తండ్రి చెప్పినట్టే సౌందర్య కెరీర్ సాగింది.. ఆమె జీవితం కూడా అలాగే ముగిసింది!
on Feb 27, 2025
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాతి తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి సౌందర్య. 1990వ దశకంలో టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లు ఎక్కువ శాతం ఎక్స్‌పోజింగ్‌పైనే తమ కెరీర్ ఆధారపడి ఉందని నమ్మేవారు. ఆ విధంగానే సినిమాలు చేస్తుండేవారు. కానీ, దానికి భిన్నంగా తాను ఎక్స్‌పోజింగ్ చేయబోనని తన దర్శకనిర్మాతలకు చెప్పి ఆ మాట మీదే నిలబడ్డారు సౌందర్య. మంచి నటిగా ఎదగాలంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదని నిరూపించిన నటి సౌందర్య. 1992లో ప్రారంభమైన సౌందర్య కెరీర్ 2004తో ముగిసింది. 31 ఏళ్ళ అతి చిన్న వయసులో ఆమెను మృత్యువు కబళించింది. ఎంతో వైవిధ్యంగా సాగి, విషాదంగా ముగిసిన సౌందర్య సినీ, జీవిత విశేషాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
సౌందర్య అసలు పేరు సౌమ్య. 1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగళ్‌లో కె.ఎస్.సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించారు. ఆమె మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు, తమిళ్ అనర్గళంగా మాట్లాడగలరు. తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా ఉండేవారు. ఒక సినిమా ఫంక్షన్‌కి తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య. అక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకుడు, రచయిత హంసలేఖ తాను రచన చేస్తున్న గంధర్వ చిత్రంలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఉందని సత్యనారాయణతో చెప్పారు. అప్పుడు ఎంబిబిఎస్ చదువుతున్న సౌందర్య అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత వరస అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో మనవరాలి పెళ్లి చిత్రంలో హరీష్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా 1993లో తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఆమె నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 8 తెలుగు సినిమాలు కావడం విశేషం. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య.
సౌందర్యకు నటిగా మంచి పేరు తెచ్చిన అమ్మోరు చిత్రం 1992లోనే ప్రారంభమైంది. అయితే నిర్మాణపరమైన సమస్యల వల్ల చాలా ఆలస్యంగా 1995లో విడుదలైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాక సౌందర్యకు నటిగా మంచి పేరు తెచ్చింది. దాంతో సంవత్సరానికి 10కి తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయారు సౌందర్య. తన 12 సంవత్సరాల సినీ కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించారు సౌందర్య. ఆమె జీవించి ఉన్నప్పుడు రిలీజ్ అయిన చివరి సినిమా శ్వేతనాగు. అది ఆమె 100వ సినిమా కావడం గమనార్హం. ఆమె మరణానంతరం కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. తమిళ్, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన చంద్రముఖి కంటే ముందే అదే కథతో కన్నడలో సౌందర్య చేసిన ఆప్తమిత్ర ఆమె మరణించిన తర్వాతే రిలీజ్ అయింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన సౌందర్య నటించారు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ వంటి స్టార్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్స్ చేశారు. అలాగే తమిళ్‌లో రజినీకాంత్‌తో పడయప్పా, అరుణాచలం వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు. అలాగే హరీష్, వినీత్ వంటి యంగ్ హీరోలతో కూడా సౌందర్య మంచి సినిమాలు చేశారు. తన కెరీర్‌లో 100కిపైగా సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమాలోనూ అశ్లీలమైన పాత్రలు పోషించకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. గ్లామర్ పాత్రలు చేయకపోయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఒకప్పుడు సావిత్రి తరహాలో ఆమెను అందరూ ఆదరించేవారు. తెలుగులో సౌందర్యకు బాగా పేరు తెచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, అమ్మోరు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాముడొచ్చాడు, పెదరాయుడు, ప్రియరాగాలు, తారకరాముడు, అంత:పురం, చూడాలని వుంది.
1995లో తను ఎంతగానో ప్రేమించే తండ్రి సత్యనారాయణ మరణించడంతో సౌందర్య మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది. తన తండ్రి జ్ఞాపకార్థం ఒక సినిమా నిర్మించాలని ఎంతో ప్రయత్నించారు. ఎన్నో కథలు విని చివరికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే చిత్రాన్ని కన్నడలో నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు ఈ చిత్రానికి లభించాయి. వాటితోపాటు కర్ణాటక స్టేట్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కూడా ద్వీప చిత్రం గెలుచుకుంది.
సౌందర్య వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. తన మేనమామ, బాల్య స్నేహితుడైన రఘును 2003 ఏప్రిల్ 27న వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. చిన్నతనం నుంచి ప్రజాసేవ చెయ్యాలని, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కోరిక ఆమెకు బలంగా ఉండేది. అంతేకాదు, ఆమెకు హిందూత్వ భావాలు ఎక్కువ. అందుకే తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక గ్రామంలో ఆవు పేడతో కళ్లాపి చల్లి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనే వారంతా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన కూడా పెట్టారు. దాన్ని బట్టి హిందూ సాంప్రదాయంపై ఆమెకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలోని ముళబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి చేసారు. ఓ అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోదరుడు అమరనాథ్, అతని భార్య ఎంతో సహకరించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చాలా విద్యాలయాలను స్థాపించారు. సౌందర్య కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది.
తను చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే రాజకీయాల్లోకి వెళ్లడం తప్పనిసరి అని భావించిన సౌందర్య.. 2004 జనవరి ప్రారంభంలో బీజేపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అందులో భాగంగానే కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విద్యాసాగరరావు తరఫున ప్రచారం చేసేందుకు 2004 ఏప్రిల్ 17 ఉదయం 11 గంటలకు బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి చార్టెర్డ్ విమానంలో బయల్దేరారు సౌందర్య. ఆమెతోపాటు సోదరుడు అమరనాథ్ కూడా ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ అత్యవసర ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఆ విమానంలో ఉన్నవారంతా సజీవ దహనమైపోయారు. మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆ సమయంలో సౌందర్య ఐదు నెలల గర్భవతి. ఒక అద్భుతమైన నటి జీవితం 31 సంవత్సరాల అతి చిన్న వయసులో విషాదాంతం కావడం అందర్నీ కలచివేసింది. సౌందర్య నటిగా ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లోనే తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారట. చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళపాటు అగ్రనటిగా కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు, ఆమె కెరీర్ 2004లో ఎండ్ అవుతుందని కూడా ఆయన చెప్పడం కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన చెప్పినట్టుగానే సౌందర్య కెరీర్ ముగిసింది. అదే సమయంలో ఆమె జీవితం కూడా ముగిసిపోవడం విచారకరం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
