Read more!

English | Telugu

నెట్ ఫ్లిక్స్ తో రాజమౌళి వెబ్ సిరీస్.. మహేష్ మూవీ పరిస్థితేంటి?

'బాహుబలి' ఫ్రాంచైజ్, 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా థియేటర్స్ లో దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' ఇటీవల ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సత్తా చాటుతోంది. హాలీవుడ్ స్టార్స్ సైతం 'ఆర్ఆర్ఆర్'కి ఫిదా అవుతున్నారు. ఎందరో స్టార్స్ ఆర్ఆర్ఆర్ ని, రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తోందట నెట్ ఫ్లిక్స్.

నిజానికి 'బాహుబలి' ఫ్రాంచైజ్ సంచలన విజయం తర్వాత 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్. దీనికోసం ప్రముఖ రైటర్స్ ని, డైరెక్టర్స్ ని రంగంలోకి దింపింది. కానీ అవుట్ పుట్ పట్ల సంతృప్తిగా లేమంటూ దానిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో మరోసారి రాజమౌళి సంచలనం సృష్టించడంతో.. ఈసారి నేరుగా ఆయన్నే రంగంలోకి దింపాలని భావిస్తోందట. రాజమౌళి బ్రాండ్ తో తమ సంస్థలో ఒక సిరీస్ రావాలన్న ఉద్దేశంతో ఆయనకు ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే నెట్ ఫ్లిక్స్ ఆఫర్ కి రాజమౌళి ఓకే చెప్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్న రాజమౌళి.. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. ఈలోపు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా పూర్తి చేయనున్నాడు. ఒకవేళ నెట్ ఫ్లిక్స్ ఆఫర్ కి రాజమౌళి ఓకే చెప్తే.. మహేష్ తో ఆయన చేసే సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే రాజమౌళి సిరీస్ అంటే అది ఆయన సినిమాల రేంజ్ లోనే భారీగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సిరీస్ పూర్తి చేయాలంటే కనీసం 1-2 ఏళ్ళు పడుతుంది. అదే జరిగినట్ రాజమౌళి-మహేష్ చిత్రం ఆలస్యమైనట్లే!.