ENGLISH | TELUGU  

డిప్రెషన్‌లో వున్న బాబుమోహన్‌ని మామూలు స్థితికి తీసుకొచ్చిన డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

on Apr 14, 2025

(ఏప్రిల్ 14 నటుడు బాబుమోహన్ పుట్టినరోజు సందర్భంగా..)

తెలుగువారు హాస్య ప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. హాస్యం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఆస్వాదించడం మన వారికి అలవాటు. అందుకే సినిమాల్లో హాస్యాన్ని ఎంతో బాగా ఎంజాయ్‌ చేస్తారు. పాత తరం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హాస్య నటులు ఇండస్ట్రీకి వచ్చారంటే వారిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఏ హాస్య నటుడైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి కలిగి ఉంటేనే రాణిస్తారు. అలా పాత తరంలో రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి వారు కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఆ తర్వాతి తరంలో సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, నూతన్‌ప్రసాద్‌, రాళ్ళపల్లి వంటి వారు తమదైన శైలిలో నవ్వులు పూయించారు. ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం ఒక చరిత్ర సృష్టించారు. హాస్యనటుడిగా ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించారు. అతనితోపాటే సినిమాల్లో ప్రవేశించిన బాబుమోహన్‌కి ప్రేక్షకులు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఎవరినీ అనుకరించకుండా ఓ ప్రత్యేకమైన స్టైల్‌, మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరి కలిగిన విశిష్టమైన నటుడు బాబుమోహన్‌. అయితే బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేరు. ఆ తర్వాత కమెడియన్‌గా అంతటి గ్లామర్‌ ఉన్న నటుడు బాబుమోహన్‌. అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాబుమోహన్‌ సినిమా రంగానికి ఎలా వచ్చారు? నటుడుగా నిలదొక్కుకొని స్టార్‌ కమెడియన్‌గా ఎలా ఎదిగారు అనే విషయాలు తెలుసుకుందాం.

1952 ఏప్రిల్‌ 14న ఖమ్మం జిల్లాలోని బీరోలు గ్రామంలో పల్లి ఆనందరావు, పేరమ్మ దంపతులకు జన్మించారు బాబుమోహన్‌. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. బాబుమోహన్‌కి మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. దాంతో తండ్రి మతిస్థిమితం కోల్పోయారు. ఇంటికి సంబంధించిన అన్ని పనులు చేస్తూ చెల్లెల్ని స్కూల్‌ పంపించేవాడు బాబుమోహన్‌. అలా కొన్నాళ్ళ తర్వాత తండ్రి ఆరోగ్యం కుదుటపడిరది. ఆ గ్రామంలోనే ఉంటే తల్లి గుర్తు వస్తోందని కుటుంబం ఖమ్మంకి మారింది. బాబుమోహన్‌ 9వ తరగతిలో ఉండగా తండ్రి చనిపోయారు. ఆ తర్వాత చెల్లెల్ని చూసుకుంటూ ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఇందిర విజయలక్ష్మి పరిచయం కావడం, అది ప్రేమగా మారడం జరిగిపోయింది. బాబుమోహన్‌కి సత్తెనపల్లిలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. అలాగే ఇందిరకు నర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో బాబుమోహన్‌, ఇందిర పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన జాబ్‌ను ఖమ్మంకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు బాబుమోహన్‌. 

