సాయం చెయ్యడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్న మహానటి సావిత్రి!
on Dec 5, 2025
(డిసెంబర్ 6 మహానటి సావిత్రి జయంతి సందర్భంగా..)
సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో మద్రాస్ చేరుకున్న సావిత్రి చిన్న చిన్న పాత్రలు వేస్తూ మహానటిగా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. ఆమె నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలు అందించారు. అంతేకాదు, తోటి నటీనటులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వారికి ఆర్థిక సాయం చేశారు.
అలాంటి మహౌన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సావిత్రి చివరి దశలో ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఆర్థికంగా ఎలాంటి ఒడిడుకులకు లోనయ్యారు అనేది మనకు తెలుసు. తను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఇతరులకు సాయం చేయడానికి వెనుకాడే వారు కాదు. అప్పు చేసైనా తనకు చేతనైనంత సహాయం చేసేవారు. అలాంటి ఓ అరుదైన సంఘటన 1975లో జరిగింది.
నటిగా తను మంచి స్థాయిలో ఉన్నప్పుడు వడ్డీవారిపాలెం గ్రామంలో ఒక పాఠశాలను తన స్వంత ఖర్చులతో నిర్మించారు సావిత్రి. శ్రీమతి సావిత్రి గణేష్ పాఠశాల పేరుతో ఆ స్కూల్‌ను 1962లో స్థాపించారు. ఆ తర్వాత పాఠశాలను ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు మారింది. పాఠశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చేది. దానితోనే సిబ్బందికి జీతాలు ఇచ్చేవారు.
1975 ప్రాంతంలో పాఠశాల ఎలా ఉంది అనే విషయం తెలుసుకునేందుకు ఆ స్కూల్ కరస్పాండెంట్‌కు ఫోన్ చేశారు సావిత్రి. అతను చెప్పిన మాటలు విని ఆమె షాక్ అయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ రాకపోవడం వల్ల 5 నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సావిత్రి మరో మాట మాట్లాడకుండా ఆ కరస్పాండెంట్‌ను మద్రాస్ రమ్మని చెప్పారు.
మద్రాస్ వెళ్లిన ఆ కరస్పాండెంట్‌కు 1 లక్షా 4 వేల రూపాయల చెక్కును అందించి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించమని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ విషయం తర్వాత చూసుకుందామని చెప్పి ఆయన్ని పంపించారు. 1975లో లక్ష రూపాయలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం 40 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది.
ఈ డబ్బు చెల్లించే సమయానికి సావిత్రి ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్ సిబ్బంది కష్టాలు చూడలేక ఆమె ఆ డబ్బును ఏర్పాటు చేశారు. తను ఏ స్థితిలో ఉన్నాను అనేది కూడా ఆలోచించకుండా దానధర్మాలు చేయడానికి వెనుకాడని సావిత్రి వంటి మహాదాత సినీ పరిశ్రమలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



