ENGLISH | TELUGU  

హాస్య నటచక్రవర్తి రేలంగి సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణమిదే!

on Nov 26, 2025

(నవంబర్‌ 27 రేలంగి వర్థంతి సందర్భంగా..)

హాస్యాన్ని ఇష్టపడని ప్రేక్షకులు ఒక్క శాతం కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే హాస్యానికి అంతటి శక్తి ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది, ఏదో ఒక విషాదం ఉంటుంది. వాటన్నింటినీ మటు మాయం చేసేది హాస్యం. హాయిగా నవ్వుకోవడం వల్ల తక్కువ అనారోగ్యానికి గురవుతారని డాక్టర్లే చెబుతుంటారు. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హాస్యాన్ని పండించడం ద్వారా ఎంతో మంది నటీనటులు మంచి పేరు తెచ్చుకున్నారు. వారిలో రేలంగి వెంకట్రామయ్యకు ఓ విశష్ట స్థానం ఉంది. ఆయన హాస్యనటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. భారతదేశంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి. మిగతా నటీనటులతో పోలిస్తే ఆయన ప్రయాణం ఎంతో సుదీర్ఘమైనది. ఈ సందర్భంగా ఈ హాస్య నటచక్రవర్తి అంతటి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి పడిన కష్టాలు, ఆయన జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం. 

1910 ఆగస్ట్‌ 9న కాకినాడ సమీపంలోని రావులపాడులో జన్మించారు రేలంగి. తండ్రి రామస్వామి, తల్లి అచ్చాయమ్మ. వీరికి ఒక్కగానొక్క సంతానం రేలంగి. ఆ తర్వాత రామస్వామి కుటుంబం కాకినాడకు మారింది. రేలంగి మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించారు. అయితే రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక రామస్వామికి లేదు. కొడుకును వృద్ధిలోకి తీసుకు రావడంలో శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, రేలంగి తల్లిలేని పిల్లవాడు కాకూడదని, తప్పకుండా పెళ్లి చేసుకోవాలని బంధువులు ఒత్తిడి తీసుకురావడంతో అచ్చాయమ్మ చెల్లెలు గౌరమ్మను వివాహం చేసుకున్నారు. రామస్వామి పూర్వీకులు కల్లు అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. ఆయన చదువుకోవడం వల్ల ఆ వ్యాపారం చేయకుండా సంగీతం మాస్టారుగా, హరికథలు చెప్పే గురువుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలా తండ్రి దగ్గర ఆ కళలన్నీ నేర్చుకున్నారు రేలంగి. మంచి శరీర దారుఢ్యంతో ఉండడం వల్ల కొడుకుని పోలీస్‌ ఆఫీసర్‌గా చూడాలనుకున్నారు రామస్వామి. ఒక దశలో రేలంగి కూడా పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకున్నారు. అయితే చదువుపట్ల శ్రద్ధ పెట్టేవారు కాదు. నాటకాలు వేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఫలితంగా 9వ తరగతి తప్పారు. అప్పుడు తండ్రి చేతిలో బాగా దెబ్బలు తిన్నారు రేలంగి. అయినా తనకు నాటకాలపై ఉన్న ఇష్టాన్ని మాత్రం చంపుకోలేదు. ఒకసారి తండ్రితో కలిసి యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ వారు వేసే నాటకానికి వెళ్లారు. అక్కడ నటీనటులు ప్రదర్శించిన నటనను అందరూ ప్రశంసించడం రేలంగిని ఆకట్టుకుంది. తను కూడా నటుడు అవ్వాలని ఆ సమయంలో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో చేరి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన రామస్వామి కొడుకును తీవ్రంగా మందలించారు. అయినా నాటకాల్లో నటించడం మాత్రం మానలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న రామస్వామి.. నాటకాల్లో అయినా వృద్ధిలోకి రమ్మని ఆశీర్వదించారు. 

