English | Telugu

కూలీ లెక్కలు మారిపోయాయి.. సూపర్‌స్టార్‌కి తోడుగా కింగ్‌, మాస్‌మహారాజా!

ఈమధ్యకాలంలో లోకేష్‌ కనకరాజ్‌ సినిమాలకు ఎంత ఫాలోయింగ్‌ వచ్చేసిందో చూస్తూనే ఉన్నాం. తాజాగా రజినీకాంత్‌తో చేస్తున్న కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున క్యారెక్టర్‌ రజినీకాంత్‌కి ధీటుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా కనిపించనున్నాడనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్‌ మన్మథుడైన నాగార్జున విలన్‌గా నటించడం ఏమిటి అనేది ఎవ్వరికీ అంతుబట్టని విషయం. 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు కూలీకి సంబంధించిన మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. మరో కీలక పాత్రలో రవితేజ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేదే ఆ వార్త. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ న్యూస్‌ మాత్రం వైరల్‌ అవుతోంది. ఈ గాసిప్‌ రావడం వెనుక కారణం ఏమిటి అని ఆరా తీస్తే.. అనకాపల్లిలో కూలీ షూటింగ్‌ జరుగుతోంది. సెట్‌లో నాగార్జునతోపాటు రవితేజ కూడా కనిపించాడట. దాంతో ఆ సినిమాలో రవితేజ చేస్తున్నాడు అనే వార్త బయటికి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది.