ENGLISH | TELUGU  

అది జంధ్యాలకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం!

on Jan 14, 2026

(జనవరి 14 హాస్యబ్రహ్మ జంధ్యాల జయంతి సందర్భంగా..)

 

హాస్యం అనేది తెలుగువారి నిత్య జీవితంలో ఒక భాగం. హాస్యం లేకుండా తెలుగు వారి దైనందిన జీవితం ముందుకు సాగదు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. హాస్యం అనేది ఏ రూపంలో లభించినా దాన్ని ఆస్వాదించేందుకు తెలుగు వారు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన వారిలో ప్రథమంగా ప్రస్తావించుకోవాల్సిన వారు హాస్యబ్రహ్మ జంధ్యాల. 

 

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనేది జంధ్యాల మనసులోని మాట. అంతేకాదు, బహుళ ప్రాచుర్యం పొందిన నానుడి కూడా. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు హాస్యం అనేది సినిమాలో ప్రధాన కథాంశంతోపాటు ఒక ట్రాక్‌గా మాత్రమే నడిచేది. ఆ సమయంలో కూడా కొన్ని పూర్తి హాస్య ప్రధాన చిత్రాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలను పూర్తి స్థాయిలో రూపొందించిన ఘనత మాత్రం జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి దర్శకులకు మాత్రమే దక్కుతుంది. 1981లో ఒక నెల తేడాలో ఈ ఇద్దరు దర్శకులుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే అంతకుముందు రచయితగా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన జంధ్యాల ఆ అనుభవంతోనే దర్శకుడిగా మారారు. హాస్య చిత్రాలకు విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చిన జంధ్యాలను హాస్యబ్రహ్మగా పిలుచుకుంటారు ప్రేక్షకులు. 

 

1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. విజయవాడలో బి కాం. వరకు చదువుకున్నారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అలా ఎన్నో నాటకాలు రచించారు. ఏక్‌ దిన్‌కా సుల్తాన్‌, గుండెలు మార్చబడును ఆయన రచనల్లో ప్రముఖమైనవి. ఆయన నాటకాలు రేడియో కూడా ప్రసారమయ్యేవి. నాటకాలు రచించడమే కాకుండా దర్శకత్వం వహించడంతోపాటు నటించేవారు కూడా. అలా తన రచనల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు.

 

1976లో వచ్చిన ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయమయ్యారు జంధ్యాల. ఆ తర్వాత కొన్ని సినిమాలకు కథ, మాటలు కూడా అందించారు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు మాటలు రాసి ఆ డైలాగులు జనం చెప్పుకునేలా చేశారు జంధ్యాల. తన కెరీర్‌ ప్రారంభంలోనే సిరిసిరిమువ్వ, అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్‌ రాముడు వంటి కమర్షియల్‌ సూపర్‌హిట్‌ చిత్రాలకు మాటలు రాసి స్టార్‌ రైటర్‌ అయిపోయారు. అలాగే శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం వంటి క్లాసిక్స్‌కి కూడా మాటలు రాసి ఏ తరహా సినిమాకైనా అద్భుతమైన సంభాషణలు అందించగలనని నిరూపించుకున్నారు జంధ్యాల. అలా 5 సంవత్సరాలపాటు నెలకు 30 సినిమాలకు తగ్గకుండా పనిచేశారు జంధ్యాల.

 

కథ రచయితగా, మాటల రచయితగానే కాకుండా నాటకాలకు దర్శకత్వం వహించిన అనుభవం జంధ్యాలకు ఉంది. దాంతో తనదైన శైలిలో సినిమాలను రూపొందించాలన్న ఉద్దేశంతో దర్శకుడుగా మారారు. ప్రదీప్‌, పూర్ణిమలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తొలి ప్రయత్నంగా ‘ముద్దమందారం’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు జంధ్యాల. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా డైరెక్టర్‌గా జంధ్యాలకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నరేష్‌, ప్రదీప్‌, తులసి, పూర్ణిమ ప్రధాన పాత్రలుగా రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ సంచలన విజయం సాధించి జంధ్యాలను స్టార్‌ డైరెక్టర్‌ను చేసింది. ఈ సినిమా ద్వారా సుత్తిజంటగా వీరభద్రరావు, వేలులను స్టార్‌ కమెడియన్స్‌ను చేశారు జంధ్యాల. 

 

40 సినిమాలకు దర్శకత్వం వహించిన జంధ్యాల తన ప్రతి సినిమాలోనూ పూర్తి స్థాయి హాస్యం ఉండేలా చూసుకున్నారు. బలమైన కథాంశంతో సినిమాను నడిపిస్తూనే ఒక్కో సినిమాలో ఒక్కో విధమైన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. దీంతో సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలోని హాస్యాన్ని ప్రేక్షకులు ఆస్వాదించారు. నాలుగు స్తంభాలాట, రెండు జెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడిబొమ్మ, బాబాయ్‌ అబ్బాయ్‌, రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయ్‌, అహనా పెళ్ళంట, జయమ్ము నిశ్చయమ్మురా.. వంటివి జంధ్యాల నవ్వులు పూయించిన సినిమాల్లో కొన్ని మాత్రమే. 

 

పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చేస్తూనే ఆనందభైరవి, పడమటి సంధ్యారాగం, అమరజీవి, బాబాయ్‌ హోటల్‌, సత్యాగ్రహం వంటి ఉదాత్తమైన సినిమాలను కూడా రూపొందించారు జంధ్యాల. తన కెరీర్‌లో ఉత్తమ మాటల రచయితగా, ఉత్తమ దర్శకుడుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అశ్లీల దృశ్యాలు, సంభాషణలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆహ్లాదకరమైన సినిమాలను రూపొందించిన దర్శకుడు జంధ్యాల ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన సినిమాల ద్వారా సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి స్టార్‌ కమెడియన్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా జంధ్యాలకే దక్కుతుంది.

 

హాస్య చిత్రాలకు ఆయన వేసిన బాటలోనే ఎంతో మంది దర్శకులు తమ కెరీర్‌ను సాగిస్తున్నారు. అయితే జంధ్యాల సినిమాల్లో ఉన్నంత ఆరోగ్యకరమైన కామెడీ లేకపోయినా తమదైన శైలిలో హాస్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. తన హాస్య చిత్రాల ద్వారా అందర్నీ నవ్విస్తూ వారి ఆయుష్షును మరికొంత పెంచిన జంధ్యాల.. చాలా చిన్న వయసులోనే మృత్యువు ఒడిలోకి చేరారు. రచయితగా, దర్శకుడుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జంధ్యాల.. 2001 జూన్‌ 19న 50 ఏళ్ల వయసులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా మనమధ్య లేకపోయినా తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన రూపొందించిన సినిమాల్లోని హాస్యాన్ని తెలుగు ప్రేక్షకులు ఆస్వాదిస్తూ ఆ ‘హాస్యబ్రహ్మ’కు నివాళులు అర్పిస్తూనే ఉంటారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.