Home

»

Featured News

ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ సాహ‌స‌ర‌త్న నంద‌మూరి హ‌రికృష్ణ‌.!

Sep 2, 2026 12:00PM

(సెప్టెంబ‌ర్ 2 నంద‌మూరి హ‌రికృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా..)

న‌టుడుగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్త‌గా రాణించి అంద‌రి మ‌నసుల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు నంద‌మూరి హ‌రికృష్ణ‌. 60 ఏళ్ల త‌న ప్ర‌యాణంలో ఎన్నో మ‌జిలీలు ఉన్నాయి. అలాగే ఆయ‌న గురించి తెలియ‌ని ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. 

11 ఏళ్ల వ‌య‌సులో ‘శ్రీ‌కృష్ణావ‌త‌రం’ చిత్రంలో బాల‌కృష్ణుడిగా తొలిసారి వెండితెర‌పై క‌నిపించారు నంద‌మూరి హ‌రికృష్ణ‌. ఆ త‌ర్వాత ’త‌ల్లా?  పెళ్లామా?’, ‘తాత‌మ్మ‌క‌ల‌’, ‘రామ్ ర‌హీమ్‌’, ‘దాన‌వీరశూర క‌ర్ణ’ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించారు. హ‌రికృష్ణ న‌టించిన ఐదు సినిమాల్లో శ్రీ‌కృష్ణావ‌తారం, త‌ల్లా?  పెళ్లామా?  చిత్రాలు త‌ప్ప మిగ‌తా మూడు సినిమాల్లోనూ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి న‌టించారు. 1977లో విడుద‌లైన ‘దాన‌వీరశూర క‌ర్ణ’ చిత్రంలో అర్జునుడిగా న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించారు హ‌రికృష్ణ‌. ఈ సినిమా త‌ర్వాత న‌టుడిగా తాత్కాలికంగా విరామం తీసుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే మ‌రో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘డ్రైవ‌ర్ రాముడు’ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత ఎన్‌.టి.రామారావు రాజకీయాల్లోకి రావ‌డంతో న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు హ‌రికృష్ణ‌. 

దాదాపు 20 సంవ‌త్స‌రాల విరామం త‌ర్వాత 1998లో వ‌చ్చిన ‘శ్రీ‌రాముల‌య్య’ చిత్రంలోని కామ్రేడ్ స‌త్యం వంటి ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు హ‌రికృష్ణ‌. ‘సీతారామ‌రాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివ‌రామ‌రాజు’, ‘టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్’, ‘స్వామి’ వంటి సినిమాల్లో ఆయ‌న చేసిన ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. లాహిరి లాహిరి లాహిరి చిత్రంలోని న‌ట‌న‌కుగాను ఉత్త‌మ స‌హాయ‌నటుడిగా నంది అవార్డును అందుకున్నారు హ‌రికృష్ణ‌. 

ఎన్టీఆర్ కుమారుడుగానే కాకుండా, తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం, ధైర్యం, మాతృభాషాభిమానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వెండితెరపై అయినా, రాజకీయ రణరంగంలో అయినా సరే, ఆయన నడిచిన దారి ఎప్పుడూ ఒక ప్రభంజనమే. చిన్నతనం నుంచే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగానికి పరిచయమైన ఆయన, ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ స్థాపనలోనూ, ప్రచారంలోనూ అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. చైతన్య రథానికి సారథిగా మారి వేలాది కిలోమీటర్లు నిరంతరం వాహనం నడుపుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చూపిన పట్టుదలతో రాజకీయ చరిత్రలోనే ఒక వినుత్న అధ్యాయాన్ని లిఖించారు నంద‌మూరి హ‌రికృష్ణ‌. 

హరికృష్ణకి మాతృభాషపై ఉన్న ప్రేమ, అభిమానం అపారమైనవి. పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దేశ అత్యున్నత సభలో ఆయన కేవలం తెలుగులోనే మాట్లాడేవారు. రాజ్యసభాధ్యక్షుడు కూడా ఆయనను హిందీలో మాట్లాడాలని కోరినప్పటికీ, ‘నా మాతృభాష తెలుగు, నేను తెలుగులోనే నా స్వరాన్ని వినిపిస్తాను’ అని నిష్కర్షగా చెప్పి తన మాతృభాషాభిమానాన్ని చాటుకున్నారు. 

రాజకీయాల్లోకి వస్తే, ఆయన హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందించారు. తన కుమారుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ప్రయాణంలోనూ ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. ఎన్టీఆర్ ప్రతి ఆడియో వేడుకకు లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై తన ఆశీస్సులు అందిస్తూ ఆనందించేవారు. ఇలాంటి ఎన్నో అరుదైన గుణాలు, నిజాయితీ కలిగిన నందమూరి హరికృష్ణ తెలుగు ప్రజల గుండెల్లో నిరంతరం చిరంజీవిగా నిలిచిపోతారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com