English | Telugu
ఒకప్పుడు లవర్‌బోయ్.. ఇప్పుడు మాస్ యాక్షన్ హీరో!
Updated : May 14, 2024
రామ్ పోతినేని.. ఒకప్పుడు సెన్సిబుల్ లవ్‌స్టోరీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవాడు. యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేవాడు. రాను రాను తన పంథా మార్చుకొని మాస్ హీరోగా తనను తాను మలుచుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో లవ్ ఎంటర్‌టైనర్స్‌తో ఆకట్టుకున్న రామ్ ఇప్పుడు మాస్, యాక్షన్ సినిమాలతోనే తన టాలెంట్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. చివరగా రామ్ హీరోగా నటించిన ‘స్కంద’ గత ఏడాది విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంతో మరోసారి మాస్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మే 15 రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. ఈ టీజర్‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మే 15 పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా రామ్ పోతినేని కెరీర్ ఎలా ప్రారంభమైంది? అతను చేసిన సినిమాలు అతన్ని ఆడియన్స్‌కి ఎంత దగ్గర చేసాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
2002లో తమిళ్‌లో రూపొందిన ‘అడయాళం’ అనే ఓ షార్ట్ ఫిలింలో డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయిన 18 ఏళ్ళ కుర్రాడిగా నటించాడు రామ్. 2006లో వై.వి.యస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలోని తన పెర్‌ఫార్మెన్స్‌తో యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాడు. తన మొదటి సినిమాతోనే కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరుచుకోగలిగాడు. అయితే రెండో సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జగడం’ అతని లవర్‌బోయ్ లుక్‌కి బ్రేక్ వేసింది. అది అతని వయసుకు మించిన సినిమాగా తేల్చేశారు ప్రేక్షకులు. దీంతో ఆ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత తన ఫిజిక్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ సినిమాలతోనే ప్రేక్షకుల్ని మెప్పించాలన్న ఉద్దేశంతో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘రెడీ’ చిత్రంతో యూత్‌లో మళ్ళీ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు. ఆ సినిమా నుంచి ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం వరకు వరసగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చాడు. అందులో కొన్ని విజయం సాధించగా, మరికొన్ని అతనికి సక్సెస్‌ని ఇవ్వలేకపోయాయి. రామ్ కెరీర్‌లో ఇప్పటివరకు హీరోగా 20 సినిమాలు చేశాడు.
2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో తన లుక్, గెటప్, స్టైల్ అన్నీ ఒక్కసారిగా మార్చేశాడు. పూర్తి రఫ్ లుక్‌లో కనిపిస్తూ తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడే ఊర మాస్ క్యారెక్టర్ ఆ సినిమాలో చేశాడు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాంతో మళ్ళీ లవ్ ఎంటర్‌టైనర్స్ వైపు వెళ్ళలేదు. ఆ సినిమా తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలు చేశాడు. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తర్వాత మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో ‘స్కంద’ చిత్రం చేశాడు. ఇది కూడా డిజాస్టర్ అయింది. మాస్ హీరోగా తనకెంతో పేరు తెచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్. ఈ సినిమా తర్వాత గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. లవర్‌బోయ్ నుంచి ఒక్కసారిగా మాస్ యాక్షన్ హీరోగా టర్న్ అయిన రామ్ పోతినికి ‘డబుల్ ఇస్మార్ట్’ మరో ఘనవిజయాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.