Home

»

Bollywood News

ముగిసిన స్వర ప్రస్థానం: ఆశా భోస్లే ఇక లేరు

Apr 12, 2026

భారతీయ సంగీత సామ్రాజ్ఞి, వేల పాటల గల గలలు కురిపించిన ఆశా భోస్లే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. తన అద్భుతమైన స్వరంతో ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన ఆమె ప్రయాణం నేటితో ముగిసింది. గుండెపోటు, ఊపిరి తిత్తుల స‌మ‌స్య‌తో ఏప్రిల్ 11న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రిలో చేరిన ఆశా భోస్లే కొద్ది సేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. ఆమె 7 సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు, రెండు నేష‌న‌ల్ అవార్డులు పొందారు. త‌న కెరీర్‌లో 12,000కి పైగా పాట‌లు పాడారు. 

1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆశా భోస్లే జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ వద్ద సంగీత ఓనమాలు దిద్దారు. అక్క లతా మంగేష్కర్‌తో కలిసి భారతీయ సినిమా పాటను శిఖరాగ్రాన నిలబెట్టారు. 1943లో కేవలం 10 ఏళ్ల వయసులో 'మాఝా బాల్' అనే మరాఠీ సినిమాతో ఆమె పాట ప్రయాణం మొదలైంది. ఆశా భోంస్లే ప్రత్యేకత ఆమె వాయిస్‌లో ఉన్న వైవిధ్యం. మెలోడీ పాటలైనా, హుషారైన డ్యాన్స్ నంబర్లైనా, గజల్స్ అయినా.. ఆమె గొంతులో పలికితే ఆ మజానే వేరు. సుమారు 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నారు.

సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. అలాగే ఎన్నో ఫిలింఫేర్ మరియు నేషనల్ అవార్డులు ఆమెను వరించాయి. లతా మంగేష్కర్ మరణం తర్వాత ఆశా భోస్లే.. మంగేష్కర్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. నేడు ఆమె మరణవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. పాట ఉన్నంత వరకు ఆశా భోస్లే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆశా భోస్లే మ‌ర‌ణం భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని చిత్ర ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com