తండ్రి ఆశీర్వాదం కూడా లభించడంతో పదేళ్ళపాటు వివిధ నాటక సమాజాల్లో నాటకాలు వేస్తూ గడిపారు రేలంగి. 1932లో తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద విడుదలైంది. అప్పట్లో తెలుగు సినిమాలు బొంబాయిలో, కలకత్తాలో నిర్మించేవారు. ఆ సమయంలో సి.పుల్లయ్య నిర్మించే సినిమాకి పనిచేసేందుకు తన మిత్రుడు పరదేశి వెళుతున్నాడని తెలుసుకొని తను కూడా వస్తానని చెప్పారు. అయితే మొదట తను వెళ్లి పరిస్థితిని బట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని మాట ఇవ్వడంతో సరేనన్నారు రేలంగి. అదే సమయంలో రామస్వామి కొడుక్కి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకొని 1933 డిసెంబర్‌ 8న బుచ్చియమ్మతో వివాహం చేశారు. తర్వాత కొన్నాళ్ళకు మరో కంపెనీ వారు కలకత్తా వెళుతున్నారని తెలుసుకొని భార్యకు, తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని కలకత్తా వెళ్లారు. ఆ తర్వాత దర్శకుడు సి.పుల్లయ్యను పరిచయం చేసుకున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా, క్యాస్టింగ్‌ అసిస్టెంట్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా.. ఇలా పలు శాఖల్లో దాదాపు 15 సంవత్సరాలు సి.పుల్లయ్య దగ్గరే పనిచేశారు రేలంగి. కొన్నాళ్ళకు సి.పుల్లయ్య మద్రాస్‌ వచ్చేశారు. రేలంగి కూడా మద్రాస్‌ వచ్చేసి భార్యను, తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చారు. రేలంగి క్యాస్టింగ్‌ ఏజెంట్‌ కావడం వల్ల తన తర్వాత వచ్చిన ఎంతో మంది నటీనటులను తన చేతులమీదుగా పంపించేవారు. అలా పుష్పవల్లి, కృష్ణవేణి, భానుమతి, అంజలీదేవి వంటి నటీమణులు అవకాశాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత నిర్మాతలుగా మారిన భానుమతి, అంజలీదేవి కృతజ్ఞతగా రేలంగికి తాము నిర్మించిన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. సి.పుల్లయ్య దగ్గర పనిచేసిన 15 సంవత్సరాల్లో పది సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వచ్చాయి తప్ప గుర్తింపు మాత్రం రాలేదు. 

ఒక దశలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు రేలంగి. భార్య, తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వారికి చికిత్స చేయించే స్తోమత లేక గురువు సి.పుల్లయ్యతోపాటు మరికొందరి ఆర్థిక సాయంతో వారికి వైద్యం చేయించారు. ఇక తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రావని నిర్ణయించుకొని కుటుంబంతో సహా కాకినాడ చేరుకున్నారు. ఆ తర్వాత 1948లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వింధ్యరాణి అనే సినిమా ప్రారంభమైంది. రేలంగి తిరిగి కాకినాడ వెళ్లిపోయారన్న విషయం తెలుసుకున్న పుల్లయ్య అతన్ని మద్రాస్‌ పిలిపించి వింధ్యరాణి చిత్రంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రను ఇచ్చారు. ఈ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ మరుసటి సంవత్సరం కీలుగుర్రం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన గుణసుందరి కథ చిత్రంలో రేలంగి చేసిన కలామతి క్యారెక్టర్‌ అతని కెరీర్‌ని ఒక్కసారిగా టర్న్‌ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత రేలంగికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలు అతనికి లభించాయి. అతని హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1950 నుంచి 1970 వరకు రేలంగి లేని సినిమా లేదు అన్నంత బిజీ ఆర్టిస్టు అయిపోయారు. ముఖ్యంగా రేలంగి, రమణారెడ్డి కామెడీకి ప్రేక్షకులు విరగబడి నవ్వేవారు. రేలంగికి జంటగా సూర్యకాంతం, గిరిజ ఎక్కువ సినిమాల్లో నటించారు. 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన రేలంగికి అందరూ అవకాశాలు ఇచ్చేవారు. అప్పట్లో ప్రతి సినిమాలోనూ రేలంగి ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉండేవారు. మిస్సమ్మ, మాయాబజార్‌, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు, వెలుగు నీడలు, నర్తనశాల, విప్రనారాయణ వంటి సినిమాల్లో రేలంగి చేసిన పాత్రలకు కథానాయకుడితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నటుడిగానే కాదు, సింగర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రేలంగి. ‘వినవే బాల.. నా ప్రేమగోల..’, ‘ధర్మం చెయ్‌ బాబూ..’, ‘సరదా సరదా సిగరెట్టు..’ వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత సమాజం పేరుతో ఓ సినిమాను నిర్మించారు రేలంగి. హాస్యనటుడు రాజబాబుకి ఇదే మొదటి సినిమా. 

