సుద్దాలకు వచ్చిన జాతీయ అవార్డును క్యాన్సిల్ చెయ్యాలంటూ కమిటీకి లేఖ.. అసలేం జరిగింది?
on May 16, 2025
(మే 16 సుద్దాల అశోక్‌తేజ పుట్టినరోజు సందర్భంగా..)
తెలంగాణ సాయుధ పోరాటంలో తన పాటతో పాలకులను ఉలిక్కిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. ‘నీ బాంచెన్ కాల్మొక్కుతా..’ అనే బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించడంలో తన పాటను ఈటెగా మార్చుకున్నారు హనుమంతు. ఆ బాటలోనే తన పాటతో ముందుకు సాగుతున్నారు ఆయన తనయుడు సుద్దాల అశోక్‌తేజ. ఏ తరహా పాటైనా రాయగలను అని అనేకసార్లు రుజువు చేసుకున్నారు సుద్దాల. తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న మూడో గేయ రచయితగా సుద్దాల అశోక్‌తేజ ఘనత సాధించారు. ‘నమస్తే అన్న’ చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో 2,200 సినిమా పాటలు, 2,500 ప్రైవేట్ సాంగ్స్ రాశారు. అలాగే వివిధ అంశాలతో కూడిన 16 పుస్తకాలు రాశారు. గేయ రచయితగా ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన సుద్దాల అశోక్‌తేజ గేయరచయితగా సినీ ప్రవేశం ఎలా చేశారు? ఆయన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
1960 మే 16న భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో గుర్రం హనుమంతు, జానకమ్మ దంపతులకు జన్మించారు అశోక్‌తేజ. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు ప్రభాకర్ తేజ, సుధాకర్ తేజ, చెల్లెలు రచ్చ భారతి ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్య్ర సమరయోధులే. హనుమంతు ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించారు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పే తర్వాత తరాలకు కూడా సుద్దాలగా మార్చుకున్నారు. హనుమంతు 75 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. సాహిత్యం అనేది అశోక్‌తేజకు చిన్నతనంలోనే అబ్బింది. పాఠశాల చదువు కంటే సాహిత్యంపైనే ఎక్కువ ఆసక్తి చూపించడంతో 8వ తరగతి, పదో తరగతి ఫెయిల్ అయ్యారు. ఎంతో కష్టపడి ఇంటర్, ఎం.ఎ. పూర్తి చేశారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
అశోక్‌తేజ సోదరి కుమారుడు ఉత్తేజ్ టాలీవుడ్‌లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అతని సహకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మొదటి పాట ‘నమస్తే అన్న’లో రాశారు. ఆ తర్వాత కృష్ణవంశీని పరిచయం చేశారు ఉత్తేజ్. అశోక్‌తేజలో ఉన్న విప్లవ భావాలు కృష్ణవంశీకి బాగా నచ్చాయి. అందుకే తన సినిమాల్లో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. తండ్రి నేపథ్యం కారణంగా మొదట ఎక్కువగా విప్లవ గీతాలే రాయాల్సి వచ్చింది. దాసరి నారాయణరావు తన సినిమాల్లో అశోక్‌తేజకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఆవేశపూరితమైన పాటలే కాదు, ప్రేమ గీతాలతో కూడా ఆకట్టుకోగలను అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు అశోక్‌తేజ.
ఇదిలా ఉంటే.. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఎందరో మహా మహా రచయితలు తమ పాటలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఏ కళాకారుడికైనా జాతీయ పురస్కారం అనేది ఒక కలగా ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవాలని ఎంతో కృషి చేస్తుంటారు. కానీ, అది కొందరినే వరిస్తుంది. 90 ఏళ్ళకు పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికి మూడు పాటలకి జాతీయ అవార్డు లభించింది. 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా..’ పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా శ్రీశ్రీ మొదటిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1993లో వచ్చిన ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’ పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా వేటూరి సుందరామ్మూర్తి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మూడో పురస్కారాన్ని అందుకున్న ఘనత దక్కించుకున్నారు సుద్దాల అశోక్‌తేజ. 2003లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ చిత్రంలోని ‘నేను సైతం..’ పాటకు ఉత్తమ గేయ రచయితగా సుద్దాల జాతీయ అవార్డు అందుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉద్దండులైన రచయితలు ఉన్నప్పటికీ జాతీయ అవార్డు అందుక్ను మూడో వ్యక్తిగా ఘనత వహించారు సుద్దాల. కానీ, దీన్ని పరిశ్రమలోని కొందరు జీర్ణించుకోలేకపోయారు. శ్రీశ్రీ రాసిన నేను సైతం పల్లవిని తీసుకొని రాసిన పాటకు జాతీయ అవార్డు ఎలా ఇస్తారు? దాన్ని క్యాన్సిల్ చెయ్యాలంటూ పరిశ్రమకు చెందిన కొందరు.. జాతీయ అవార్డుల కమిటీకి లేఖ రాశారు. కానీ, దాన్ని కమిటీ పట్టించుకోలేదు. శ్రీశ్రీ రాసిన పల్లవిని తీసుకొని ఎంతో అద్భుతంగా ఆ పాటను పూర్తి చేశారు కాబట్టే సుద్దాల రాసిన పాటను అవార్డుకు ఎంపిక చేశామని కమిటీ చెప్పింది. ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తూ అవార్డు ఇచ్చామని కమిటీ స్పష్టం చేసింది. తనకు జరిగిన ఈ అవమానానికి ఇండస్ట్రీ నుంచి దాసరి, చిరంజీవి తప్ప ఎవరూ స్పందించకపోవడం తనకు బాధ కలిగించిందని సుద్దాల ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు. డా. సి.నారాయణరెడ్డి ఈ విషయంలో సుద్దాలకు ధైర్యం చెప్పారు. ‘శ్రీశ్రీగారి పల్లవి తీసుకోవడం అనేది ఒక గండం.. ఆ గండం నుంచి అత్యద్భుతంగా బయట పడ్డ ఉక్కు పిండం..’ అంటూ సుద్దాలను రవీంద్రభారతి వేదికగా అభినందించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
