English | Telugu
ఆ పాన్ ఇండియా హీరోతో పూరి సినిమా.. ఇదసలు ఎవరూ ఊహించని కాంబో!
Updated : May 15, 2024
ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా పోటీ పడేవారు. ఎందుకంటే ఆయన హీరోలను ప్రజెంట్ చేసే విధానం కొత్తగా ఉంటుంది. పూరి సినిమాల్లోని హీరోల ఆటిట్యూడ్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయి. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా పూరి డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలు అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొంతకాలంగా పూరి ట్రాక్ రికార్డు అంతగా బాలేదు. పైగా స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమాల జపం చేస్తూ, పూరి వైపు చూడటం మానేశారు. దీంతో పూరి ఈమధ్య ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరో యంగ్ హీరోతో పూరి సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart) అనే సినిమాని రూపొందిస్తున్నాడు పూరి జగన్నాథ్. 2019 లో రామ్-పూరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ (double ismart teaser) కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ మాస్ ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, పూరి తన తదుపరి సినిమాని తేజ సజ్జాతో చేయనున్నట్లు సమాచారం. 'హనుమాన్'తో సంచలన విజయాన్ని అందుకొని, పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమేనని డైరెక్షన్ లో 'మిరాయ్' సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత తేజ.. పూరితో చేతులు కలపబోతున్నట్లు వినికిడి. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, 'డబుల్ ఇస్మార్ట్' విడుదలయ్యాక తేజ-పూరి కాంబినేషన్ మూవీ ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.