బాబుమోహన్‌కి చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా నటుడు కావాలని ఉండేది. అలా ఇంటర్‌లోకి వచ్చేసరికి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. అయితే పెళ్ళయిన తర్వాత కూడా అతను నాటకాలు వేయడం భార్య ఇందిరకు నచ్చేది కాదు. నాటకం వేస్తే నెలరోజులపాటు బాబుమోహన్‌తో ఆమె మాట్లాడేవారు కాదు. అలాగే ఆఫీస్‌కి సెలవు పెట్టి నాటకాలు వేస్తున్నాడని నువ్వు ఎందుకూ పనికి రావు అని ఆఫీస్‌లో ఎగతాళి చేసేవారు. అయితే అప్పుడు కలెక్టర్‌గా ఉన్న మురళీకృష్ణ ఆయన్ని బాగా ఎంకరేజ్‌ చేసేవారు. తనని ఎగతాళి చేసిన వారితో ఒక ఛాలెంజ్‌ చేశారు బాబూమోహన్‌. ‘ఎప్పటికైనా నేను నటుడ్ని అవుతాను. లేకపోతే నా పేరు మార్చుకుంటాను. అంతేకాదు, నేను యాక్టర్‌ అయ్యే వరకు ఫ్లైట్‌ ఎక్కను’ అని ప్రకటించారు. అదే సమయంలో భార్య ఇందిరకు హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయింది. అప్పటికే బాబుమోహన్‌కి ఇద్దరు పిల్లలు కలిగారు. కుటుంబం అంతా హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిపోయింది. బాబుమోహన్‌ ఖమ్మంలో జాబ్‌ చేసేవారు. మూడు రోజులకోసారి హైదరాబాద్‌ వెళ్లేవారు. అది చాలా కష్టంగా ఉండడంతో 5 సంవత్సరాలు లాంగ్‌ లీవ్‌ పెట్టేసి పిల్లల్ని చూసుకునేవారు. ఇలా ఉండగా.. సారధీ స్టూడియోలో కోతలరాయుడు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అది చూసేందుకు అక్కడికి వెళ్లారు బాబుమోహన్‌. తన డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేసే ఒక స్నేహితుడు అక్కడ కనిపించి మురళీకృష్ణ ఇప్పుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని చెప్పడంతో ఆయన్ని కలిశారు బాబుమోహన్‌. హైదరాబాద్‌, ఖమ్మం అప్‌ అండ్‌ చేస్తున్నాడని తెలుసుకొని వెంటనే అతన్ని హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. అలా మళ్లీ ఉద్యోగంలో చేరారు. ఈలోగా దుబాయ్‌లో ట్యూషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఇందిరను నియమించింది ప్రభుత్వం. దీంతో ఆమె దుబాయ్‌ వెళ్లాల్సి వచ్చింది. ఆమె వెళుతూ వెళుతూ టైమ్‌ పాస్‌ కోసం నాటకాలు వేస్తూ ఉండమని భర్తకి చెప్పారు. 

భార్య ఇచ్చిన ప్రోత్సాహంతో ఉత్సాహంగా నాటకాలు వేయడం ప్రారంభించారు బాబుమోహన్‌. అలా ఓసారి రవీంద్రభారతిలో వేసిన నాటకంలో బాబుమోహన్‌ నటన చూసి నిర్మాత రాఘవ ముచ్చటపడ్డారు. తను నిర్మిస్తున్న ‘ఈ ప్రశ్నకు బదులేది?’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘అహ నా పెళ్ళంట’ చిత్రంలో చాలా చిన్న క్యారెక్టర్‌ చేశారు. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘ఆహుతి’ చిత్రం బాబుమోహన్‌కి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ‘అంకుశం’ చిత్రంలో చేసిన వెంకటరత్నం క్యారెక్టర్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు బాబుమోహన్‌. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అయితే ఆ తర్వాత నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ కాకుండా మంచి కమెడియన్‌గా స్థిరపడ్డారు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌ కాంబినేషన్‌ కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. వీరిద్దరి కామెడీకి ఒక స్పెషల్‌ క్రేజ్‌ వచ్చింది. 2010 వరకు నటుడిగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న బాబుమోహన్‌కి ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. 

సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 1998లో లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్‌.టి.ఆర్‌. తెలుగుదేశం పార్టీ తరఫున అమలాపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అదే సంవత్సరం ఆందోల్‌ ఉప ఎన్నికలో చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో కార్మిక శాఖామంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో దామోదర్‌ రాజనరసింహ చేతిలో బాబుమోహన్‌ ఓడిపోయారు. 2014లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆందోల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దామోదర్‌ రాజనరసింహపై గెలుపొందారు. 2018లో టిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023లో ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. 2024 మార్చిలో కె.ఎ.పాల్‌ సారధ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఒక నెలలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలా ఆయన రాజకీయ జీవితం రకరకాల మలుపులు తిరుగుతూ వెళుతోంది. 

ఇక బాబుమోహన్‌ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. ఇందిర విజయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బాబుమోహన్‌. వీరికి ఇద్దరు సంతానం పవన్‌కుమార్‌, విజయ్‌కుమార్‌. 2003 అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు పవన్‌కుమార్‌ మరణించారు. దాంతో బాబుమోహన్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. దాదాపు మూడు నెలలపాటు సినిమాలు చేయకుండా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒక రూమ్‌లోనే గడిపారు. ఆ సమయంలోనే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని చెప్పారు బాబుమోహన్‌. ఆ స్థితి నుంచి అతన్ని బయటికి తీసుకొచ్చి మామూలు మనిషిని చేశారు దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.