలన్‌గా కొత్త అవతారం ఎత్తారు తారకరత్న. ఈ సినిమాలోని అతని నటనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత నందీశ్వరుడు, మహాభక్త శిరియాళ, కాకతీయుడు, ఎవరు సినిమాలు చేశారు. హీరోగా అంతగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా మారి మనమంతా, రాజా చెయ్యివేస్తే, 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించారు. 2012లో అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదివరకే పెళ్ళయిన యువతిని వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తారకరత్నను వ్యతిరేకించారు. అయినా ఆ తర్వాత అన్నీ సర్దుకోవడంతో మళ్ళీ కుటుంబ సభ్యులతోనే కొనసాగారు. తారకరత్న, అలేఖ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి తనవంతు కృషి చెయ్యాలనుకున్న తారకరత్న ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. తాత నందమూరి తారక రామారావు అడుగు జాడల్లో నడుస్తూ ఆయన క్రమశిక్షణను వారసత్వంగా తీసుకున్న తారకరత్న.. నందమూరి అభిమానుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. బావ నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల్ని కలుసుకున్నారు. సినిమా రంగంలో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన తారకరత్న రాజకీయ రంగంలో రాణించాలనుకున్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు కదిలారు. అయితే విధి ఆయన్ని బలి తీసుకుంది. నారా లోకేష్‌తో కలిసి నాలుగు రోజులపాటు అవిశ్రాంతంగా పాదయాత్ర చేయడం వల్ల ఆయన నీరసించిపోయారు. 2023 జనవరి 27న యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో తారకరత్న జనంతో కలిసి నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లో కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. హాస్పిటల్‌లో చేరిన రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే కొనసాగింది. 22 రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స పొందినప్పటికీ తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. ఎంతో సౌమ్యుడిగా, వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న తారకరత్న 39 ఏళ్ళ అతి చిన్న వయసులో మృత్యువు ఒడిలోకి చేరుకోవడం అందర్నీ బాధించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
