English | Telugu

‘అమరన్‌’ కలెక్షన్‌ రూ.300 కోట్లు.. తనకు రూ.1 కోటి ఇవ్వాలంటూ స్టూడెంట్‌ డిమాండ్‌!

ఒక సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే దర్శకనిర్మాతలు, నటీనటులు ఎంతో కృషి చెయ్యాల్సి ఉంటుంది. ఏ డైరెక్టర్‌ అయినా తన సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలనే కష్టపడతారు. అయితే కొన్ని విజయం సాధిస్తాయి, మరికొన్ని నష్టాలు తెచ్చిపెడతాయి. కొన్ని సినిమాలు సూపర్‌హిట్‌ అయినా ఆ తర్వాత దర్శకనిర్మాతలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ విచిత్రమైన సమస్య కొని తెచ్చుకున్నారు ‘అమరన్‌’ మేకర్స్‌. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ లైఫ్‌ స్టోరీ నేపథ్యంలో రూపొందిన ‘అమరన్‌’ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శివకార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌, వివేక్‌ కృష్ణాని తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించి. పలు భాషల్లో విడుదల చేశారు. 

అక్టోబర్‌ 31న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు ఘనవిజయాన్ని అందించారు. ఇప్పటికీ కలెక్షన్స్‌ రాబడుతూనే ఉంది. సినిమా రిలీజ్‌ అయిన సమయంలో అప్పటి ట్రెండ్‌ని బట్టి రూ.100 కోట్ల వరకు కలెక్ట్‌ చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. అయితే అనూహ్యంగా మూడు వారాల్లో రూ.300 కోట్లు క్రాస్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరో రూ.50 కోట్ల వరకు కలెక్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘అమరన్‌’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న చిత్ర యూనిట్‌కి ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఈ సినిమా తన ప్రైవసీని దెబ్బ తీస్తోందని ఓ స్టూడెంట్‌ కోర్టు కెక్కాడు. ఇది చిత్ర యూనిట్‌ని టెన్షన్‌ పెడుతోంది. విషయం ఏమిటంటే.. ‘అమరన్‌’ సినిమా కథ సాగుతున్న క్రమంలో ఓ సీన్‌లో ఒక ఫోన్‌ నెంబర్‌ చెబుతారు. సినిమాలో వినిపించిన ఆ ఫోన్‌ నెంబర్‌ వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. అది ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ వి.వి.వాగీశన్‌ ఫోన్‌ నెంబర్‌. 

ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజు నుంచీ తనకు విపరీతంగా కాల్స్‌ వస్తున్నాయని, ఆ కాల్స్‌ వల్ల తన ప్రైవసీ దెబ్బతినడమే కాకుండా సమయం కూడా వృధా అవుతోందని వాగీశన్‌ చెబుతున్నాడు. అంతేకాదు, ఆ కాల్స్‌ వల్ల తను మానసికంగా ఆవేదనకు గురవుతున్నానని అంటున్నాడు. ఈ విషయాన్ని అంతటితో వదలకుండా కోర్టు కెక్కాడు ఆ స్టూడెంట్‌. చిత్ర యూనిట్‌కి లీగల్‌ నోటీసులు కూడా పంపాడు. తనకు నష్టపరిహారంగా రూ.1 కోటి చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య రావడం ఇదే మొదటిసారి. స్టూడెంట్‌ పంపిన లీగల్‌ నోటీసుకు చిత్ర యూనిట్‌ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే దీనిపై సోషల్‌ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. మరి ‘అమరన్‌’ యూనిట్‌.. వాగీశన్‌కు నష్టపరిహారం చెల్లిస్తుందో లేదో తెలియాలంటే కొంతకాలం వెయిట్‌ చెయ్యక తప్పదు.