Read more!

English | Telugu

నీకు నిజం చెప్పాలి కార్తీక్.. ఇది కృత్రిమ గర్భం కాదు, నీ వల్లే సహజంగా తల్లిన‌య్యాను!

 

'కార్తీక దీపం' సీరియల్ అభిమానులకు ఈ రోజు ఫ్యూజులు ఎగిరిపోయే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. మోనిత గర్భానికి కారణం కృత్రిమ పద్ధతిలు కాదని... తాగిన మత్తులో ఆమెతో కార్తీక్ కలవడం వల్లనే గర్భం వచ్చిందని వెల్లడించారు.‌ మరో వైపు కార్తీక్ వీర్యాన్ని ల్యాబ్ నుంచి మోనిత తీసుకోలేదని నిజం కూడా దీపకు తెలుస్తుంది.‌ దాంతో కథ ఎటువంటి మలుపులు తిరుగుతుందో అని ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడడం ఖాయం. బుధవారం ఎపిసోడ్ లో ఎటువంటి ట్విస్టులు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే...

హిమ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి దీప ఆస్పత్రికి వెళ్తుంది. మార్గ మధ్యంలో మన దగ్గర అత్తయ్య, ఆయన ఏదో విషయం దాచడానికి ప్రయత్నిస్తున్నారని ఆలోచిస్తూనే ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి హిమ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ తీసుకుంటుంది.‌ అక్కడ ఇచ్చిన అమ్మాయి పేరు పల్లవి. అప్పుడు గతంలో పల్లవి అనే అమ్మాయి కార్తీక్ స్పెర్మ్ శాంపిల్స్ మోనితకు ఇచ్చి డబ్బులు తీసుకుని అనే విషయం గుర్తుకు వస్తుంది. దాంతో పల్లవిని చెడామడా తిట్టేస్తుంది. కేసు పెడతానని ఆవేశంతో ఊగిపోతుంది. కార్తీక్ శాంపిల్స్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే రిపోర్టులు కూడా తీసుకోలేదని... అసలు ఆ మోనిత ఎవరనేది తమకు తెలియదని పల్లవి చెబుతోంది. 

కట్ చేస్తే... పురిటి నొప్పులతో బాధపడుతున్న మోనిత దగ్గరకు కార్తీక్, సౌందర్య వెళ్తారు. అప్పటికి మోనిత స్పృహ కోల్పోయి ఉంటుంది. తిరిగి రావడంతో ఆమెను భారతి లేపుతుంది. 'ఏంటి డ్రామానా?' అని కార్తీక్ అంటాడు.‌ కళ్ళు తెరిచిన మోనిత... "నీకు నిజం చెప్పాలి కార్తీక్. ఇది కృత్రిమ గర్భం కాదు, నీ వల్లే నేను సహజంగా తల్లిని అయ్యాను" అని అంటుంది. డ్రామాలు ఆపమని కార్తీక్ కోప్పడతాడు. "ఇన్నాళ్లు ఎన్నో అబద్ధాలు చెప్పాను. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఎందుకు చెబుతా? నా మీద ఒట్టు... నేను ఇష్టపడే నీ మీద ఒట్టు... పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు... నీవల్లే తల్లినయ్యా" అని మోనిత ఏడుస్తుంది. కోర్టులో కూడా ఇలాగే ఒట్లు వేశావని,‌‌ ఈ కుట్ర ఏంటి అని కార్తీక్ ఆవేశంతో ఊగిపోతాడు. ఇన్నాళ్ళు కృత్రిమ గర్భం అని ఎందుకు ప్రచారం చేశావని ప్రశ్నిస్తాడు.

"కట్టుకున్న భార్యను పదకొండేళ్ల దూరం పెట్టావ్. ఇక నన్ను దగ్గరకు తీసుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అని భయంతో ఇన్నాళ్ళు దాచాను. నా వ్యక్తిత్వం కాపాడుకోవడానికి దాచాను. పెళ్లి కాకుండా గర్భవతి అయిందని తెలిస్తే సమాజం దృష్టిలో నేను ఒక పతిత అవుతాను. అందరూ నన్ను ఛీ కొడతారు. చెడిపోయింది అంటారు. పుట్టబోయే బిడ్డను రకరకాల పేర్లతో పిలుస్తారు. అందుకని దాచాను" అని మోనిత చెబుతుంది. అయినా కార్తీక్ కరగలేదు. "మనకీ దరిద్రం ఏంటి మమ్మీ? పోదాం!' అని ఆవేశంగా స్పందిస్తాడు. మోనిత చచ్చిపోతే చచ్చిపోనివ్వమని భారతితో చెబుతాడు. 

"నేను చస్తే నువ్వు నమ్ముతావంటే చచ్చిపోతా. కానీ నా బిడ్డను అనాధగా వదిలేయకు. వాడు నీ రక్తం" కార్తీక్ తో మోనిత చాలా స్పష్టంగా చెబుతుంది. ఏ టెస్టులు అయినా చేయించుకోమని శీల పరీక్షకు సిద్ధం అవుతుంది. తరువాత స్పృహ కోల్పోతుంది. ఎక్కువ సేపు వదిలేస్తే ప్రాణానికే ప్రమాదమని సౌందర్య, భారతి నచ్చజెప్పడంతో కార్తీక్ సంతకం పెడతాడు. అది నేటి ఎపిసోడ్ లో జరిగింది. పండంటి మగబిడ్డ జన్మించినట్లు...‌. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆఖరులో చూపిస్తారు. బహుశా రేపటి ఎపిసోడ్ లో అది ఉండొచ్చు. కార్తీక్ సంతకం చేసిన సంగతి కూడా దీపకు తెలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.