పాటకు కొత్త సొబగులు అద్దిన అనంతశ్రీరామ్.. చదువు మధ్యలో ఎందుకు ఆపేసారో తెలుసా?
on Apr 8, 2025
(ఏప్రిల్ 8 గేయ రచయిత అనంత శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా..)
మన సినిమాలలో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. దాదాపుగా పాటలు లేకుండా భారతీయ సినిమాలు ఉండవనే చెప్పాలి. ఒక్కోసారి కథా గమనాన్ని పాటలు నిర్దేశిస్తాయని కొన్ని సినిమాలు రుజువు చేశాయి. అంతటి ప్రభావం పాటలకు ఉంటుంది. తెలుగు సినిమాల్లో పాటల గురించి చెప్పాలంటే పాత తరంలో పింగళి నాగేంద్రరావు, ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి వంటి ఘనాపాటి గేయ రచయితలు తెలుగు సినిమా పాటల్ని కొత్త పుంతలు తొక్కించారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాతి తరంలో గేయరచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు వేటూరి సుందరామ్మూర్తి. ఆ తర్వాత వచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి వంటి గేయ రచయితలు ఉధృతంగా పాటలు రాస్తున్న తరుణంలో కూడా సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరామ్మూర్తి వంటి వారు కూడా తమ పాటలతో అలరించడం విశేషం. ఆ సమయంలోనే ఒక యువ కెరటం తెలుగు సినిమా రంగానికి వచ్చింది. అతి చిన్న వయసులోనే తెలుగు సినిమా పాటలకు కొత్త సొబగులను అద్ది శ్రోతలను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. అతనే అనంత శ్రీరామ్. 2005లో కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు 1000కి పైగా పాటలు రాసిన అనంత శ్రీరామ్ సినీ, వ్యక్తిగత జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.
1984 ఏప్రిల్ 8న పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో సి.వి.వి.సత్యనారాయణ, ఉమారాణి దంపతులకు జన్మించారు అనంతశ్రీరామ్. నిర్మాత, రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఇతనికి పెదనాన్న అవుతారు. శ్రీరామ్ ప్రాథమిక విద్య దొడ్డిపట్లలోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోనూ కొనసాగించారు. చిన్నతనం నుంచి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న శ్రీరామ్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగానే చిత్ర పరిశ్రమకు వచ్చారు. మరో సంవత్సరం చదివితే ఇంజనీరింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించవచ్చని తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పినప్పటికీ ఇంజనీరింగ్ చదువు కొనసాగించకుండా మధ్యలోనే ఇండస్ట్రీకి వచ్చేశారు.
పాటల రచనలో అనంతశ్రీరామ్‌కి గురువు అంటూ ఎవరూ లేరు. తండ్రి సత్యనారాయణకు సాహిత్యాభిలాష ఉండడం వల్ల ఇతను కూడా దానిపై అభిరుచిని పెంచుకున్నారు. తన 12 ఏళ్ళ వయసు నుంచే పాటలు రాయడం మొదలు పెట్టారు. ఇతనిలోని ప్రతిభను మొదట గుర్తించిన నిర్మాత.. కోగంటి రామకృష్ణ. 2005లో తను నిర్మించిన ‘కాదంటే ఔననిలే’ చిత్రంలోని అన్ని పాటల్ని రాసే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వడమే కాదు, అనంత శ్రీరామ్ టాలెంట్ గురించి ఎంతో మందికి చెప్పి అతన్ని ప్రమోట్ చేసిన వ్యక్తి కోగంటి రామకృష్ణ. అదే సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘అందరివాడు’ చిత్రంలో ‘పడుచు బంగారమా..’ అనే పాట రాశారు. ఆ పాట పెద్ద హిట్ కావడంతో అనంత శ్రీరామ్ అనే గేయ రచయిత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక అప్పటి నుంచి వరస అవకాశాలు సంపాదించుకోగలిగారు. 2014 వరకు దాదాపు 195 చిత్రాల్లో 558 పాటలు రాశారు. అతనికి ఇష్టమైన గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.
సాధారణ శ్రోతలకు, ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో, చక్కని భావంతో పాటలు రాయడం అనేది అనంత శ్రీరామ్ ప్రత్యేకత. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, ఆలోచింపజేసే పాటలు ఎన్నో రాశారు. ‘ఇంకేం ఇంకే ఇంకేం కావాలే...’, ‘నిజంగా నేనే నా..’, ‘పచ్చబొట్టేసినా..’, ‘నమ్మవేమో గానీ..’, ‘ఈ హృదయం.. కరిగించి వెళ్లకే..’, ‘కళావతి..’, ‘మేఘాలు లేకున్న..’.. ఇలా ఒకటేమిటి అనంతశ్రీరామ్ రాసిన 1000 పాటల్లో ఎక్కువ శాతం సూపర్‌హిట్ అయినవే ఉండడం విశేషం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గేయ రచయితలు ఉన్నప్పటికీ అనంత్ శ్రీరామ్ రాసే పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుత ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పాటలు వినేందుకు ఇష్టపడుతున్నారు అనేది గ్రహించి దానికి తగ్గట్టుగా పాటలు రాసుకుంటూ వెళ్తున్న అనంతశ్రీరామ్ నుంచి మరిన్ని మధుర గీతాలు వస్తాయని ఆశించవచ్చు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
