టాలీవుడ్‌కి కలెక్షన్ కింగ్‌ని పరిచయం చేసిన ‘స్వర్గం నరకం’ చిత్రానికి 50 ఏళ్లు!
on Nov 22, 2025
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది విలక్షణమైన నటులు ఉన్నారు. వారిలో మంచు మోహన్‌బాబు మరింత విలక్షణమైన నటుడు. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ‘స్వర్గం నరకం’. ఈ సినిమా నవంబర్ 22కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆరోజు మొదలైన మోహన్‌బాబు సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు, మరపురాని సినిమాలు చేశారు. 1975 నవంబర్ 22న ‘స్వర్గం నరకం’ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమా కంటే ముందే అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు చిత్రాల్లో మోహన్‌బాబు చిన్న చిన్న పాత్రలు పోషించారు. తన 50 సంవత్సరాల కెరీర్‌లో హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 500కి పైగా సినిమాల్లో నటించి కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు మోహన్‌బాబు. ఆయన తొలిసారి హీరోగా నటించిన ‘స్వర్గం నరకం’ చిత్రం ఎలా ప్రారంభమైంది? ఈ సినిమాకి సంబంధించిన విశేషాలేమిటో తెలుసుకుందాం.
ఎన్నో అపురూపమైన సినిమాలు తీసి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న ఆదుర్తి సుబ్బారావు.. ఒక దశలో అంతా కొత్తవారితో ‘తేనె మనసులు’ సినిమా చెయ్యాలనుకున్నారు. 1965లో విడుదలైన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు సూపర్‌స్టార్ కృష్ణను పరిచయం చేశారు ఆదుర్తి. ఇక ‘స్వర్గం నరకం’ చిత్రం విషయానికి వస్తే.. దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన 10వ సినిమా ఇది. ఆదుర్తి సుబ్బారావు అంటే దాసరికి ఎంతో గౌరవం. ఆయనలా అంతా కొత్తవారితో సినిమా చెయ్యాలని దర్శకుడిగా మారిన రోజు నుంచే అనుకుంటూ ఉండేవారు దాసరి. ఆ కోరిక తన 10వ సినిమాతో తీరింది. అందుకే ఈ సినిమాను ఆదుర్తి సుబ్బారావుకు అంకితమిచ్చారు దాసరి.
తేనెమనసులు సినిమా కోసం హీరోహీరోయిన్ల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అంతా కొత్తవారినే తీసుకున్నారు. అదే పద్ధతిలో స్వర్గం నరకం సినిమా ద్వారా 120 మంది కొత్త నటీనటుల్ని పరిచయం చేశారు దాసరి. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం.. ఇలా ప్రతి సెంటర్‌లో రెండు రోజుల చొప్పున ఆడిషన్స్ నిర్వహించి నటీనటుల్ని ఎంపిక చేశారు. మోహన్‌బాబు, అన్నపూర్ణ ఒక జంట కాగా, ఈశ్వరరావు, జయలక్ష్మీ మరో జంట.
వీరిలో మోహన్‌బాబు నటించిన రెండో సినిమా భలేదొంగలు చిత్రంతోనే నటుడిగా బిజీ అయిపోయారు. అన్నపూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని వందల సినిమాల్లో నటించారు. జయలక్ష్మీ విషయానికి వస్తే.. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మరో చరిత్ర చిత్రంలో ఫటాఫట్ అనే ఊతపదంతో ఫటాఫట్ జయలక్ష్మీగా అందర్నీ అలరించారు. అయితే 22 సంవత్సరాల చిన్న వయసులోనే కొన్ని కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తొలి సినిమా స్వర్గం నరకం నవంబర్ 22న విడుదల కాగా, 1980 నవంబర్ 21న ఆమె చనిపోవడం గమనార్హం.
దాసరి నారాయణరావు నటుడిగానే ఇండస్ట్రీలో ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేసి తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా మారారు. తను దర్శకుడు అయిన తర్వాత తొలిసారి స్వర్గం నరకం చిత్రంలో నటించారు. సినిమాలో ఎంతో కీలకమైన ఆచారి పాత్రను అద్భుతంగా పోషించి అభినందనలు అందుకున్నారు. ఈ పాత్ర ద్వారా ‘ఫినిష్’ అనే ఊత పదాన్ని పరిచయం చేశారు దాసరి. అది ఎంతో కాలం జనానికి ఊతపదంగా మారింది. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన దాసరికి స్వర్గం నరకం అనే సినిమా ఎంతో ప్రత్యేకమైందని చెప్పాలి. ఇప్పటికీ స్వర్గం నరకం చిత్రాన్ని చూస్తున్నారంటే ఈ సినిమాకి ప్రేక్షకాదరణ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



