ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి!
on Nov 24, 2025
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24 ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర.. ముంబాయిలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఇటీవల ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన చనిపోయారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే ఆయన మరణవార్త వినాల్సి రావడంతో చిత్ర పరిశ్రమ, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ప్రకాష్ కౌర్ కాగా, రెండో భార్య బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హేమమాలిని. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఈషా, అహానా. మొదటి భార్యకు నలుగురు సంతానం. వారిలో సన్నిడియోల్, బాబీ డియోల్ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించారు. 1960లో వచ్చిన దిల్ భి తేరా హమ్ భి తేరే చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకున్న షోలేలో ధర్మేంద్ర కథానాయకుడు. 65 సంవత్సరాలపాటు నటుడిగా కొనసాగిన ధర్మేంద్ర.. 300కిపైగా సినిమాల్లో నటించి భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ధర్మేంద్ర మృతి పట్ల భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



