Home

»

Featured News

‘దేవదాసు’ను తలపించే కథతో ఎన్టీఆర్ చేసిన సినిమా గురించి మీకు తెలుసా?

Apr 09, 2026

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌లాంటి సినిమా ‘దేవదాసు’. ఈ చిత్ర నిర్మాణం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి. 1953లో విడుదలైన ఈ చిత్రాన్ని వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డి.ఎల్.నారాయణ నిర్మించారు. ఇదే కాంబినేషన్‌లో మూడు సంవత్సరాల తర్వాత 1956లో ఆ సినిమాను పోలిన మరో సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎన్.టి.రామారావు హీరోగా నటించారు. ఆ సినిమా పేరు ‘చిరంజీవులు’. ఈ సినిమా దేవదాసు తరహాలోనే ఉందని చూసిన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కథాగమనం కూడా దేవదాసులాగే సాగుతుంది. 

1940 దశకంలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన డి.ఎల్. నారాయణ అతి తొందరలోనే ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు. అతని సిన్సియారిటీ నచ్చి భానుమతి, నాగయ్య వంటి వారు తమ సంస్థల్లో ప్రొడక్షన్ మేనేజర్‌గా తీసుకునేవారు. అలా కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత తనే సొంతంగా సినిమా నిర్మించాలనుకున్నారు డి.ఎల్. అయితే సినిమాను నిర్మించేంత బడ్జెట్ తన దగ్గర లేకపోవడంతో డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్, రచయిత సముద్రాలను వర్కింగ్ పార్టనర్స్‌గా చేర్చుకొని చిత్ర నిర్మాణం ప్రారంభించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన స్త్రీ సాహసం, శాంతి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత దేవదాసు చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ముగ్గురు పార్టనర్స్ నిర్మాణం నుంచి తప్ప్పుకున్నారు. అయితే సినిమాకి టెక్నీషియన్స్‌గా పనిచేశారు. నిర్మాత డి.ఎల్. నమ్మకాన్ని నిలబెడుతూ ‘దేవదాసు’ పెద్ద విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో గొప్పగా చెప్ప్పుకునే సినిమా అయింది. ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు డి.ఎల్. 

ఆ క్రమంలోనే ‘చిరంజీవులు’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ కథను మొదట ఎఎన్నార్‌కు చెప్పారు. చిన్న పిల్లల నుంచి కథ మొదలై హీరో, హీరోయిన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, అనుకోకుండా పెళ్లి ఆగిపోవడం, హీరో కళ్లు కోల్పోవడం, ఆ తర్వాత హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, కొన్ని పరిణామాల తర్వాత చివరికి కలుసుకున్న హీరో, హీరోయిన్ ఒకేసారి చనిపోవడం.. ఇదీ కథ. ఈ కథ దేవదాసు కథలాగే ఉందన్న కారణంతో సినిమా చేసేందుకు ఎఎన్నార్ ఒప్ప్పుకోలేదు. అప్ప్పుడు ఈ కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు డి.ఎల్. 

కథ విన్న ఎన్టీఆర్ తనకు అది డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఓకే చెప్పారు. ఈ కథను దేవదాసు చిత్రాన్ని రూపొందించిన వేదాంతం రాఘవయ్య తెరకెక్కించడం విశేషం. ఎన్.టి.రామారావు, జమున, గుమ్మడి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. సినిమాలోని కొన్ని పాటలు మాత్రం జనాదరణ పొందాయి. అదే క్రమంలో తన దగ్గరకు డి.ఎల్. తీసుకొచ్చిన రెండు కథలను ఎఎన్నార్ రిజెక్ట్ చేశారు. ఆ కథలను వేరే హీరోలతో నిర్మించారు డి.ఎల్. అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అక్కినేని నాగేశ్వరరావు తను చేసే సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఈ మూడు సినిమాలు ప్రూవ్ చేశాయి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com