విజయనిర్మల గిన్నిస్ రికార్డ్ సాధించడం ఎలా సాధ్యమైందో తెలుసా?
on Feb 20, 2025
(ఫిబ్రవరి 20 నటి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా..)
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పరిశ్రమలో ఎంతో మంది మహిళా దర్శకులు చిత్రాలు రూపొందించినప్పటికీ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు విజయనిర్మల. వాటిలో ఒక తమిళ సినిమా, ఒక మలయాళ సినిమా కూడా ఉన్నాయి. 24 సినిమాలు బయటి బేనర్స్ నిర్మించినవి కాగా, 20 సినిమాలు సొంత బేనర్‌లో నిర్మించారు. సూపర్‌స్టార్ కృష్ణతో 47 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. నటిగా, నిర్మాతగా దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని పొందిన విజయనిర్మల వ్యక్తిగత, సినీ జీవిత విశేషాలను ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
విజయనిర్మల అసలు పేరు నిడుదవోలు నిర్మల. 1946 ఫిబ్రవరి 20న రామ్మోహనరావు, శకుంతల దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం నరసరావుపేట అయినప్పటికీ తమిళనాడులో స్థిరపడ్డారు. రామ్మోహనరావు వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆ సంస్థలోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. నిర్మల బంధువైన రావు బాలసరస్వతీదేవి ప్రోత్సాహంతో నాలుగేళ్ళ వయసులోనే ‘మచ్చరేకై’ అనే తమిళ సినిమాతో బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. అలా ఆరు తమిళ సినిమాల్లో నటించిన తర్వాతే తెలుగులో సినిమా చేసే అవకాశం వచ్చింది. 1957లో వచ్చిన ‘పాండురంగ మహత్మ్యం’లో బాలకృష్ణుడుగా నటించారు నిర్మల. ఈ సినిమాలోని ‘జయ కృష్ణా ముకందా మురారి’ పాటలో ఆమె నటన, నృత్యం అందర్నీ ఆకట్టుకుంది. నిర్మల బాలనటిగా చేసిన చివరి సినిమా ‘భూకైలాస్’. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్‌కి గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బాలనటి కంటే ఎక్కువ, హీరోయిన్‌కి తక్కువ వయసు కావడంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో చదువుకుంటూనే నృత్యం నేర్చుకున్నారు.
1962లో కె.ఎస్.మూర్తిని వివాహం చేసుకున్నారు నిర్మల. భర్త ప్రోత్సాహంతో హీరోయిన్‌గా తిరిగి తన కెరీర్‌ను ప్రారంభించారు. 1964లో మలయాళ చిత్రం ‘భార్గవి నిలయం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత ‘రంగుల రాట్నం’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా తెలుగులో పరిచయమయ్యారు. అప్పటికే వెన్నిరాడై నిర్మల అనే హీరోయిన్ ఉండడంతో తన పేరును నీరజగా మార్చుకున్నారు. అయినా అందరూ తనని నిర్మల అనే పిలుస్తుండడంతో తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన విజయ సంస్థ గుర్తుగా పేరుకు ముందు విజయను చేర్చి విజయనిర్మలగా మారారు.
1967వ సంవత్సరం విజయనిర్మల జీవితాన్ని మార్చేసింది. అదే సంవత్సరం బాపు దర్శకత్వంలో ‘సాక్షి’ చిత్రంలో నటించారు. హీరో కృష్ణతో కలిసి నటించిన తొలి సినిమా అదే. ఆ సినిమా జరుగుతున్న సమయంలోనే కృష్ణ, విజయనిర్మల మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లికి దారి తీసింది. భర్త కె.ఎస్.మూర్తికి విడాకులు ఇచ్చి 1969లో కృష్ణను పెళ్లి చేసుకున్నారు విజయనిర్మల. అప్పటికే ఆమెకు ఐదేళ్ళ కొడుకు నరేష్ ఉన్నాడు. కృష్ణకు కూడా అది రెండో వివాహం. కొంతకాలం వారి వివాహాన్ని రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. విజయనిర్మల తన 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత ‘కవిత’ అనే మలయాళ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం తెలుగులో ‘మీనా’ చిత్రానికి దర్శకత్వం వహించి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇక అప్పటి నుంచి నటిగా, దర్శకురాలిగా ఎంతో బిజీ అయిపోయారు. దర్శకురాలిగా తన రెండో సినిమాతోనే పెద్ద సాహసం చేశారు విజయనిర్మల. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ఎవర్‌గ్రీన్ చిత్రం ‘దేవదాసు’ను రీమేక్ చేయడానికి సిద్ధపడడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది. కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమా సినిమా స్కోప్, కలర్‌లో రూపొందింది. అయితే అదే సమయంలో ఎఎన్నార్ ‘దేవదాసు’ను రీరిలీజ్ చేయడంతో విజయనిర్మల దేవదాసు పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ సినిమా మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఆమె దర్శకత్వంలో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. ఎక్కువ శాతం సినిమాల్లో కృష్ణ హీరోగా నటించడం విశేషం. విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన చివరి సినిమా నేరము శిక్ష.
నటిగా, దర్శకురాలిగా విశేషమైన ప్రతిభ కనబరిచిన విజయనిర్మల వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. సూపర్‌స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్నప్పుడు వీరి దాంపత్యం మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది అని కొందరు ఎగతాళి చేశారు. ఇండస్ట్రీలోని చాలా మంది అదే అభిప్రాయంతో ఉండేవారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఎంతో గౌరవప్రదమైన వైవాహిక జీవితాన్ని గడపడమే కాకుండా, ఒక ఆదర్శమైన జంటగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ, విజయనిర్మల. ఆమె కుమారుడు నరేష్ హీరోగా ఆరోజుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. విసుగు, విరామం లేకుండా దాదాపు 50 సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో కొనసాగిన విజయనిర్మల 2009 తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ భర్త కృష్ణతో శేష జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 2019 జూన్‌లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 27న తుదిశ్వాస విడిచారు విజయనిర్మల. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు 2022 నవంబర్ 15న సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
