
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ధురంధర్ 2: ది రివెంజ్' సినిమా పేరు మారుమోగిపోతోంది. గతేడాది విడుదలైన మొదటి భాగం సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి మించిన వేగంతో సీక్వెల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. (Dhurandhar 2)
'ధురంధర్ 2' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రూ.354 కోట్ల నెట్ తో ఓపెనింగ్ వీకెండ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు 'పుష్ప-2' పేరు ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయడానికి 'ధురంధర్ 2' రెడీ అయింది.
పెయిడ్ ప్రీమియర్స్ తో కలిపి మొదటి మూడు రోజుల్లోనే రూ.339 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. నాలుగోరోజు ఆదివారం కావడంతో మరింత దూకుడు చూపిస్తోంది. 77 శాతానికి పైగా అక్యుపెన్సీతో ఈరోజు ఇప్పటికే రూ.30 కోట్ల నెట్ రాబట్టింది. ఆదివారం నాడు మొత్తంగా రూ.100 కోట్ల నెట్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే 'ధురంధర్ 2' ఓపెనింగ్ వీకెండ్ లోనే ఏకంగా రూ.440 కోట్ల నెట్ రాబట్టి ఊహించని రికార్డు ఖాతాలో వేసుకోనుంది.

ప్రపంచవ్యాప్తంగానూ 'ధురంధర్ 2' ఇదే జోరు చూపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రణ్‌వీర్ సింగ్ మాస్ పర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ తన మేకింగ్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. దాదాపు 3 గంటల 50 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమాను మలిచిన తీరు అద్భుతమని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.
కేవలం వసూళ్ల పరంగానే కాకుండా, సెలబ్రిటీల ప్రశంసల విషయంలోనూ 'ధురంధర్ 2' ముందుంది. టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి వారు ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ను అభినందించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సైతం ఈ సీక్వెల్ ఒరిజినల్ కంటే బాగుందని ట్వీట్ చేయడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ కలెక్షన్ల సునామీ చూస్తుంటే, ఈ వీకెండ్ ముగిసే సమయానికి 'ధురంధర్ 2' మరిన్ని అరుదైన మైలురాళ్లను అందుకునేలా కనిపిస్తోంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, లాంగ్ రన్‌లో ఈ చిత్రం 'బాహుబలి-2', 'పుష్ప-2' స్థాయి వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.