తన కెరీర్‌లో 300కి పైగా సినిమాల్లో నటించిన రేలంగి.. నటుడుగా బిజీగా ఉన్న సమయంలోనే తనకు తానే అవకాశాలు తగ్గించుకున్నారు. తోటి హాస్యనటులకు అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టు పత్రికా ముఖంగా తెలియజేశారు. రేలంగి తీసుకున్న నిర్ణయం వల్లే పద్మనాభం, రాజబాబు, చలం వంటి నటులు వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, ఉత్తమ హాస్యనటులకు ఇచ్చే అవార్డుల పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. రేలంగికి లభించిన పురస్కారాలు, పొందిన సత్కారాలకు లెక్కే లేదు. అన్నింటినీ మించి భారతదేశంలోనే మొదటిసారి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న హాస్యనటుడు రేలంగి. 1959 మే 14న మద్రాస్‌లోని తెలుగు జర్నలిస్టు అసోసియేషన్‌ రేలంగితో గజారోహణ చేయించారు. రేలంగిని ఏనుగుపై ఎక్కించి మద్రాసు పురవీధుల్లో తిప్పారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. రేలంగి పుట్టింది రావులపాడులో, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లిగూడెం అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఎందుకంటే అక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో అభిమానించేవారు. అందుకే ఆ తర్వాత తాడేపల్లిగూడెంలోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆ ఊరిలో అత్యాధునిక సౌకర్యాలతో రేలంగి చిత్ర మందిర్‌ పేరుతో ఓ సినిమా థియేటర్‌ను నిర్మించారు. 1962లో ఈ థియేటర్‌ ప్రారంభోత్సవానికి కె.వి.రెడ్డి, సి.పుల్లయ్య, ఎస్‌.వి.రంగారావు, జమున, కాంతారావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. తాడేపల్లిగూడెం ప్రజలకు ఎంటర్‌ ది డ్రాగన్‌, మెకన్నాస్‌ గోల్డ్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసే అరుదైన అవకాశాన్ని ఈ థియేటర్‌ ద్వారా కల్పించారు రేలంగి. 

రేలంగికి దానగుణం ఎక్కువ. తను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని కష్టాల్లో ఉన్నవారికి దానం చేసేందుకు వెనుకాడలేదు. కళాశాలలకు విరాళాలు ఇచ్చారు, ఎంతో మందికి వివాహాలు చేయించారు. ప్రతిరోజూ రేలంగి ఇంట్లో అన్నదాన కార్యక్రమం జరిగేది. అన్నదానానికి కావాల్సిన బియ్యం, కూరగాయలు పండించేందుకు కొన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అడిగిన వారికి లేదనకుండా ఎన్నో దానధర్మాలు చేశారు రేలంగి. దానికి భార్య సహకారం కూడా ఎంతో ఉండేది. రేలంగికి కూడా ఒకే ఒక్క సంతానం. పేరు సత్యనారాయణబాబు. తన కొడుక్కి పిల్లనిచ్చేందుకు ఎంతో మంది ధనవంతులు ఆసక్తి చూపినప్పటికీ తను ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా తనకు పిల్లనిచ్చిన బావమరిది కూతుర్నే కోడలుగా తెచ్చుకున్నారు రేలంగి. సత్యనారాయణబాబు కూడా చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. బాలానందం అనే సినిమాలో నటించారు కూడా. ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరి రోజుల్లో కీళ్ళకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూనే అడపా దడపా సినిమాలు చేసేవారు రేలంగి. ఆ తర్వాత ఆ వ్యాధి తీవ్రరూపం దాల్చి నడుము వరకు చేరడంతో అది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా డాక్టర్లు గుర్తించారు. 1975 నాటికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో నవంబర్‌ 27న తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో కన్నుమూసారు హాస్యనట చక్రవర్తి రేలంగి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.