Read more!

English | Telugu

'ఏమి సేతురా లింగ' మూవీ రివ్యూ

సినిమా పేరు: ఏమి సేతురా లింగ
నటీనటులు:  వినోద్ వర్మ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, కేశవ్ దీపక్, ఆనంద్ చక్రపాణి, మేకా రామకృష్ణ, పవన్ రమేశ్
కథ: కె. సందీప్
సంగీతం: జెన్ మార్టిన్
సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్
ఎడిటర్: ప్రీతమ్ దేవ్
సాహిత్యం: భాస్కర్ భట్ల, చైతన్య ప్రసాద్
నిర్మాతలు : సందీప్, మురళీ కృష్ణ
దర్శకత్వం: కె. సందీప్
ఓటీటీ వేదిక: ఆహా

ఓటీటీ వేదికపై కొత్త సినిమాల హవా కొనసాగుతుంది. నూతన నటీనటులతో రూపొందిన కొన్ని చిన్న సినిమాలు నేరుగా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి కోవకి చెందిందే ఈ 'ఏమి సేతుర లింగ'. మరి ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.

కథ: 
ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా భాను(వినోద్ వర్మ) పరిచయమవుతాడు. భాను ఉండే ఇల్లు ఆఫీస్ కి దూరంలో ఉండటం వల్ల ప్రతీరోజు ఆఫీస్ కి లేట్ గా వెళ్తాడు. భాను వాళ్ళ బాస్ ఎప్పుడు తిడుతుంటాడు. ఇక అతనికి కొన్నిరోజులకి తన మీద తనకే జాలేస్తుంది. భాను రిజైన్ చేద్దామనుకున్న ప్రతీసారి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ అని చెప్పి ఇస్తాడు వాళ్ళ బాస్. దాంతో అతను ఏం చేయలేక ఫ్రస్టేట్ అవుతాడు. అప్పుడే అతని ఫ్రెండ్ ఒకడు తనకి రిలేషన్ షిప్ లో ఉండు.. నీ పని భారం తగ్గుతుందని చెప్తాడు. అప్పటినుండి భాను ఏ అమ్మాయికి ట్రై చేసినా సెట్ అవదు. అయితే ఒక అమ్మాయి కాస్త దగ్గరవుతుంది. భానుని తన చుట్టూ తిప్పుకుంటుంది. ఒక వాలెంటైన్స్ డే రోజు భాను ఆ అమ్మాయికి గోల్డ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి భాను ఇచ్చిన రింగ్ తీసుకొని ఫ్రెండ్స్ లా ఉందామని చెప్తుంది. దాంతో ఇక నాకు అమ్మాయిలు సెట్ అవరని అనుకున్న టైంలో భాను లైఫ్ లోకి మరొక అమ్మాయి స్వేచ్ఛ(జ్ఞానేశ్వరి కాండ్రేగుల) వస్తుంది. స్వేచ్ఛ వచ్చాక భాను లైఫ్ ఎలా మారింది? భాను తన కెరీర్ లో సక్సెస్ అయ్యాడా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 
సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేసేవారికి ఉండే పని ఒత్తిడిని చూపిస్తూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాని అదేకోవలో తీద్దామనుకున్నాడేమో సందీప్. రాసుకున్న కథ ప్లాట్ బాగున్నా దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో సందీప్ సక్సెస్ కాలేకపోయాడు. అన్నీ రొటీన్ సీన్స్ లా అనిపిస్తాయి. బాస్ ఎంప్లాయి మీద చూపించే పెత్తనం, ఎంప్లాయి పొందే ఫ్రస్టేషన్.. రిలేషన్స్ ఇలాంటి సన్నివేశాలు ఇప్పటికే జనాలు చూసి చూసి ఉన్నారు. 

ఈ సినిమా టైటిల్ 'ఏమీ సేతుర లింగ' కి స్క్రీన్ మీద వచ్చే సీన్స్ కి పెద్దగా సంబంధం ఉండదు. ఈ సినిమా చివరి ఇరవై నిమిషాలు మినహా ఏదీ అంతలా ఆకట్టుకోలేకపోతుంది. గొప్పగా ఈ సీన్ ఉందని చెప్పుకునేందుకు ఏదీ లేదు. భాను పాత్రకి ఒక ఇంపార్టెన్స్ లేదు. ఒక మెచురిటీ లేదు. ఒక హీరో తన సొంత డెసిషన్స్ ని కూడా కాన్ఫిడెంట్ గా తీసుకోలేకపోవడం భాను పాత్రని తగ్గించేసింది. స్వేచ్ఛ(జ్ఞానేశ్వరి కాండ్రేగుల) పాత్రకి ఉన్నంత ప్రాముఖ్యత కూడా భాను పాత్రకి ఉండకపోవడం సినిమాకి పెద్ద మైనస్. 

స్వేచ్ఛ పాత్ర ఈ సమాజంలో చాలా మంది ఆడవాళ్ళని ఆలోచింపజేస్తుంది. ఒక మెచుర్డ్ అమ్మాయిగా స్వేచ్ఛ పాత్రని బాగా మలిచారు డైరెక్టర్. అయితే దీనిని సినిమాగా కంటే ఒక షార్ట్ ఫిల్మ్ లా తీసుంటే బాగుండేది. ఈ చిన్న కథని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు.

మనం చేసే జాబ్ మనకి నచ్చేది  కానప్పుడు.. మనకి ఏదైతే నచ్చుతుందో అదే చేయాలి. ఆ నచ్చిన దానికోసం కనీసం ప్రయత్నించాలి అనే మెసేజ్ ని ఒక సినిమాగా తీర్చిదిద్దారు మేకర్స్. అయితే ఈ కథకి షార్ట్ ఫిల్మ్ అయితే సరిపోయేది.. కానీ సినిమాగా తీయడమనేది సెట్ కాలేదు.. నిడివి కాస్త ఎక్కువైంది. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొత్తంలో వావ్ అనే షాట్స్ ఒక్కటీ లేకపోవడం కాస్త నిరాశని కలిగించాయి. ప్రీతమ్ దేవ్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భాస్కర భట్ల రాసిన పాట బాగుంది. నిర్మాణ  విలువలు అంత రిచ్ గా ఏమీ లేవు. 

నటీనటుల పనితీరు: 
భాను పాత్రలో వినోద్ వర్మ ఆకట్టున్నాడు. సాఫ్ట్ వేర్ జాబ్ లు చేసుకుంటున్న ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా వినోద్ వర్మ చాలా సహజంగా నటించాడు. స్వేచ్ఛ పాత్రలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఒదిగిపోయింది. చాలా మెచుర్డ్ మైండ్ సెట్ గల అమ్మాయిగా  జ్ఞానేశ్వరి కాండ్రేగుల నటించింది. ప్రతీ ఆఫీస్ లో బాస్ ఎలా ఉంటారో అందుకు తగ్గట్టుగా కేశవ్ దీపక్ ఉన్నాడు సరిపోయాడు.  ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
అంచనాలేమీ లేకుండా ఈ సినిమా చూస్తే పర్వాలేదనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ ప్రాబ్లమ్స్, కెరీర్ గురించి మంచి కథ ఉందేమోనని ఆశతో చూడాలనుకుంటే నిరాశే ఎదురవుతుంది. 

రేటింగ్: 2 /5

-దాసరి  మల్లేశ్