Home

»

Featured News

మధురమైన పాటలకు పెట్టింది పేరు ‘మామ’ కె.వి.మహదేవన్!

Mar 13, 2026

(మార్చి 14 కె.వి.మహదేవన్ జయంతి సందర్భంగా..)

పాతతరం సంగీత దర్శకుల్లో కె.వి.మహదేవన్‌ది ఒక విశిష్టశైలి. ఏ తరహా పాట ఇచ్చినా దాన్ని ఎంతో మధురంగా స్వర పరిచి అందరూ పాడుకునే విధంగా మలచడంలో దిట్ట. కొందరు సంగీత దర్శకులు బాణీలు మాత్రమే ఇస్తారు. వాటికి సాహిత్యాన్ని జోడిస్తారు. కానీ, మహదేవన్ శైలి అది కాదు. పాట రాసి ఇచ్చిన తర్వాతే ట్యూన్ చేస్తారు. ఆయన కెరీర్‌లో ఒక్కసారి కూడా పాట రాయకుండా ట్యూన్ ఇచ్చిన సందర్భం లేదు. ఆ విధంగా ఎన్నో అద్భుతాలు సష్టించారు. 

1918 మార్చి 14న తమిళనాడులోని కృష్ణన్‌కోయిల్‌లో జన్మించారు కె.వి.మహదేవన్. మహదేవన్ అంటే ‘మామ’. ఈ పేరు రావడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్‌లో వచ్చిన ‘మంచి మనసులు’ చిత్రం. ఈ సినిమాలో ‘మామా.. మామా..’ అనే పాట ఆరోజుల్లో ఎంతో పాపులర్. ప్రతి ఒక్కరూ పాడుకునేవారు. అలా మహదేవన్ అందరితోనూ మామ అని పిలిపించుకున్నారు. తమిళనాట పుట్టినా, తమిళ చిత్రాలలో స్వరవిన్యాసాలు చేసి అలరించినా, ఎందుకనో మహదేవన్‌కు తెలుగు చిత్రాలతోనే ఎక్కువ బంధం ఉందని చెప్పక తప్పదు. కేవలం సాంఘిక చిత్రాలలోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ మహదేవన్ అద్భుతమైన పాటలు చేశారు. 

సినిమాలోని సందర్భానికి తగ్గట్టుగా బాణీలు కట్టడంలో మహదేవన్ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎంతో మంది దర్శకనిర్మాతలు మహదేవన్‌తోనే సంగీతం చేయించుకునేవారు. కొందరు నిర్మాతలు మహదేవన్‌తో తప్ప మరొకరితో సంగీతంతో సినిమాలు చేయము అని చెప్పేవారు. ఆయన పరమమపదించిన తర్వాత ఒక నిర్మాత సినిమాలు నిర్మించడం ఆపేశారంటే ఆయన ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఎన్టీఆర్, ఎఎన్నార్ నుంచి కష్ణ, శోభన్‌బాబు, కష్ణంరాజు వంటి హీరోల వరకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు మహదేవన్. ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున వంటి హీరోల సినిమాలకు కూడా సంగీతం చేశారు. మహదేవన్‌కు సంగీతం అందించడంలో ఆయన శిష్యుడు పుహళేంది కీలక పాత్ర పోషించేవారు. తనతో సమానంగా ఆయన్ని కూడా గౌరవించాలని చెప్పేవారు మహదేవన్. చివరి వరకు ఆయనతోనే ఉండి సంగీత ప్రియులకు మధురమైన పాటలు అందించడంలో పుహళేంది తన సహకారాన్ని అందించారు. 

ఇక మహదేవన్ సంగీతం అందించిన సినిమాల గురించి చెప్పడం అంటే అది పెద్ద సాహసమే అవుతుంది. మూగ మనసులు, మంచి మనసులు, దాగుడు మూతలు, అంతస్తులు, ఆస్తిపరులు, బడిపంతులు, బంగారుబాబు వంటి సినిమాల నుంచి ప్రేమనగర్, ముత్యాల ముగ్గు, సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, అడవిరాముడు వరకు అన్నింటినీ మించి సంగీతంలోని మాధుర్యాన్ని అందరికీ పంచిన శంకరాభరణం వంటి కళాఖండానికి కె.వి.మహదేవన్ అందించిన సంగీతం నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంటుంది. 50 సంవ‌త్స‌రాల‌కు పైగా కెరీర్ కొన‌సాగించిన మ‌హ‌దేవ‌న్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో 600కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఉత్తమ సంగీత దర్శకుడుగా శంకరాభరణం చిత్రానికి, తమిళ సినిమా కందన్ కరుణై చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అనేకం కె.వి.మహదేవన్‌ను వరించాయి. 1996 వరకు తన కెరీర్‌ను కొనసాగించిన ఆయన 2001 జూన్ 21న 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com