‘గుండమ్మ కథ’ సినిమాకి అక్కినేని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఎందుకో తెలుసా?
on Feb 14, 2026
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మరపురాని సినిమాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ సినిమాలుగానే ఉండిపోతాయి. అలాంటి వాటిలో ‘గుండమ్మ కథ’ ఒకటి. 63 సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పటికీ చూస్తున్నారు. అలాంటి అద్భుతమైన సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి, మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
అప్పటికి ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ స్టార్ హీరోలే. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరూ కలిసి నటించారు. వీరి కెరీర్‌లో దాదాపు 15 సినిమాల్లో కలిసి నటించడం విశేషం. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న ఈ సినిమాకి గుండమ్మ కథ అని టైటిల్ పెట్టడం సాహసమనే చెప్పాలి. ఆరోజుల్లో బౌండెడ్ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళ్లేవారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. కానీ, ఈ సినిమా షూటింగ్ అలా జరగలేదు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల డేట్స్ ఎప్ప్పుడు దొరికితే అప్ప్పుడు దఫదఫాలుగా షూటింగ్ చేశారు.
ఇదిలా ఉంటే.. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో నటించినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. దీని వెనుక ఒక కథ ఉంది. 1944లో సీతారామ జననంతో కెరీర్ ప్రారంభించిన అక్కినేని.. 1957 నాటికి 60 సినిమాలు పూర్తి చేశారు. పి.చంగయ్య దర్శకత్వంలో డి.ఎల్.నారాయణ నిర్మించిన దొంగల్లో దొర అక్కినేని నటించిన 60వ సినిమా. ఈ సందర్భంగా తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన నిర్మాతలను సత్కరించుకోవాలి అనుకున్నారు అక్కినేని. అదే విషయాన్ని నిర్మాత నాగిరెడ్డికి చెప్పారు. అలా చేస్తే చాలా బాగుంటుందని ఆయన కూడా ప్రోత్సహించారు.
అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహించాలనుకున్నారు. అయితే దానికి విశాలమైన వేదిక అవసరం ఉంటుంది. ఎక్కడ చెయ్యాలి అని అక్కినేని ఆలోచించారు. ఆ సమయంలో నాగిరెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. వాహిని స్టూడియో ఎదురుగా ఉన్న 24 ఎకరాల అడవిలాంటి ప్రదేశాన్ని ఇస్తానని, కార్యక్రమం అక్కడ చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు, ఆ ప్రాంతాన్ని చదును చేయించి చక్కని గార్డెన్‌గా తీర్చిదిద్దారు నాగిరెడ్డి. వేడుక జరపడానికి అవసరమైన అన్న ఏర్పాటు ఆయన దగ్గరుండి చూసుకున్నారు.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అధ్యక్షత వహించారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్, చిత్తూరు నాగయ్య, ఎన్.టి.రామారావు, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే వేడుకలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 25 వేల రూపాయల విరాళం అందించారు అక్కినేని. ఎంతో ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవం జరిగింది. అనంతరం కార్యక్రమానికి హాజరైన 4,000 మందికి చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుక నిర్వహణకు ఆరోజుల్లోనే 30,000 రూపాయలు ఖర్చయింది. అదంతా నాగిరెడ్డి భరించారు.
వేడుకకు నాగిరెడ్డి ఖర్చుపెట్టిన 30 వేలు తిరిగి ఇవ్వబోయారు అక్కినేని. కానీ, నాగిరెడ్డి తీసుకోలేదు. ఆయనకు రుణం ఉండకూడదు అని భావించిన అక్కినేని ఆ తర్వాత విజయ సంస్థ నిర్మించిన ‘గుండమ్మకథ’ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటించారు. 1962లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపించింది. అప్ప్పుడైనా రెమ్యునరేషన్ తీసుకోమని అక్కినేనిని అడిగారు నాగిరెడ్డి. కానీ, అక్కినేని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. అలా గుండమ్మకథ చిత్రానికి అక్కినేని ఎలాంటి పారితోషికం తీసుకోలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



